Electric Vehicle Battery charging Tips | భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) వినియోగం వేగంగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి క్రమంగా ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ బైక్‌ల వైపు మారుతున్నారు. తద్వారా ఇది మీ ఇంధన ఖర్చులు తగ్గించడంతో పాటు తక్కువ కాలుష్య కారకాలుగా పర్యావరణానికి సైతం మేలు చేస్తాయి. అయితే EV కొనుగోలు చేసిన తర్వాత, వెహికల్ ఎంతవరకు ఛార్జ్ చేయడం సరైనది అనే విషయంపై క్లారిటీ ఉండాలి. నిపుణులు తరచుగా 80 శాతం వరకు మాత్రమే ఛార్జింగ్ చేయాలని సలహా ఇస్తారు. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలంలో బ్యాటరీ లైఫ్ మెరుగ్గా ఉంటుంది. 

Continues below advertisement

80% ఛార్జింగ్ రూల్ ఎందుకు ముఖ్యం?ఆధునిక EVలలో బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ (BMS) అమర్చి ఉంటుంది. ఈ సిస్టమ్ బ్యాటరీ సురక్షితంగా, సమతుల్యంగా పనిచేయడానికి దోహదం చేస్తుంది. అయినప్పటికీ, బ్యాటరీని ప్రతిసారీ 100 శాతం వరకు ఛార్జ్ చేస్తే, దాని లైఫ్ టైంపై  ప్రభావం చూపుతుంది. అందుకే 80 శాతం వరకు ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీపై ఒత్తిడి తగ్గుతుంది. ఛార్జ్ లెవల్ పెరిగేకొద్దీ బ్యాటరీ లోపల నిరోధం (Resistance) అదే స్థాయిలో పెరుగుతుంది. దీనివల్ల అది పూర్తిగా నిండటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకే 80 శాతం నుండి 100 శాతం వరకు ఛార్జ్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. పదేపదే 100% వరకు ఛార్జ్ చేస్తే బ్యాటరీ త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది.

బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది..EV వాహనాల బ్యాటరీ చాలా ఖరీదు ఉంటాయి. ఒకవేళ బ్యాటరీ పాడైతే, దాన్ని మార్చడానికి భారీగా ఖర్చు అవుతుంది. అందుకే ఛార్జింగ్‌ను 80 వరకు, లేదా 85 శాతం వరకే చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ దీర్ఘకాలం పాటు బాగుంటుంది. దీనివల్ల మీ బ్యాటరీ త్వరగా చెడిపోదు. కొన్నేళ్లపాటు మీకు బ్యాటరీ ఖర్చులు తగ్గుతాయి. ఎప్పుడైనా సుదీర్ఘ ప్రయాణాలు (Long Journey) చేయాల్సి వచ్చినప్పుడు లాంటి సందర్భాలలో దాదాపు 100 ఛార్జ్ చేసుకోవాలి. కానీ రోజువారీ వినియోగంలో 80 శాతం ఛార్జింగ్ రూల్ పాటించడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.

Continues below advertisement

సమయం కూడా ఆదా అవుతుందిEVలను పెట్రోల్-డీజిల్ వాహనాల తరహాలో కొన్ని నిమిషాల్లో బయటకు వెళ్లేందుకు సిద్ధం కాలేం. బ్యాటరీ 80% వరకు వేగంగా ఛార్జ్ అవుతుంది, కానీ ఆ తర్వాత వేగం తగ్గుతుంది. అందుకే 80 శాతం వద్ద ఛార్జింగ్ ఆపివేయడం వల్ల మీ విలువైన సమయం ఆదా అవుతుంది. అంతేకాకుండా, ఛార్జింగ్ స్టేషన్ల వద్ద రద్దీ తగ్గుతుంది. ఇతరులు కూడా తమ వాహనాలను త్వరగా ఛార్జ్ చేసుకునే వీలుంటుంది.

చాలా ఎలక్ట్రిక్ వాహనాల్లో 'రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్' ఉంటుంది. మీరు బ్రేక్ వేసినప్పుడు లేదా వాహనం వేగాన్ని తగ్గించినప్పుడు, ఈ సిస్టమ్ ఎనర్జీని తిరిగి బ్యాటరీలో నిల్వ చేస్తుంది. ఒకవేళ బ్యాటరీ ముందే 100 శాతం నిండి ఉంటే, ఈ అదనపు ఎనర్జీని సేవ్ చేయడం సాధ్యపడదు. కానీ బ్యాటరీ 80% వరకు మాత్రమే ఛార్జ్ అయి ఉంటే, అందులో ఖాళీ ఉంటుంది కాబట్టి రీజనరేటివ్ బ్రేకింగ్ పూర్తి ప్రయోజనం మీరు పొందవచ్చు.