India EV Guide 2025: ఎలక్ట్రిక్ వాహనం (EV) కొనుగోలు చేయడం తెలివైన నిర్ణయం. అతి మీకు వ్యక్తిగతంగా ఖర్చు తగ్గించడమే కాకుండా పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉంటోంది. కానీ సరైన అవగాహన లేకుండా తీసుకున్న నిర్ణయం మీకు 15 నుంచి 20 లక్షల రూపాయల నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉంది. చాలా మంది తమ మొదటి EVని కొనుగోలు చేసేటప్పుడు కొన్ని సాధారణ తప్పులు చేస్తారు. ఈ తప్పులు చేయుంటే డబ్బు, సమయాన్ని వృథా చేయకుండా, EV ప్రయోజనాలను పూర్తిగా పొందవచ్చు.

Continues below advertisement

తప్పు 1: కేవలం రేంజ్ చూసి EV తీసుకోవడం 

EVల గురించి ప్రజల్లో ఉన్న అతి పెద్ద ఆందోళన 'రేంజ్'. ఈ కారణంగా, చాలా మంది 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ అందించే EVల వెంట పరుగులు తీసి, అనవసరంగా 15 నుంచి 20 లక్షల రూపాయలు అదనంగా ఖర్చు చేస్తారు.

వాస్తవం ఏమిటంటే: మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ (MoRTH) ప్రకారం, 80% మంది ప్రజలు రోజువారీగా కేవలం 40 నుంచి 50 కి.మీ మాత్రమే ప్రయాణిస్తారు. కాబట్టి, హైవే డ్రైవ్ ఎక్కువగా ఉంటే తప్ప, 400 లేదా 500 కి.మీ రేంజ్ ఉన్న వాహనంతో మీకు పెద్దగా ప్రయోజనం ఉండదు.

Continues below advertisement

ఉన్న ప్రమాదం: బ్యాటరీ పెద్దదిగా ఉంటే, ఛార్జింగ్ సమయం పెరుగుతుంది, వాహనం బరువు పెరుగుతుంది, ఎక్కువ ముందస్తు ఖర్చు అవుతుంది, మీ పెట్టుబడిపై రాబడి ఆలస్యం అవుతుంది. అధిక టార్క్, హై పర్ఫార్మెన్స్ అందించే EVలు వాటి ఇండస్ట్రీ డ్రైవింగ్ సైకిల్ రేంజ్‌లో, వాస్తవ ప్రపంచ రేంజ్‌కు (300-350 కి.మీ) చాలా పెద్ద వ్యత్యాసాన్ని చూపిస్తాయి.

పరిష్కారం: మీ రోజువారీ డ్రైవింగ్ సరళిని నిజాయితీగా విశ్లేషించండి. రేంజ్‌ను భావోద్వేగంతో కాకుండా, లాజిక్‌తో ఎంచుకోండి.

తప్పు 2:హోమ్ ఛార్జింగ్ సెటప్‌ను విస్మరించడం

'ఇంట్లో 15 ఆంపియర్ సాకెట్ ఉంటే ఛార్జింగ్ అయిపోతుంది' అని అనుకోవడం చాలా మంది చేసే మరో పెద్ద తప్పు. ఇది ప్రత్యేకంగా అపార్ట్‌మెంట్‌లు లేదా సొసైటీలలో నివసించే వారికి పెద్ద సమస్య.

ఛాలెంజెస్: మీరు సొసైటీలో ఉంటే, మీ సొసైటీ EV ఛార్జర్ కోసం NOC ఇచ్చిందా? మీటర్ సామర్థ్యం ఉందా, లేదా అదనంగా కొత్త మీటర్ అవసరమా?, ఛార్జింగ్ కోసం మీ బిల్డింగ్‌లో వైరింగ్ సురక్షితంగా ఉందా? ఈ అంశాలను పరిశీలించకుండా EV కొంటే, ఛార్జింగ్ కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సొసైటీలు ఏర్పాటు చేసిన కొద్దిపాటి ఛార్జింగ్ స్టేషన్లలో తరచుగా వాహనాలు ఛార్జ్ అవుతూ ఉంటాయి, ఇది మీ ఛార్జింగ్ సమయాన్ని పెంచుతుంది. అంతేకాకుండా, కరెంట్‌ హెచ్చుతగ్గుల వల్ల ఛార్జింగ్ ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది.

