FASTag Annual Pass Details In Telugu: దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రైవేట్‌ కార్‌ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ (FASTag Annual Pass) పథకం అంచనాలకు మించి విజయం సాధిస్తోంది. 2025 ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పాస్‌ కేవలం ఆరు నెలల్లోనే 50 లక్షల మంది యూజర్లను చేరుకుంది. ఈ కాలంలోనే 26.55 కోట్ల టోల్‌ ట్రాన్సాక్షన్లు ఈ వార్షిక పాస్‌ ద్వారా నమోదయ్యాయని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

వాడేస్తున్న కార్‌ యూజర్లు 

ఈ పథకం ప్రభావంతో హైవే ప్రయాణాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా ఏడాదికి గరిష్ఠంగా 100 ట్రిప్స్‌ మాత్రమే చేసే కార్‌ యూజర్లలో హైవే ట్రిప్స్‌ సంఖ్య 50 శాతం పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అంటే, వార్షిక పాస్‌ అందుబాటులోకి రావడంతో ప్రజలు మరింత ధైర్యంగా జాతీయ రహదారులపై ప్రయాణాలు చేస్తున్నారు.

ఎన్‌హెచ్‌ఏఐ ప్రకారం, ప్రస్తుతం జాతీయ రహదారి నెట్‌వర్క్‌లో నమోదయ్యే మొత్తం కార్‌ ట్రాన్సాక్షన్లలో సుమారు 28 శాతం FASTag Annual Pass ద్వారానే జరుగుతున్నాయి. ఇది రాబోయే రోజుల్లో MLFF (మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో) లేదా గేట్లు లేని టోల్‌ విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రాల వారీగా.... 

ప్రాంతాల వారీగా చూస్తే, ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ వినియోగంలో చండీగఢ్‌ టాప్‌లో నిలిచింది. దేశవ్యాప్తంగా జరిగే వార్షిక పాస్‌ ట్రాన్సాక్షన్లలో 14 శాతం చండీగఢ్‌ నుంచే వస్తున్నాయి. ఆ తర్వాత తమిళనాడు 12.3 శాతం, దిల్లీ 11.5 శాతం వాటాతో ఉన్నాయి. ఉత్తరాది మెట్రో నగరాల నుంచి దక్షిణాది రాష్ట్రాల వరకూ ఈ పాస్‌కు మంచి ఆదరణ లభిస్తోందని ఇది స్పష్టంగా చూపిస్తోంది.

టోల్‌ ప్లాజాల పరంగా చూస్తే, దిల్లీ-ఎన్‌సీఆర్‌లోని బిజ్వాసన్ టోల్‌ ప్లాజా రికార్డు స్థాయిలో ఉంది. ఇక్కడ జరిగే మొత్తం కార్‌ క్రాసింగ్‌లలో సుమారు 57 శాతం వార్షిక పాస్‌ ద్వారానే జరుగుతున్నాయి. అలాగే, దిల్లీ-ఎన్‌సీఆర్‌లోని ముంద్కా, సోనిపట్‌లోని ఝింఝోలీ టోల్‌ ప్లాజాల్లోనూ 53 శాతం వరకు నాన్‌ కమర్షియల్‌ వాహనాలు ఈ పాస్‌ ఉపయోగిస్తున్నాయి.

ఏప్రిల్‌ నుంచి ధర పెరిగే అవకాశం

ఈ వార్షిక పాస్‌ దేశవ్యాప్తంగా 1,150 జాతీయ రహదారి, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వే టోల్‌ ప్లాజాల్లో వర్తిస్తుంది. రూ.3,000 ఒకేసారి చెల్లిస్తే ఒక సంవత్సరం వరకు లేదా 200 టోల్‌ క్రాసింగ్‌లు వరకు ఈ పాస్‌ చెల్లుబాటు అవుతుంది. తరచూ FASTag రీచార్జ్‌ అవసరం లేకుండా సౌకర్యంగా ప్రయాణం చేయవచ్చు. అయితే, ఏప్రిల్‌ నెల నుంచి టోల్‌ రేట్ల సవరణకు అనుగుణంగా ఈ పాస్‌ ధర పెరిగే అవకాశం ఉందని ఎన్‌హెచ్‌ఏఐ ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది.

రాజ్‌మార్గయాత్ర యాప్‌ లేదా ఎన్‌హెచ్‌ఏఐ వెబ్‌సైట్‌ ద్వారా చెల్లింపు చేసిన రెండు గంటల్లోనే ఇప్పటికే ఉన్న FASTag‌కు ఈ పాస్‌ యాక్టివేట్‌ అవుతుంది. వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. మొత్తంగా చూస్తే... ప్రయాణ ఖర్చు తగ్గిస్తూ, హైవే డ్రైవింగ్‌ను మరింత సులభం చేసిన పథకంగా FASTag Annual Pass నిలుస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.