Car Maintanance Tips: ఇండియాలో కారు యజమానులు ఎక్కువగా పట్టించుకోని విషయం ఏదైనా ఉందంటే అది టైర్ల నిర్వహణ. టైర్లలో ఉండే గాలి పీడనం (Tyre Pressure) అనేది కారు గ్రిప్, ప్రయాణీకుల సౌకర్యం, బ్రేకింగ్, ఇంధన సామర్థ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది. పెట్రోల్ బంకుకు వెళ్ళినప్పుడు ఎప్పుడో ఒకసారి గాలి చెక్ చేయించడం సరిపోదు. కొంచెం శ్రద్ధ పెడితే మీ టైర్లను మీరే ఇంట్లో సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఇందుకు అవసరమైన పరికరాలు కూడా ఆన్లైన్ లేదా సంబంధిత షాపులలో సులభంగా దొరుకుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. 

Continues below advertisement

ఎప్పుడు, ఎలా చెక్ చేయాలి?ప్రతి కారు డ్రైవర్ సీటు వైపు ఉండే డోర్ పిల్లర్ మీద ఒక మెటల్ స్టిక్కర్ ఉంటుంది. అందులో మీ కారు టైర్లకు ఉండాల్సిన సరైన పీడనం (PSI లేదా bar) వివరాలు ఉంటాయి. కారులో ఎంత మంది ప్రయాణిస్తున్నారు అనే దాన్ని బట్టి ఈ రీడింగ్స్ మారుతుంటాయి. ముఖ్యంగా టైర్లు చల్లగా ఉన్నప్పుడే (Cold Tyres) గాలిని చెక్ చేయాలి. కారును ఎక్కువ దూరం నడిపిన తర్వాత టైర్లు వేడెక్కి గాలి వ్యాకోచిస్తుంది, దీనివల్ల తప్పుడు రీడింగ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణం మొదలుపెట్టే ముందు లేదా కారు పార్క్ చేసిన రెండు గంటల తర్వాతే చెక్ చేయడం ఉత్తమం.

స్పేర్ వీల్ మర్చిపోవద్దుచాలా మంది నాలుగు టైర్ల మీద చూపే శ్రద్ధ డిక్కీలో ఉండే స్పేర్ వీల్ (Spare Wheel) మీద చూపరు. అత్యవసర సమయంలో అది పనికిరావాలంటే అందులో ఎప్పుడూ నిర్ణీత స్థాయి కంటే కొంచెం ఎక్కువ గాలి (సుమారు 60 PSI) నింపి ఉంచాలి. గాలి క్రమంగా తగ్గుతూ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు దీనిని కూడా గమనిస్తూ ఉండాలి. అలాగే కారులో ఉండే టీపీఎంఎస్ (TPMS) సిస్టమ్‌ను పూర్తిగా నమ్మకూడదు. గాలి 20 శాతం కంటే ఎక్కువ తగ్గినప్పుడే అది సిగ్నల్ ఇస్తుంది. అందుకే ప్రతి రెండు వారాలకు ఒకసారి మాన్యువల్‌గా చెక్ చేసుకోవడం సురక్షితమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

Continues below advertisement

నైట్రోజన్ ఉత్త‌మ‌మా?సాధారణ గాలితో పోలిస్తే నైట్రోజన్ వల్ల టైర్ల లైఫ్ పెరుగుతుంది, టైర్లు పేలిపోయే ప్రమాదం తక్కువగా ఉంటుంది. అయితే ఇది అన్ని చోట్లా దొరకదు, పైగా దీనికి కొంత ఖర్చు అవుతుంది. మీరు టైర్ ప్రెషర్‌ను క్రమం తప్పకుండా మెయింటైన్ చేయగలిగితే సాధారణ గాలి కూడా సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. 

సరైన ప్రెషర్ ఎందుకు అవసరం?గాలి తక్కువగా ఉంటే మైలేజీ తగ్గిపోతుంది, స్టీరింగ్ తిప్పడం కష్టమవుతుంది, టైర్లు త్వరగా అరిగిపోతాయి. అదే గాలి ఎక్కువగా ఉంటే ప్రయాణం అసౌకర్యంగా ఉండటమే కాకుండా రోడ్డుపై కారు గ్రిప్ తగ్గుతుంది. సరైన పీడనం ఉంటేనే బ్రేకులు సమర్థవంతంగా పనిచేస్తాయి, కారు హ్యాండ్లింగ్ బాగుంటుంది. మీ ప్రయాణం క్షేమంగా సాగాలంటే టైర్ల విషయంలో నిర్లక్ష్యం వద్ద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. అప్పుడే మీ ప్రయాణం సుఖవంతగా సాగుతుందని, ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఉండబోదని అంటున్నారు.