FASTag Annual Pass Details In Telugu: జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే ప్రైవేట్‌ వాహనాల డ్రైవర్లు/యజమానులకు ఊరటనిచ్చే పథకమే ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌. టోల్‌ ప్లాజాల వద్ద "పదే పదే రీఛార్జ్‌ సమస్య లేకుండా, ఒక్కసారి చెల్లింపుతో ఏడాది పాటు హైవే ప్రయాణం చేసే వెసులుబాటు"తో, కేంద్ర ప్రభుత్వం ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఫాస్ట్‌ట్యాగ్‌ వార్షిక పాస్‌ అంటే ఏంటి?

FASTag వార్షిక పాస్‌ అంటే, మీ వాహనానికి ఇప్పటికే ఉన్న FASTag‌కే అదనపు యాక్టివేషన్‌ చేసే ప్రత్యేక సదుపాయం. రూ.3,000 ఒకేసారి చెల్లిస్తే, ఒక సంవత్సరం లేదా గరిష్ఠంగా 200 టోల్‌ ప్లాజా క్రాసింగ్‌ల వరకు టోల్‌ చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇప్పటి వరకు ఉన్న గణాంకాల ప్రకారం, ప్రతి క్రాసింగ్‌కు సగటున రూ.15 చొప్పున మాత్రమే టోల్‌ ఖర్చు వస్తుంది.

ఎవరు ఈ పాస్‌ తీసుకోవచ్చు?

ఈ వార్షిక పాస్‌ నాన్‌ కమర్షియల్‌ (వాణిజ్యం/వ్యాపారం కోసం ఉపయోగించని) వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. ప్రైవేట్‌ (సొంత/కుటుంబ వాడకం కోసం) కార్లు, జీపులు, వాన్లు వంటి వాహనాలు ఉన్నవారు ఈ పాస్‌ను ఉపయోగించుకోవచ్చు. కమర్షియల్‌ వాహనాలకు ఈ సదుపాయం వర్తించదు.

ఫాస్ట్‌ట్యాగ్‌ వార్షిక పాస్‌ను ఎలా తీసుకోవాలి?

FASTag వార్షిక పాస్‌ను తీసుకోవడం చాలా సులభం. రాజ్‌మార్గయాత్ర యాప్‌ (Rajmarg Yatra App) లేదా NHAI అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా రూ.3,000 చెల్లిస్తే సరిపోతుంది. చెల్లింపు పూర్తైన రెండు గంటల్లోనే, మీ వాహనానికి లింక్‌ అయిన ‍‌(ఇప్పటికే ఉన్న) FASTag‌పై ఈ పాస్‌ యాక్టివేట్‌ అవుతుంది. కొత్త FASTag తీసుకోవాల్సిన అవసరం లేదు.

ఎక్కడ వర్తిస్తుంది?

ఈ పాస్‌ దేశవ్యాప్తంగా సుమారు 1,150 జాతీయ రహదారి, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వే టోల్‌ ప్లాజాల్లో వర్తిస్తుంది. రాష్ట్ర హైవేలు లేదా ప్రైవేట్‌ రోడ్లపై ఉన్న టోల్‌ ప్లాజాల్లో ఇది పనిచేయదు.

షరతులు & నిబంధనలు

పాస్‌ చెల్లుబాటు ఒక సంవత్సరం లేదా 200 ట్రిప్స్‌ వరకు మాత్రమే ‍‌(ఏది ముందయితే అది వర్తిస్తుంది)

గడువు పూర్తయిన తర్వాత మళ్లీ కొత్తగా రీఛార్జ్‌ చేసుకోవాలి

వాహనం అమ్మినప్పుడు లేదా FASTag మార్చినప్పుడు పాస్‌ ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది

టోల్‌ రేట్లు పెరిగినా, యాన్యువల్‌ పాస్‌ యూజర్లకు అదనపు ఛార్జీలు ఉండవు

రీఛార్జ్‌ ఎలా చేసుకోవాలి?

FASTag వార్షిక పాస్‌కు ప్రత్యేక రీఛార్జ్‌ అవసరం లేదు. పాస్‌ గడువు పూర్తయ్యాక మళ్లీ కొత్త వార్షిక పాస్‌ కొనుగోలు చేయాలి. అయితే, ఫ్యూయల్‌ స్టేషన్లు లేదా పార్కింగ్‌ వంటి ఇతర సేవలకు సాధారణ FASTag బ్యాలెన్స్‌ ఉండాలి.

ఈ పాస్‌తో ఉపయోగాలు ఏంటి?

హైవే ప్రయాణ ఖర్చు భారీగా తగ్గుతుంది

టోల్‌ ప్లాజాల దగ్గర ఆగాల్సిన అవసరం ఉండదు

తరచూ ప్రయాణించే వారికి సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి

త్వరలో రాబోయే 'గేట్లు లేని టోల్‌ విధానం' అమలుకు ఇది ఉపయోగపడుతుంది

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.