నేటి కాలంలో పెట్రోల్, డీజిల్ కంటే ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. పలు విషయాల్లో డీజిల్ కార్లకు ఈవీలు గట్టి పోటీనిస్తున్నాయి. ఇటీవల కొత్త BMW i3 ఎలక్ట్రిక్ సెడాన్ మార్కెట్లోకి రానుందని ప్రచారం జరుగుతోంది. దీని రేంజ్ ఏకంగా 900 కిలోమీటర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. దీనికి ముందు Mercedes-Benz CLA ఎలక్ట్రిక్ రేంజ్ 792 కిలోమీటర్లుగా నమోదైంది. దీన్ని బట్టి ఎలక్ట్రిక్ కార్లు ఇప్పుడు లాంగ్ జర్నీలకు కూడా సమర్థవంతంగా వినియోగించవచ్చు అని స్పష్టమవుతోంది. అందుకే వాహనదారులు నెమ్మదిగా డీజిల్ నుండి ఎలక్ట్రిక్ వైపు మొగ్గు చూపుతున్నారు.
BMW i3 కొత్త టెక్నాలజీ, లాంగ్ రేంజ్
వాస్తవానికి కొత్త BMW i3 ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్. దీన్ని బీఎండబ్ల్యూ 3 సిరీస్ ఎలక్ట్రిక్ రూపంగా చెప్పవచ్చు. ఇది BMW కొత్త Neu Klasse డిజైన్ కాన్సెప్ట్‌పై రూపొందించారు. ఈ కారులో 108.7 kWh భారీ బ్యాటరీని అమర్చారు. ఇది 900 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని వాహనదారులకు ఇస్తుంది. ఇందులో 469 bhp పవర్, 645 Nm టార్క్ లభిస్తుంది. దీనివల్ల కారు పెర్ఫార్మెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో 800V ఛార్జింగ్ సిస్టమ్ ఉండటం వల్ల ఫాస్ట్ ఛార్జింగ్ సాధ్యం అవుతుంది. దాంతో ఇది గంటల తరబడి చేసే ఛార్జింగ్ కష్టాలకు చెక్ పెడుతుంది.
డిజైన్, ఇంటీరియర్ ప్రత్యేకతలు
BMW i3 డిజైన్ చాలా క్లీన్ అండ్ సింపుల్‌గా ఉండి, మోడ్రన్ లుక్ ఇస్తుంది. దీని రూఫ్ లైన్ సన్నగా, స్టైలిష్‌గా ఉంటుంది. కారు ముందు భాగంలోని కిడ్నీ గ్రిల్ కూడా చాలా తక్కువగా కనిపించేలా డిజైన్ చేశారు. లోపలి భాగం విషయానికి వస్తే, దీని ఇంటీరియర్ iX3 తరహాలో ఉంటుంది. ఇందులో డాష్‌బోర్డ్ మొత్తం విస్తరించే ఒక పెద్ద పనోరమిక్ iDrive స్క్రీన్‌ను అందించారు. దీనివల్ల విడిగా ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అవసరం ఉండదు. కింద భాగంలో ఒక టచ్‌స్క్రీన్ కూడా ఉంది. దీని ద్వారా అనేక ఫీచర్లను కంట్రోల్ చేయవచ్చు.
భారత్‌లో లాంచ్ ఎప్పుడు?
ఈ కొత్త BMW i3 జర్మనీలోని మ్యూనిచ్‌లో తయారు అవుతుంది. ఇది చూడటానికి ఫ్యూచరిస్టిక్ కారులా అనిపిస్తుంది. అయితే, భారత్‌లో దీని లాంచ్‌కు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక వివరాలు రాలేదు. BMW ఇప్పటికే భారత్‌లో i7, iX1 వంటి ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. కానీ కొత్త i3 లేదా iX3 ఇంకా భారత మార్కెట్లో విడుదల కాలేదు. i3 కంటే ముందే iX3ని భారత్‌కు తీసుకువచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
