India's Vehicle Number Plates:  ఇండియ‌న్ రహదారులపై ప్రయాణించేటప్పుడు మనం రకరకాల రంగుల నంబర్ ప్లేట్లను గమనిస్తుంటాం. ఇవి కేవలం చట్టపరమైన గుర్తింపు కార్డులు మాత్రమే కాదు. నంబర్ ప్లేట్ రంగు, దాని మీద ఉండే అక్షరాల షేడ్, కొన్నిసార్లు ఆ ప్లేట్ పైన ఉండే చిహ్నాలు ఆ వాహనం ఏ అవసరం కోసం వాడుతున్నారో ఇట్టే చెప్పేస్తాయి. ప్రైవేట్ కార్ల నుండి టాక్సీల వరకు, ఎలక్ట్రిక్ వాహనాల నుండి మిలిటరీ ట్రక్కుల వరకు ప్రతి విభాగానికి ట్రాన్స్‌పోర్ట్ అధికారులు ఒక ప్రత్యేక కలర్ కోడ్ కేటాయించారు.

Continues below advertisement

తెల్లటి నంబర్ ప్లేట్ (White Number Plate)..నలుపు రంగు అక్షరాలతో ఉండే తెల్లటి ప్లేట్ మనకు రోడ్లపై అత్యంత సాధారణంగా కనిపిస్తుంది. ఇది కేవలం సొంత వాహనాలకు (Private Vehicles) మాత్రమే కేటాయిస్తారు. వ్యక్తిగత అవసరాల కోసం కొనుగోలు చేసిన కార్లు, బైకులు, స్కూటర్లకు ఈ ప్లేట్ ఉంటుంది. ఈ వాహనాలను వాణిజ్య పరంగా ప్రయాణికులను చేరవేయడానికి లేదా వస్తువుల రవాణాకు ఉపయోగించకూడదు.

 పసుపు రంగు నంబర్ ప్లేట్ (Yellow Number Plate)పసుపు రంగు బ్యాక్‌గ్రౌండ్‌పై నలుపు అక్షరాలు ఉంటే అది కమర్షియల్ వాహనం అని అర్థం. టాక్సీలు, క్యాబ్‌లు, బస్సులు, ట్రక్కులు, ఆటో రిక్షాలు ఈ కేటగిరీ కిందకు వస్తాయి. వీటిని వ్యాపార అవసరాలకు వాడుకోవచ్చు. ఇటువంటి వాహనాలను నడిపే డ్రైవర్లకు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్, ప్రత్యేక పర్మిట్లు అవసరం అవుతాయి.

Continues below advertisement

 నల్లటి నంబర్ ప్లేట్ (Black Number Plate)నలుపు రంగు ప్లేట్ మీద పసుపు అక్షరాలు ఉంటే అవి సెల్ఫ్ డ్రైవ్ రెంటల్ వాహనాలు. అంటే వీటిని అద్దెకు తీసుకుని మనమే డ్రైవ్ చేయవచ్చు. జూమ్ కార్ వంటి కంపెనీలు ఈ రకమైన ప్లేట్లు వాడుతుంటాయి. ఈ వాహనం కమర్షియల్ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నప్పటికీ, దీనిని నడిపే కస్టమర్‌కు సాధారణ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది.

 ఆకుపచ్చ నంబర్ ప్లేట్ (Green Number Plate)ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ వాహనాలకు (EVs) గ్రీన్ ప్లేట్లు కేటాయిస్తారు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. వైట్ అక్షరాలు ఉంటే అది ప్రైవేట్ ఈవీ అని, అదే ఎల్లో అక్షరాలు ఉంటే అది కమర్షియల్ ఈవీ అని గుర్తించాలి. ఎలక్ట్రిక్ టాక్సీలు, డెలివరీ వ్యాన్లకు ఈ ప్లేట్లు ఉంటాయి.

ఎరుపు రంగు నంబర్ ప్లేట్ (Red Number Plate)..కొత్తగా కొన్న వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ అయ్యే వరకు తాత్కాలికంగా (Temporary) ఎరుపు రంగు ప్లేట్ ఇస్తారు. దీని వాలిడిటీ కేవలం 30 రోజులు మాత్రమే ఉంటుంది. మరోవైపు, భారత రాష్ట్రపతి, గవర్నర్ల అధికారిక వాహనాలపై కూడా ఎర్రటి ప్లేట్ ఉంటుంది. అయితే వీటి మీద నంబర్లకు బదులు భారత జాతీయ చిహ్నం (State Emblem) ఉంటుంది.

 నీలం రంగు నంబర్ ప్లేట్ (Blue Number Plate)..విదేశీ రాయబార కార్యాలయాలకు (Embassy) చెందిన వాహనాలకు బ్లూ కలర్ ప్లేట్ ఇస్తారు. వీటిపై రాష్ట్ర కోడ్‌కు బదులుగా 'CC' (Consular Corps), 'DC' (Diplomatic Corps) లేదా 'UN' (United Nations) వంటి కోడ్‌లు కనిపిస్తాయి. ఇవి దౌత్యవేత్తల ప్రత్యేక హోదాను సూచిస్తాయి.

పైకి చూపిస్తున్న బాణం గుర్తు (Upward Arrow)సైనిక వాహనాలపై (Military Vehicles) నంబర్ ప్లేట్లు భిన్నంగా ఉంటాయి. వీటి ప్రారంభంలో పైకి చూపిస్తున్న బాణం గుర్తు (Broad Arrow) ఉంటుంది. ఇవి సాధారణ ఆర్టీఓ (RTO) పరిధిలోకి రావు. రక్షణ శాఖ ప్రత్యేక నంబరింగ్ వ్యవస్థను అనుసరిస్తాయి.

బిహెచ్ (BH) సిరీస్ ప్లేట్..తరచుగా ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి బదిలీ అయ్యే ఉద్యోగుల కోసం 'భారత్ సిరీస్' (BH) నంబర్ ప్లేట్ ప్రవేశపెట్టారు. దీనివల్ల రాష్ట్రం మారిన ప్రతిసారీ కొత్తగా వాహనాన్ని రీ-రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన తలనొప్పి ఉండదు.