February 2026 electric two wheeler sales: భారతదేశంలో ఎలక్ట్రిక్‌ రెండు చక్రాల వాహనాల మార్కెట్‌ మరింత వేగం అందుకుంది. ఫిబ్రవరి 2026 నెలలో ఈ విభాగం బలమైన వృద్ధిని నమోదు చేసింది. మొత్తం 1,11,680 యూనిట్లు రిటైల్‌గా విక్రయమయ్యాయి. గత ఏడాది (2025) ఇదే నెలలో 76,720 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే, ఒక్క ఏడాదిలోనే 46 శాతం పెరుగుదల కనిపించింది.

FY2026లో, అక్టోబర్‌ 2025 తర్వాత ఇదే రెండో అత్యధిక నెలవారీ అమ్మకాల రిపోర్ట్‌. ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో మొత్తం అమ్మకాలు ఇప్పటికే 12 లక్షల యూనిట్లు దాటాయి. గత ఆర్థిక సంవత్సరపు మొత్తం 11.5 లక్షల రికార్డును కూడా ఈ నంబర్‌ ఇప్పటికే అధిగమించింది. మార్చి అమ్మకాలను కూడా కలుపుకుంటే కొత్త రికార్డు నమోదయ్యే అవకాశం ఉంది.

టీవీఎస్‌ మోటార్‌ ముందంజ

గత నెల (ఫిబ్రవరి 2026)లో, టీవీఎస్‌ మోటార్‌ మొత్తం 31,600 యూనిట్లు విక్రయించి మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. అంటే, దేశవ్యాప్తంగా జనం ఎక్కువగా కొన్నది ఈ కంపెనీ స్కూటర్లనే. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 67 శాతం ఎక్కువ. ఇప్పుడు, ఎలక్ట్రిక్‌ టూవీలర్ల సేల్స్‌లో టీవీఎస్‌ మార్కెట్‌ షేర్‌ 28 శాతంగా ఉంది. ఈ కంపెనీ తీసుకొచ్చిన iQube, Orbiter వంటి మోడళ్లకు మంచి స్పందన లభిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కంపెనీ 2,90,746 యూనిట్లు విక్రయించింది. సంవత్సరం ముగిసే సరికి సుమారు 3,25,000 యూనిట్ల రికార్డుకు చేరే అవకాశముంది.

బజాజ్‌ ఆటో రెండో స్థానంలో

బజాజ్‌ ఆటో ఫిబ్రవరిలో 25,323 చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు విక్రయించింది. 23 శాతం మార్కెట్‌ షేర్‌ సాధించింది. ఇటీవల చేతక్‌ C2501ను రూ.91,399 (ఎక్స్‌-షోరూమ్‌ ధర, బెంగళూరు) ధరతో మనకు పరిచయం చేసింది. 2.5 కిలోవాట్‌ హవర్స్‌ బ్యాటరీతో 113 కిలోమీటర్ల IDC రేంజ్‌ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. హైదరాబాద్‌లో ఈ మోడల్‌ ధర సుమారు రూ.1 లక్ష దాటే అవకాశం ఉంది.

ఏథర్‌ ఎనర్జీ బలమైన వృద్ధి

గత నెలలో, ఏథర్‌ ఎనర్జీ 20,581 యూనిట్లను విక్రయించింది. గత సంవత్సరం ఇదే కాలం కంటే 72 శాతం వృద్ధి సాధించి 18 శాతం మార్కెట్‌ షేర్‌ పొందింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటిసారి 2 లక్షల యూనిట్ల మైలురాయిని దాటింది. రిజ్టా ఫ్యామిలీ స్కూటర్‌కు మంచి డిమాండ్‌ ఉంది.

హీరో మోటోకార్ప్‌ - Vida దూకుడు

హీరో మోటోకార్ప్‌ Vida బ్రాండ్‌ ద్వారా 12,512 యూనిట్లను విక్రయించింది. 2025 ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఈసారి ఏకంగా 364 శాతం పెరుగుదల సాధించింది. వరుసగా ఎనిమిదో నెల కూడా 10,000 యూనిట్ల సేల్స్‌ను దాటింది. ఇటీవల VX2 3.4 కిలోవాట్‌ హవర్స్‌ వేరియంట్‌ను అందించింది.

గ్రీవ్స్‌ ఎలక్ట్రిక్‌ ఓలాను దాటింది

గ్రీవ్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ (Ampere బ్రాండ్‌) 4,725 యూనిట్లు విక్రయించి ఐదో స్థానానికి చేరుకుంది. ఈ కంపెనీ, ఓలా ఎలక్ట్రిక్‌ను తొలిసారి అధిగమించింది. ఓలాతో పోలిస్తే 757 యూనిట్లు ఎక్కువగా అమ్మింది. మొత్తం కలిపి కంపెనీ 2.70 లక్షల యూనిట్లు దాటింది.

ఓలా ఎలక్ట్రిక్‌ పతనం

ఓలా ఎలక్ట్రిక్‌ ఫిబ్రవరిలో కేవలం 3,968 యూనిట్లు మాత్రమే విక్రయించింది. నాలుగో అతి తక్కువ నెలవారీ అమ్మకాలుగా ఇది నిలిచింది. ప్రస్తుతం నాలుగు అంకెల అమ్మకాలకే పరిమితమైంది. మార్కెట్‌ షేర్‌ కేవలం 4 శాతానికి పడిపోయింది. గతంలో 24 శాతం మార్కెట్‌ షేర్‌తో ముందంజలో ఉన్న కంపెనీకి ఇది చాలా గట్టి షాక్‌.

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి

హైదరాబాద్‌, విజయవాడ వంటి నగరాల్లో ఎలక్ట్రిక్‌ స్కూటర్లపై ఆసక్తి పెరుగుతోంది. ఇంధన ధరలు పెరగడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, తక్కువ నిర్వహణ ఖర్చు కారణంగా ఈవీలపై వైపు మళ్లుతున్నారు. రాబోయే నెలల్లో మరింత పోటీ పెరిగే అవకాశం ఉంది.

మొత్తానికి FY2026 సంవత్సరం ఎలక్ట్రిక్‌ టూవీలర్‌ విభాగానికి రికార్డు సంవత్సరంగా నిలిచే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.