Eelectric vehicle tyre maintenance tips: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు పర్యావరణానికి మేలు చేయాలనే ఉద్దేశంతో చాలామంది ఈవీలను ఎంచుకుంటున్నారు. అయితే వాహనం కొనుగోలు చేయడం, బ్యాటరీని జాగ్రత్తగా చూసుకోవడం, ఛార్జింగ్‌పై శ్రద్ధ పెట్టడం మాత్రమే సరిపోదు. టైర్ల విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణ కార్లకు ఉపయోగించే టైర్లనే ఎలక్ట్రిక్ కార్లకు వాడితే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. టైర్ల ఎంపికలో పొరపాట్లు చేస్తే వాహన భద్రతతో పాటు బ్యాటరీ సామర్థ్యంపైనా ప్రభావం పడుతుంది.
ఈవీలకు ప్రత్యేక టైర్లు ఎందుకు?
ఎలక్ట్రిక్ కార్లలో బ్యాటరీలు అమర్చడం వల్ల వాటి బరువు సాధారణ పెట్రోల్/డీజిల్ కార్లతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. కొన్ని వాహనాల్లో ఈ వ్యత్యాసం 20 నుంచి 30 శాతం వరకు ఉండవచ్చు. ఈ అదనపు బరువును తట్టుకునేలా ఈవీ టైర్లను రూపొందిస్తారు. వీటి పక్కభాగం (సైడ్ వాల్) మరింత బలంగా ఉంటుంది. అధిక భారాన్ని మోస్తూనే రోడ్డుపై వాహనానికి స్థిరత్వాన్ని అందించేందుకు ఈ నిర్మాణం ఉపయోగపడుతుంది.
అయితే ప్రతి ఎలక్ట్రిక్ కారుకు ఒకే రకమైన టైర్లు సరిపోవు. వాహన తయారీ సంస్థ సూచించిన పరిమాణం, బరువు మోయగల సామర్థ్యం, వేగానికి తగిన టైర్లను ఎంచుకోవాలి. ధర తక్కువగా ఉందని ఏ టైరు పడితే అది అమర్చడం సరైన పద్ధతి కాదు.
బ్యాటరీ రేంజ్‌పై ప్రభావం!
ఎలక్ట్రిక్ కార్లలో టైర్ల ఎంపికకు రోలింగ్ రెసిస్టెన్స్ కీలకం. టైరు రోడ్డుపై తిరిగేటప్పుడు ఎదురయ్యే ప్రతిఘటనను రోలింగ్ రెసిస్టెన్స్ అంటారు. ఇది తక్కువగా ఉంటే వాహనాన్ని నడిపేందుకు మోటారు తక్కువ శక్తిని వినియోగిస్తుంది. ఫలితంగా బ్యాటరీలోని విద్యుత్‌ను సమర్థంగా ఉపయోగించుకోవచ్చు. దీంతో ఒకసారి ఛార్జింగ్ చేస్తే ప్రయాణించగల దూరం పెరిగే అవకాశం ఉంటుంది.
సాధారణ టైర్లతో పోలిస్తే తక్కువ రోలింగ్ రెసిస్టెన్స్ కలిగిన టైర్లు ఈవీలకు ఉపయోగకరంగా ఉంటాయి. అయితే టైరుపై గాలి ఒత్తిడి, రోడ్డు పరిస్థితులు, డ్రైవింగ్ తీరు కూడా బ్యాటరీ రేంజ్‌ను ప్రభావితం చేస్తాయి.
ఇది కూడా చదవండి: మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వేగానికి తగిన పట్టు ఉండాలి!
ఎలక్ట్రిక్ కార్లలో యాక్సిలరేటర్ తొక్కగానే బండి వేగం చాలా త్వరగా పెరుగుతుంది. ఈ సమయంలో టైర్లు రోడ్డుపై గట్టిగా పట్టును కలిగి ఉండాలి. అందుకే ఈవీ టైర్లలో ప్రత్యేక రబ్బరు మిశ్రమాలను ఉపయోగిస్తారు. ఇవి వేగం పెరిగినప్పుడు వాహన నియంత్రణకు తోడ్పడతాయి. అయితే అధిక వేగం, అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వల్ల టైర్లు త్వరగా అరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వేగ పరిమితులను పాటించడం అవసరం.