పరిష్కారం: EVని ఎంచుకునే ముందు, మీ ఇంటి చుట్టూ ఉన్న ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పూర్తిగా విశ్లేషించండి. మీ సొంత ఇంట్లో, రాత్రిపూట సాధారణ 3.3 kW ఛార్జర్‌తో (10-12 గంటలు తీసుకుంటుంది) ఛార్జ్ చేసుకోవడం సులభం.

తప్పు 3: EV టైర్లను తేలికగా తీసుకోవడం

చాలా మంది EV కొని, మరింత స్టైల్‌ కోసం వైడర్‌ టైర్లను అమర్చుకుంటారు. కానీ ఇది మీ కారు రేంజ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది.

EV టైర్ల లాజిక్‌: EV టైర్లు ప్రత్యేకంగా రూపొందిస్తారు. వీటిలో తక్కువ రోలింగ్ రెసిస్టెన్స్ ఉంటుంది, అధిక టార్క్‌ను నిర్వహించే సామర్థ్యం ఉంటుంది, రీజనరేటివ్ బ్రేకింగ్‌కు అనుగుణంగా ఎఫిషియెంట్‌గా పనిచేస్తాయి. మీరు వెడల్పాటి టైర్లను అమర్చినప్పుడు, రోడ్ గ్రిప్ పెరిగి, రోలింగ్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. దీనివల్ల మీ రేంజ్ 10 నుంచి 15% వరకు తగ్గుతుంది.

తప్పు 4: ఇన్సూరెన్స్, రీసేల్ విలువను నిర్లక్ష్యం చేయడం

EV కొనేటప్పుడు చేసే మరో పెద్ద తప్పు, డీలర్ వద్ద నుంచే ఏ రీసెర్చ్ లేకుండా ఇన్సూరెన్స్ తీసుకోవడం.

రీసేల్ విలువ: ఎలక్ట్రిక్ వాహనాల రీసేల్ విలువ పెట్రోల్ లేదా డీజిల్ వాహనాల కంటే 20% నుంచి 30% వరకు తక్కువగా ఉంటుంది. అందుకే, మీరు కొనే EV రీసేల్ విలువ మార్కెట్‌లో ఎంత ఉందో తెలుసుకోవడానికి Olx, Cars24 వంటి పోర్టల్‌లలో తనిఖీ చేయండి.

ఇన్సూరెన్స్ జాగ్రత్తలు: సాధారణ ఇన్సూరెన్స్ పాలసీలు బ్యాటరీ డిగ్రేడేషన్‌ను కవర్ చేయవు. కాబట్టి, మీరు EV-నిర్దిష్ట ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇందులో జీరో డిప్రిసియేషన్‌తో పాటు, బ్యాటరీ, ఛార్జర్, వాటర్ డ్యామేజ్‌ కవరేజ్ ఉండేలా చూసుకోండి. బ్యాటరీ డ్యామేజ్ అయినప్పుడు, సరైన యాడ్-ఆన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్ తిరస్కరిస్తాయి.

తప్పు 5: ఫాస్ట్ ఛార్జింగ్‌పై అతిగా ఆశలు పెట్టుకోవడం

చాలా మంది,'ఫాస్ట్ ఛార్జింగ్ అంటే 30-45 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది' అని భావిస్తారు. కానీ ఇది వాస్తవం కాదు.

వాస్తవ పరిస్థితులు: చాలా EVలు 10% నుంచి 80% వరకు ఛార్జ్ కావడానికి 50 నుంచి 70 నిమిషాలు తీసుకుంటాయి. మీ వాహనం 150-200 kW ఛార్జర్‌కు మద్దతు ఇచ్చినప్పటికీ, ఆచరణలో, మీ చుట్టూ ఉన్న ఛార్జర్‌లు కేవలం 60 kW లేదా 80 kW వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీనివల్ల ఛార్జింగ్ సమయం పెరుగుతుంది, కొన్నిసార్లు గంటన్నర లేదా 30 kW ఛార్జర్ ఉంటే రెండున్నర గంటలు కూడా పట్టవచ్చు.

