Driving Licence New Colours: కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని చూస్తున్నవాళ్లకు & ఇప్పటికే లైసెన్స్ ఉన్నవాళ్లకు ఒక కీలక అప్‌డేట్‌. మన దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. లైసెన్స్ కార్డుల రంగుల నుంచి వ్యక్తిగత వివరాల నమోదు వరకు చాలా మార్పులను ప్రతిపాదించింది. సందర్భాన్ని బట్టి డ్రైవింగ్‌ లైసెన్స్‌ రంగు మార్చడంతో పాటు.. బ్లడ్ గ్రూప్‌, మొబైల్ నంబర్‌, అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన వ్యక్తుల వివరాలను లైసెన్స్‌లో తప్పనిసరిగా చేర్చాలని భావిస్తోంది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే వాహనదారులకు కొత్త నిబంధనలు వర్తించనున్నాయి.

Continues below advertisement

రంగులతో ప్రత్యేక గుర్తింపు!

కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH), ముసాయిదా నిబంధనల్లో కీలక మార్పులను ప్రతిపాదించింది. భారతీయులకు, విదేశీ పౌరులకు జారీ చేసే డ్రైవింగ్ లైసెన్స్‌లకు వేర్వేరు రంగుల విధానాన్ని తీసుకురావాలని సూచించింది. భారతీయులకు జారీ చేసే లైసెన్స్‌ ఒక ప్రత్యేక నమూనాలో ఉంటే, విదేశీ పౌరులకు ఇచ్చే లైసెన్స్‌ మరో నమూనాలో ఉండనుంది. అంతేకాదు.. లైసెన్స్‌ రెన్యువల్‌ చేసుకున్నాక తీసుకునే కొత్త కార్డు రంగును కూడా మార్చనుంది. ఏ రంగును ఎవరికి, ఏ సందర్భంలో కేటాయిస్తారనే పూర్తి వివరాలు తుది నిబంధనలు వచ్చాక తెలుస్తాయి.

Continues below advertisement

లైసెన్స్‌లో బ్లడ్ గ్రూప్‌, మొబైల్ నంబర్‌!

ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్‌లో ఉండే వివరాలకు అదనంగా మరికొన్ని అంశాలను చేర్చాలని కేంద్రం ప్రతిపాదించింది. లైసెన్స్‌దారుడి బ్లడ్ గ్రూప్‌, మొబైల్ నంబర్‌ తప్పనిసరిగా నమోదు చేయాలని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించేందుకు వీలుగా ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లను సైతం చేర్చాలని సూచించింది. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు ఈ వివరాలు ఉపయోగపడే అవకాశం ఉంది.

లైసెన్స్ కార్డు ఎలా ఉంటుంది?

కొత్త ప్రతిపాదనల ప్రకారం, లైసెన్స్‌ను లామినేట్ చేసిన కార్డు రూపంలో లేదా పాలీవినైల్ క్లోరైడ్ (PVC) కార్డుగా జారీ చేయాలి. ఇందుకోసం సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్‌లోని ఫారం 7 విధానాన్ని అనుసరించనున్నారు. భారతీయులు & విదేశీ పౌరులకు వేర్వేరు నమూనాలు ఉండేలా నిబంధనలను రూపొందించాలని ప్రతిపాదించారు.

ఇది కూడా చదవండి: స్కోడా కైలాక్, కుషాక్, స్లావియాపై ఫెస్టివ్‌ డిస్కౌంట్లు.. ఏ కారు కొన్నా రూ.వేలల్లో ఆదా చేయొచ్చు!

డ్రైవింగ్ పరీక్షలో 75 శాతం మార్కులు!

డ్రైవింగ్ నేర్చుకునేవారికి మరో కీలక మార్పు ప్రతిపాదించారు. సురక్షిత డ్రైవింగ్‌పై అవగాహన కల్పించే ట్యుటోరియల్‌ను కనీసం 30 నిమిషాల పాటు నిర్వహించాలని సూచించారు. ఈ శిక్షణకు సంబంధించిన అంచనా పరీక్షలో ప్రస్తుతం ఉన్న 60 శాతం అర్హత మార్కులను 75 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. అంటే, ఈ విధానం అమల్లోకి వస్తే పరీక్షలో గతం కంటే ఎక్కువ మార్కులు సాధించాల్సి ఉంటుంది. రహదారి భద్రతపై మరింత అవగాహన పెంచడం ఈ మార్పు ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

వ్యక్తిగత వివరాల మార్పులకు ఫీజు ఉండదా?

డ్రైవింగ్ లైసెన్స్‌లో పేరు, చిరునామా వంటి వివరాలను మార్చుకోవాలనుకునేవారికి కూడా ఊరట కల్పించే ప్రతిపాదనలు ఉన్నాయి. వ్యక్తిగత వివరాల మార్పులకు ప్రస్తుతం వసూలు చేసే ఫీజులను తొలగించాలని కేంద్రం సూచించింది. అంతేకాదు, దరఖాస్తు అందిన 15 రోజుల్లోగా సంబంధిత అధికారులు దానిని ఆమోదించాలి లేదా తిరస్కరించాలి. తిరస్కరిస్తే అందుకు గల కారణాలను కూడా తెలియజేయాలి.

ఆధార్‌తో ఆన్‌లైన్ సేవలకు రాయితీ!

ఆధార్ ధ్రువీకరణ ద్వారా పూర్తిచేసే కొన్ని ఆన్‌లైన్ డ్రైవింగ్ లైసెన్స్ సేవలకు ఫీజు మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే ఈ మినహాయింపు అన్ని సేవలకు వర్తిస్తుందని భావించకూడదు. ఏ సేవలకు రాయితీ ఉంటుందనేది తుది నిబంధనల్లో స్పష్టమవుతుంది.

ఇది కూడా చదవండి: విమానాల తరహా బ్లాక్‌బాక్స్‌ ఇకపై కార్లలోకీ వస్తుంది! 2027 నుంచి వెహికల్‌ సేఫ్టీ రూల్స్‌ మరింత కఠినం

వయస్సు, చిరునామా ధ్రువీకరణకు కొత్త పత్రాలు!

లైసెన్స్ దరఖాస్తు సమయంలో గుర్తింపు, వయస్సు & నివాస ధ్రువీకరణకు ఉపయోగించగల పత్రాల జాబితాను కూడా ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఆధార్‌, పాస్‌పోర్ట్‌, ఓటరు గుర్తింపు కార్డు, ఈ-రేషన్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం వంటి పత్రాలు ఇందులో ఉన్నాయి. వయస్సు, చిరునామా రుజువుగా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ లేదా నోటరీ ముందు చేయించే అఫిడవిట్‌ తప్పనిసరి విధానాన్ని తొలగించాలని కేంద్రం భావిస్తోంది. అఫిడవిట్లతో పాటు జీవిత బీమా పాలసీలను కూడా ఆధారాలుగా అంగీకరించే ప్రతిపాదన ఉంది.

అమల్లోకి వచ్చాయా?

ఈ మార్పులన్నీ ప్రస్తుతం ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. కేంద్రం విడుదల చేసిన ముసాయిదా నిబంధనలపై ప్రజలు, సంబంధిత వర్గాలు అభ్యంతరాలు & సూచనలు తెలియజేయడానికి ప్రచురణ తేదీ నుంచి 30 రోజుల గడువు ఇవ్వనున్నారు. ఆ తర్వాత వచ్చిన సూచనలను పరిశీలించి తుది నిబంధనలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.