Delhi to ban non-BS6 vehicles: వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. నవంబర్ 1, 2026 నుంచి BS6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా లేని ఇతర రాష్ట్రాల వాహనాలను నగరంలోకి అనుమతించరు. ఈ నిబంధన జనవరి 31, 2027 వరకు అమల్లో ఉంటుంది. చలికాలంలో కాలుష్యం తీవ్రత పెరిగే నేపథ్యంలో సర్కారు ఈ చర్యలు చేపట్టింది. ఆందోళన పడకండి.. ఈ నిబంధనలు మన తెలుగు రాష్ట్రాలకు వర్తించవు, దిల్లీలో మాత్రమే అమలవుతాయి. దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈ నిర్ణయాలను ప్రకటించారు. అయితే, తెలుగు రాష్ట్రాల నుంచి వాహనాలు తీసుకుని దిల్లీ వెళ్లేవాళ్లు ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోవడం ముఖ్యం.
BS6 ప్రమాణాలు లేని వాహనాలపై నిషేధంతో పాటు, కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ విషయంలోనూ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. వాహనాలకు చెల్లుబాటు అయ్యే PUC (Pollution Under Control) సర్టిఫికెట్ లేకపోతే పెట్రోల్, డీజిల్, CNG లేదా LPG అందించరు. దిల్లీలోని ఇంధన కేంద్రాల వద్ద ఈ ‘నో PUC, నో ఫ్యూయల్’ నిబంధన అమలు చేయనున్నారు.
ఇతర రాష్ట్రాల వాహనాలకే నిషేధం
కొత్త ఆంక్షలు ప్రధానంగా దిల్లీ వెలుపల రిజిస్టర్ అయిన, BS6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా లేని వాహనాలకు వర్తిస్తాయి. అయితే.. ఎలక్ట్రిక్ వాహనాలు, CNG వాహనాలు, అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. ఈ ప్రవేశ నిషేధం నవంబర్ 1 నుంచి జనవరి 31 వరకు కొనసాగుతుంది.
దిల్లీలో శీతాకాల కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు రూపొందించిన విస్తృత కార్యాచరణ ప్రణాళిక మాత్రం ఫిబ్రవరి 28, 2027 వరకు అమల్లో ఉంటుంది. కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు, రోడ్లపై వాహనాల రద్దీని నియంత్రించడం కూడా ఈ ప్రణాళికలో భాగం.
ఇది కూడా చదవండి: 2026 Maruti Balenoలో లెవల్ 2 ADAS ఫీచర్లు.. టాప్ వేరియంట్‌లో ఇంకా ఏం ఉన్నాయో తెలుసా?
పార్కింగ్ ఫీజులు రెట్టింపు
కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా, మున్సిపల్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే అధీకృత పార్కింగ్ కేంద్రాల్లో పార్కింగ్ ఫీజులను రెట్టింపు చేయనున్నారు. అయితే, దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) నిర్వహించే పార్కింగ్ కేంద్రాలకు ఈ పెంపు వర్తించదు.
వాహనాల వినియోగాన్ని తగ్గించి, ప్రజా రవాణాను ప్రోత్సహించడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా కాలుష్యం ఎక్కువగా ఉండే శీతాకాలంలో వ్యక్తిగత వాహనాల రాకపోకలను తగ్గించడం ద్వారా గాలి నాణ్యతను మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఆఫీసుల పనివేళల్లో మార్పులు
రోడ్లపై రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో విడతలవారీ పనివేళల విధానాన్ని అమలు చేయనున్నారు. అలాగే, కార్యాలయ ఉద్యోగుల్లో 50 శాతం మంది ఇంటి నుంచే పని చేసే విధానాన్ని కూడా ప్రకటించారు.
దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలు ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. దిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు పనిచేస్తాయి. ఈ విధంగా పనివేళలను వేర్వేరుగా నిర్ణయించడం ద్వారా రద్దీ సమయాల్లో వాహనాల సంఖ్యను తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
ఇది కూడా చదవండి: 10 లక్షల కంటే తక్కువ ధరకు Hyundai Bayon SUV.. బెస్ట్ సేఫ్టీ, ఫీచర్ల వివరాలు
ప్రజా రవాణా వినియోగించాలని సూచన
కాలుష్య నియంత్రణ చర్యలకు ప్రజలు సహకరించాలని దిల్లీ ప్రభుత్వం కోరింది. వ్యక్తిగత వాహనాలకు బదులుగా మెట్రో రైళ్లు, ఎలక్ట్రిక్ బస్సులను ఉపయోగించాలని సూచించింది. అలాగే, కార్‌పూలింగ్ ద్వారా ఒకే వాహనంలో ఎక్కువమంది ప్రయాణించాలని, లాస్ట్ మైల్ రవాణా సదుపాయాలను వినియోగించుకోవాలని తెలిపింది.
కాబట్టి, తెలుగు రాష్ట్రాల నుంచి వాహనాలతో దిల్లీకి వెళ్లేవాళ్లు ప్రయాణానికి ముందు తమ వాహనం BS6 ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో, PUC సర్టిఫికెట్ చెల్లుబాటులో ఉందో లేదో చూసుకోవడం మంచిది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