ఇతర ప్రమాదాలు: డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ను రోజూ ఉపయోగించడం వల్ల మీ బ్యాటరీ వేగంగా డిగ్రేడ్ అవుతుంది. అంతేకాకుండా, పబ్లిక్ ఫాస్ట్ ఛార్జర్‌లలో 85% కంటే తక్కువ సమయం మాత్రమే పనిచేస్తుంటాయి . హైవేలపై కుటుంబంతో ప్రయాణిస్తున్నప్పుడు ఛార్జర్ పనిచేయకపోతే, అది చాలా పెద్ద ఇబ్బందిగా మారుతుంది.

తప్పు 6: బెస్ట్/బేస్ వేరియంట్‌ను గుడ్డిగా ఎంచుకోవడం

EVలలో, మీరు బయటి నుంచి ఏవైనా ఉపకరణాలు లేదా మోడిఫికేషన్లు చేయిస్తే, అది కంపెనీ వారంటీని రద్దు చేయవచ్చు. అగ్ని ప్రమాదాలకు దారితీసే ప్రమాదం ఉంది.

సరైన ఎంపిక: మీరు చీపెస్ట్ లేదా బేస్ వేరియంట్ తీసుకుంటున్నట్లయితే, అందులో ఫాస్ట్ ఛార్జింగ్ లేదా యాప్ సేవలు వంటి ఆచరణాత్మకంగా అవసరమైన ఫీచర్లు ఉన్నాయా లేదా అని నిర్ధారించుకోవాలి. మీకు అదనపు ఫీచర్ల పట్ల ఆసక్తి ఉంటే, బయట చేయించడం కంటే, టాప్ వేరియంట్ లేదా మిడ్ వేరియంట్‌ను ఎంచుకోవడం ఉత్తమం. బయటి ఉపకరణాలు మీ బ్యాటరీ వారంటీని రద్దు చేస్తాయి.

తప్పు 7: 'జీరో మెయింటెనెన్స్' అని అనుకోవడం

EVలలో ఆయిల్ మార్చాల్సిన అవసరం లేదు, కానీ దీని అర్థం మెయింటెనెన్స్ అసలే లేదని కాదు. ఈ విధంగా ఆలోచించడం తప్పు.

EV మెయింటెనెన్స్: EVలకు కూడా రెగ్యులర్ మెయింటెనెన్స్ అవసరం. బ్రేక్ ప్యాడ్లు మార్చడం, సస్పెన్షన్ సమస్యలు, ఏసీ కంప్రెషర్ చెక్‌చేయాలి. ముఖ్యంగా, ప్రతి 6 నుంచి 12 నెలలకు బ్యాటరీ డయాగ్నోస్టిక్ రిపోర్ట్ చేయించుకోవాలి, దీనికి ఖర్చు అవుతుంది. ఐసీఈ (ICE) వాహనాలతో పోలిస్తే EV టైర్లు త్వరగా అరిగిపోతాయి. అవి ఖరీదైనవిగా కూడా ఉంటాయి. అంతేకాకుండా, భవిష్యత్తులో ఓటీఏ (OTA) అప్‌డేట్‌ల కోసం కొన్ని బ్రాండ్‌లు ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంది.

LFP వర్సెస్ NMC బ్యాటరీ

మీ వినియోగాన్ని బట్టి సరైన బ్యాటరీ కెమిస్ట్రీని ఎంచుకోవడం మంచిది.

• ఎల్‌ఎఫ్‌పి (LFP) బ్యాటరీస్: ఇవి సురక్షితమైనవి, రోజువారీ వినియోగానికి మెరుగైనవి, ఎక్కువ లైఫ్ సైకిల్ కలిగి ఉంటాయి. వీటి రేంజ్ కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ, ఉదాహరణకు టాటా టియాగో ఈవీ ఈ బ్యాటరీలను వాడుతోంది.

• ఎన్ఎంసీ (NMC) బ్యాటరీస్: ఇవి ఎక్కువ రేంజ్, పర్ఫార్మెన్స్ అందిస్తాయి, కానీ అధిక వేడిలో తక్కువ స్థిరంగా ఉంటాయి. వీటిని భర్తీ చేసే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఎంజీ జెడ్ఎస్ ఈవీ (MG ZS EV) ఈ బ్యాటరీలను ఉపయోగిస్తుంది.

మీరు EV కొనేటప్పుడు ఈ అంశాలను పరిశీలించి, మీ బడ్జెట్‌ను తెలివిగా ప్లాన్ చేసుకుంటే, మీ EVతో మంచి ప్రయోజనం పొందుతారు.