All About E100 Fuel: భారత్‌లో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) ఇటీవలే E100 ఫ్యూయల్‌కు సంబంధించిన నిబంధనలకు ఆమోదం తెలిపారు. దీంతో దేశంలో 100 శాతం ఇథనాల్‌ ఆధారిత వాహనాల ప్రవేశానికి మార్గం సుగమమైంది.

Continues below advertisement

ఇప్పటికే E20 పెట్రోల్‌ (20 శాతం ఇథనాల్‌, 80 శాతం పెట్రోల్‌) దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుండగా, ఇప్పుడు E100 ఫ్యూయల్‌ చర్చనీయాంశంగా మారింది. మరి E100 అంటే ఏమిటి? ఇది పెట్రోల్‌ను పూర్తిగా భర్తీ చేయగలదా? దాని ప్రయోజనాలు, సవాళ్లు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.

E100 ఫ్యూయల్‌ అంటే ఏమిటి?

Continues below advertisement

E100 అనేది దాదాపు 100 శాతం ఇథనాల్‌తో తయారయ్యే ఇంధనం. ఇథనాల్‌ను చెరకు, మొక్కజొన్న, పాడైన ఆహార ధాన్యాలు, వ్యవసాయ వ్యర్థాల వంటి వనరుల నుంచి తయారు చేస్తారు. ఇది పునరుత్పాదక ఇంధనం (Renewable Fuel) కావడం విశేషం.

ప్రస్తుతం దేశంలో E20 ఇంధనం వినియోగం పెరుగుతోంది. అయితే E100 ఫ్యూయల్‌ పూర్తిగా ఇథనాల్‌పై ఆధారపడి పనిచేసే వాహనాల కోసం రూపొందించారు.

భారత్‌ ఎందుకు E100పై దృష్టి పెట్టింది?

భారత్‌ తన చమురు అవసరాల్లో పెద్ద భాగాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడల్లా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతోంది.

ఈ నేపథ్యంలో ఇథనాల్‌ ఆధారిత ఇంధనాలను ప్రోత్సహించడం ద్వారా చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు, చెరకు, మొక్కజొన్న వంటి పంటలకు డిమాండ్‌ పెరగడం వల్ల రైతులకు కూడా అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది.

ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇథనాల్‌ బ్లెండింగ్‌ కార్యక్రమం వల్ల ఇప్పటివరకు రూ.1 లక్ష కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడంతో పాటు రైతులకు సుమారు రూ.80 వేల కోట్ల ఆదాయం లభించింది.

E100 పెట్రోల్‌ను పూర్తిగా భర్తీ చేస్తుందా?

సాంకేతికంగా చూస్తే E100 పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది. కానీ అది వెంటనే జరగదు. ప్రస్తుతం భారత రోడ్లపై ఉన్న కోట్లాది కార్లు, బైక్‌లు, స్కూటర్లు E100 ఇంధనానికి అనుకూలంగా లేవు. అవి సాధారణ పెట్రోల్‌ లేదా E20 వరకు మాత్రమే వినియోగించగలవు. అందువల్ల రాబోయే కొన్ని సంవత్సరాల పాటు పెట్రోల్‌, E20, E85, E100 వంటి ఇంధనాలు కలిసి అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

ఏ వాహనాలు E100తో నడుస్తాయి?

E100 ఇంధనాన్ని వినియోగించాలంటే ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనాలు అవసరం. ఇథనాల్‌ పెట్రోల్‌తో పోలిస్తే భిన్నమైన లక్షణాలు కలిగి ఉండటంతో ఇంజిన్‌, ఫ్యూయల్‌ పంప్‌, ఇంజెక్టర్లు, ఫ్యూయల్‌ లైన్లు వంటి భాగాల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది.

ఇప్పటికే, Maruti Suzuki తన ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ Maruti Suzuki Wagon R Bioflexను పరిచయం చేసింది. అలాగే Toyota, Hyundai Motor Company, MG Motor కూడా E100 అనుకూల వాహనాలపై పని చేస్తున్నాయి.

బైకుల విభాగంలో Hero MotoCorp కూడా ఇప్పటికే ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వెర్షన్లను విడుదల చేసింది.

E100 ఫ్యూయల్‌ ప్రయోజనాలు

చమురు దిగుమతులు తగ్గుతాయి

దేశం విదేశీ చమురుపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చు.

రైతులకు లాభం

ఇథనాల్‌ తయారీకి అవసరమైన పంటలకు డిమాండ్‌ పెరుగుతుంది.

కాలుష్యం తగ్గుతుంది

పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌ పరిశుభ్రంగా దహనం కావడం వల్ల కార్బన్‌ ఉద్గారాలు తగ్గే అవకాశం ఉంది.

E100 ఫ్యూయల్‌లో ఉన్న సవాళ్లు

మైలేజ్‌ తగ్గే అవకాశం: ఇథనాల్‌లో శక్తి సాంద్రత (Energy Density) పెట్రోల్‌ కంటే తక్కువ. దీంతో ఒకే దూరం ప్రయాణించడానికి పెట్రోల్‌ కంటే ఎక్కువ ఇంధనం అవసరం కావచ్చు.

కొత్త వాహనాలు అవసరం : ప్రస్తుత పెట్రోల్‌ వాహనాలు E100పై నేరుగా నడవవు.

మౌలిక సదుపాయాల ఖర్చు: దేశవ్యాప్తంగా E100 ఫ్యూయల్‌ స్టేషన్లు, నిల్వ సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?

E100 ఫ్యూయల్‌ భారత ఇంధన రంగంలో పెద్ద మార్పుకు నాంది పలికే అవకాశం ఉంది. అయితే ఇది విజయవంతం కావాలంటే వాహన తయారీ సంస్థలు, చమురు కంపెనీలు, ప్రభుత్వం సమన్వయంతో పని చేయాలి. ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనాల లభ్యత, ఇంధన స్టేషన్ల విస్తరణ, ఇథనాల్‌ ఉత్పత్తి పెంపు వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. మొత్తంగా చూస్తే, E100 ఫ్యూయల్‌ భారత్‌ను ఇంధన స్వావలంబన వైపు తీసుకెళ్లే కీలక అడుగుగా నిపుణులు భావిస్తున్నారు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.