Driving licence mobile number link: డ్రైవింగ్ లైసెన్స్‌కు ఫోన్ నంబర్ లింక్ చేయకపోతే లైసెన్స్ రద్దవుతుందన్న మెసేజ్‌ మీరు చూశారా?. మీరు డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ అనుసంధానం చేయలేదా?. లైసెన్స్‌ రద్దవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారా?. గాబరా పడాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ అనుసంధానం చేయకపోతే లైసెన్స్ రద్దవుతుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని రవాణాశాఖ అధికారులు స్పష్టం చేశారు. సో.. డోంట్‌ వర్రీ, బీ హ్యాపీ.

Continues below advertisement

కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ తరహా ప్రచారం వైరల్ అవుతోంది. ఈ నెలాఖరులోగా (సెప్టెంబర్‌ 2026) డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ లింక్ చేసుకోవాలని ఆ మెసేజ్‌లో ఉంది. గడువులోగా లింక్ చేయకపోతే లైసెన్స్ రద్దవుతుందని సోషల్‌ మీడియా పోస్టులు ప్రచారం చేస్తున్నాయి. దీంతో చాలామంది వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. రవాణాశాఖ కార్యాలయాలకు వెళ్లి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

గుడ్‌న్యూస్‌ చెప్పిన అధికారులు

Continues below advertisement

అయితే మొబైల్ నంబర్ లింక్ చేయలేదనే కారణంతో డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబోమని అధికారులు చెబుతున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచిస్తున్నారు.

అయితే, లైసెన్స్‌కు మొబైల్ నంబర్‌ను అనుసంధానం చేసుకోవడం మాత్రం మీకు కచ్చితంగా ఉపయోగకరమైనదే. డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన సేవలను ఆన్‌లైన్‌లో పొందేందుకు ఇది సహాయపడుతుంది. ఇంటి నుంచే ఈ ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: 350cc బైక్‌ Triumph Tracker 400 రియల్‌ మైలేజ్‌ గురించి తెలుసా? లీటర్ పెట్రోల్‌తో ఎన్ని కిలోమీటర్లు తిరిగిందంటే?

డ్రైవింగ్ లైసెన్స్ - మొబైల్ నంబర్ అనుసంధానం.. ఇంటి నుంచే ఇలా చేయండి

మొబైల్ నంబర్‌ను అనుసంధానం చేసుకోవాలనుకునే వారు సారథి పరివాహన్ అధికారిక వెబ్‌సైట్‌ (https://sarathi.parivahan.gov.in)లోకి వెళ్లాలి. 

అక్కడ మొబైల్ నంబర్ అప్‌డేట్‌కు సంబంధించిన విభాగాన్ని ఎంచుకోవాలి. అడిగిన వివరాలను నమోదు చేయాలి.

ఆ తర్వాత ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్‌కు ఒక OTP వస్తుంది. ఆ OTPని నమోదు చేసి ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయాలి. 

అనంతరం, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్‌తో పాటు మొబైల్ నంబర్‌ను నమోదు చేసి తదుపరి ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

ఇప్పటివరకు లైసెన్స్‌కు మొబైల్ నంబర్ నమోదు చేయకతే ఇదే విధంగా కొత్తగా నంబర్‌ను అనుసంధానం చేసుకునే అవకాశం ఉంటుంది.

లైసెన్స్ వివరాలు లేకపోతే..

కొంతమందికి మరో సమస్య ఎదురవుతోంది. ఆన్‌లైన్‌లో లైసెన్స్ వివరాలు నమోదు చేసే సమయంలో ‘లైసెన్స్ వివరాలు లేవు’ అనే సందేశం కనిపిస్తోంది. దీంతో తమ లైసెన్స్‌కు ఏదైనా సమస్య వచ్చిందని ఆందోళన చెందుతున్నారు.

అయితే దీనిపై కూడా అధికారులు స్పష్టత ఇస్తున్నారు. పాత లైసెన్స్ వివరాలు రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ నుంచి సారథి పరివాహన్‌లో పూర్తిగా నమోదు కాకపోవడం వల్ల ఇలాంటి సందేశం కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికి లైసెన్స్ రద్దుతో సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు.

అత్యవసరంగా మొబైల్ నంబర్‌ను లింక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే మీ సమీప రవాణాశాఖ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. అక్కడి సిబ్బంది పాత లైసెన్స్ వివరాలను సారథి పరివాహన్ వ్యవస్థలోకి నమోదు చేసే ప్రక్రియను చేపడతారు. అవసరమైన విధంగా కొత్త నంబర్ కేటాయించి వివరాలను నవీకరించే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: 21,000 కిలోమీటర్ల ప్రయాణం.. Hyundai Alcazar పెర్ఫార్మెన్స్‌, ఫీచర్లు, కంఫర్ట్‌ ఎలా అనిపించింది?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందేశాలను చూసి లైసెన్స్ రద్దవుతుందనే భయంతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో ఆన్‌లైన్ సేవలను సులభంగా పొందేందుకు డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్‌ను అనుసంధానం చేసుకోవడం మాత్రం మంచిదే.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.