ప్రయాణంలో శబ్దం తగ్గించేందుకు కూడా కొన్ని ఈవీ టైర్లను ప్రత్యేకంగా రూపొందిస్తారు. ఎలక్ట్రిక్ మోటారు శబ్దం తక్కువగా ఉండటంతో టైర్లు రోడ్డుపై తిరిగే శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. దీనిని తగ్గించేందుకు కొన్ని టైర్లలో ప్రత్యేక నమూనాలు, లోపలి భాగంలో శబ్దాన్ని తగ్గించే ఫోమ్‌ను ఉపయోగిస్తారు. దీంతో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
టైర్లను ఎప్పుడు మార్చాలి?
ఎలక్ట్రిక్ కార్ల అధిక బరువు, ఆక్సిలరేషన్‌ను వేగంగా అందుకునే గుణం కారణంగా కొన్ని సందర్భాల్లో టైర్లు త్వరగా అరిగిపోవచ్చు. వాహన రకం, టైరు నాణ్యత, రహదారి పరిస్థితులను బట్టి వాటి మన్నిక మారుతుంది. కొన్ని టైర్లు సుమారు 30 వేల నుంచి 35 వేల కిలోమీటర్ల వరకు ఉపయోగపడవచ్చు. అయితే ఈ దూరమే ప్రామాణికం కాదు, టైరు పరిస్థితిని క్రమం తప్పకుండా పరిశీలించాలి.
టైరుపై ఉన్న గాడి లోతు 1.6 మి.మీ. కంటే తగ్గితే కొత్త టైరు అమర్చాలి. పక్కభాగంలో పగుళ్లు, ఉబ్బెత్తులు కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి టైరు దెబ్బతిన్న సంకేతాలు కావచ్చు. ప్రయాణంలో టైరు పేలిపోయే ప్రమాదాన్ని తగ్గించేందుకు వెంటనే నిపుణులతో తనిఖీ చేయించాలి. ఒకవైపు మాత్రమే టైరు ఎక్కువగా అరిగిపోతుంటే చక్రాల అమరికలో లోపం ఉండవచ్చు.
ఇది కూడా చదవండి: హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: మోడ్రన్ ఫీచర్లు ఉన్న ఈ కారు డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?
గాలి ఒత్తిడి విషయంలో జాగ్రత్త!
టైర్లలో గాలి తక్కువగా ఉంటే రోలింగ్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. దీంతో బ్యాటరీ విద్యుత్ వినియోగం పెరగవచ్చు. అదే సమయంలో టైర్లు వేడెక్కి త్వరగా అరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే వాహన తయారీ సంస్థ సూచించిన గాలి ఒత్తిడినే పాటించాలి. నెలకు కనీసం ఒకసారి, సుదూర ప్రయాణాలకు ముందు గాలి ఒత్తిడిని తనిఖీ చేయడం మంచిది.
ప్రతి 8 వేల నుంచి 10 వేల కిలోమీటర్లకు టైర్ల స్థానాలను మార్చడం (ఒక టైరు స్థానంలో మరొకటి బిగించడం) గురించి వాహన తయారీ సంస్థ సూచనలను పరిశీలించాలి. ఈ ప్రక్రియను టైర్ రొటేషన్ అంటారు. అన్ని వాహనాలకు ఒకే విధానం వర్తించదు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవాలి.
మొత్తంగా చూస్తే.. ఎలక్ట్రిక్ కారు నిర్వహణలో టైర్ల పాత్ర కూడా చాలా కీలకం. సరైన టైర్లను ఎంచుకోవడం, గాలి ఒత్తిడిని పర్యవేక్షించడం, అరుగుదలను గమనించడం ద్వారా ప్రయాణ భద్రతను మెరుగుపరచుకోవచ్చు. బ్యాటరీ సామర్థ్యాన్ని సమర్థంగా వినియోగించుకోవాలన్నా, అనవసర ఖర్చులను తగ్గించుకోవాలన్నా టైర్ల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
