E20-compatible vehicles: దేశవ్యాప్తంగా E20 పెట్రోల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి, ఎథనాల్ మిశ్రమ ఇంధన వినియోగాన్ని వేగంగా విస్తరిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. జనం మైండ్ బ్లాంక్ అయ్యే కీలక విషయాన్ని వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం E20 పెట్రోల్‌కు అనుకూలంగా ఉన్న వాహనాలు ఎన్ని ఉన్నాయనే దానిపై తమ వద్ద అధికారిక గణాంకాలు లేవని రాజ్యసభలో తెలిపింది. అయితే E20 ఇంధనం వాహనాలకు సురక్షితమేనని ప్రయోగశాల పరీక్షలు & ఫీల్డ్ ట్రయల్స్ ద్వారా నిర్ధారణ అయ్యిందని స్పష్టం చేసింది.
లెక్క లేదట!రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా పెట్రోలియం & సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపీ స్పందించారు. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు దేశంలోని మొత్తం వాహనాల్లో ఎంత శాతం E20 పెట్రోల్‌కు అనుకూలంగా ఉన్నాయనే అంశంపై ఎలాంటి అధికారిక అంచనా వేయలేదని వెల్లడించారు. దీంతో దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ అందుబాటులోకి వచ్చినప్పటికీ, దాన్ని వినియోగించగల వాహనాల సంఖ్యపై ప్రభుత్వం వద్ద స్పష్టమైన సమాచారం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
సురక్షితమేనని వెల్లడిఅయితే, E20 అమలుకు ముందు విస్తృత స్థాయిలో శాస్త్రీయ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్రం తెలిపింది. నీతి ఆయోగ్, ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు, వాహన తయారీ కంపెనీలు, ARAI, SIAM & IIP కలిసి ఇంజిన్ మన్నిక, డ్రైవబిలిటీ, స్టార్టింగ్ సామర్థ్యం, తుప్పు నిరోధకత, విడిభాగాల అనుకూలత, ఉద్గారాలు & ఇంధన సామర్థ్యంపై పలు పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. ఈ అధ్యయనాల ప్రకారం పాత పెట్రోల్ వాహనాల్లో కూడా E20 వినియోగం వల్ల పనితీరులో గణనీయమైన మార్పులు లేదా అసాధారణ విడిభాగాల అరిగిపోవడం కనిపించలేదని ప్రభుత్వం తెలిపింది.
ఇది కూడా చదవండి: EVలకు తగ్గని డిమాండ్ - జులైలో 32 వేలకుపైగా అమ్మకాలు, ఏ కంపెనీ ఎన్ని కార్లను విక్రయించిందంటే..?
మైలేజ్ తగ్గే అవకాశంమైలేజ్‌పై వస్తున్న సందేహాలకూ కేంద్రం సమాధానం ఇచ్చింది. మొదట E10 పెట్రోల్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన వాహనాల్లో E20 ఇంధనం వాడితే సుమారు 3 నుంచి 5 శాతం వరకు మైలేజ్ తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొంది. అయితే వాస్తవ ఇంధన సామర్థ్యం డ్రైవింగ్ విధానం, రహదారి పరిస్థితులు & వాహనం నిర్వహణపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా E20 వల్ల ఇంజిన్లు పాడవుతున్నాయన్న లేదా వాహనాలు పెద్ద ఎత్తున మొరాయిస్తున్నాయన్న ఆరోపణలకు సంబంధించి ఇప్పటివరకు ధ్రువీకరించిన ఆధారాలు ఏవీ లేవని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సోషల్ మీడియాలో వస్తున్న అనేక ప్రచారాలకు భిన్నంగా, ప్రభుత్వానికి అలాంటి విస్తృత స్థాయి సాంకేతిక ఆధారాలు అందలేదని పేర్కొంది.
ఇది కూడా చదవండి: వర్షంలోనే టూవీలర్ నడుపుతున్నారా..? ఈ తప్పులు చేస్తే మీ బండి మధ్య రోడ్డులోనే ఆగిపోవచ్చు!
మరోవైపు, E20 అమలు కాలక్రమంపై కేంద్రం ఇచ్చిన వివరణ ఆసక్తికరంగా మారింది. అధికారికంగా దేశవ్యాప్తంగా E20 పెట్రోల్‌ను 2025 మధ్యలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించినప్పటికీ.. E19 నుంచి E20 మిశ్రమ ఇంధనం రెండున్నరేళ్లకుపైగా విస్తృతంగా వినియోగంలో ఉందని తెలిపింది. అలాగే E15 కంటే అధిక ఎథనాల్ మిశ్రమ ఇంధనం మూడున్నరేళ్లకుపైగా పంపిణీ అవుతోందని & దీని ద్వారా 20 కోట్లకుపైగా ద్విచక్ర వాహనాలు, 3 కోట్ల పెట్రోల్ కార్లు ప్రయోజనం పొందుతున్నాయని వెల్లడించింది. అయితే ఈ గణాంకాలు & అధికారిక ప్రకటనల మధ్య ఉన్న కాలవ్యత్యాసంపై ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
భవిష్యత్తులో మరింత అధిక ఎథనాల్ మిశ్రమ ఇంధనాల వినియోగానికి కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు, అధిక ఎథనాల్ మిశ్రమాలు & ఇతర బయోఫ్యూయల్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దేశీయ ఎథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు తెలిపింది. ఆహార భద్రత & ప్రజా పంపిణీ వ్యవస్థ అవసరాలు తీరిన తర్వాత మిగిలిన ధాన్యాన్నే ఎథనాల్ తయారీకి వినియోగిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
