Car Maintenance Tips in Summer | వేసవి కాలంలో మనుషులకు మాత్రమే కాదు, వాహనాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. వెహికల్ సేఫ్టీ, నిర్వహణ ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. ముఖ్యంగా సీఎన్‌జీ (CNG) కార్ల విషయంలో కొన్ని విషయాలు పాటించాలి. సీఎన్‌జి కార్లు ఒకవైపు పెట్రోల్-డీజిల్ వాహనాలతో పోలిస్తే చౌకగా, పొదుపుగా ఉన్నప్పటికీ, మరోవైపు ఈ వాహనాల విషయంలో సమ్మర్‌లో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల సిఎన్‌జి వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. కనుక మీరు అజాగ్రత్తగా ఉంటే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. అందుకే సీఎన్‌జి కార్లు నడిపేవారు వాహనం సురక్షితంగా ఉండాలంటే, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ విషయాలను గమనించి నడుచుకోవాలి..వేసవి కాలంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, సిఎన్‌జి ట్యాంక్‌ను ఎప్పుడూ పూర్తిగా (Full) నింపవద్దు. అధిక వేడి వల్ల గ్యాస్ విస్తరించినట్లు అనిపిస్తుంది. కనుక ట్యాంక్‌లో కొంత ఖాళీ స్థలం వదలడం సురక్షితంగా భావిస్తారు. దీనివల్ల ట్యాంక్ లోపల ఒత్తిడి పెరిగినా ఖాళీ ఉండటంతో బ్యాలెన్స్ అవుతుంది. లీకేజీ లేదా ఇతర ప్రమాదాల భయం తగ్గుతుంది. అంతేకాకుండా, కారును ఎల్లప్పుడూ నీడలో పార్క్ చేసేలా చూసుకోండి. డైరెక్ట్‌గా ఎండ తగిలితే, డోర్ క్లోజ్ చేసి ఉంటుంది కనుక కారు లోపల ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది. ఇది సిఎన్‌జి వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
చిన్న అజాగ్రత్త వల్ల ప్రమాదాలు జరగవచ్చు సీఎన్‌జీ కారు సేఫ్టీ కోసం దానిని ఎప్పటికప్పుడు చెక్ చేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా సిఎన్‌జి పైప్‌లైన్, ఫిట్టింగ్‌లు, ట్యాంక్‌ను టైం టు టైం తప్పకుండా సర్వీసింగ్ చేయించాలి. ఎక్కడైనా గ్యాస్ వాసన వచ్చినా లేదా లీకేజీ ఉందని అనుమానం కలిగినా వెంటనే సర్వీస్ సెంటర్‌కు వెళ్లి చెక్ చేయించాలి. ఇలాంటి చిన్న అజాగ్రత్తలు కూడా పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చు. కనుక దేనిని ఈజీగా తీసుకోకూడదు.
దీనితో పాటు సీఎన్‌జి ట్యాంక్‌కు ఎప్పటికప్పుడు హైడ్రో టెస్ట్ చేయించడం కూడా అవసరం. ఈ టెస్ట్ ట్యాంక్ పవర్, భద్రతను చెక్ చేస్తుంది. చాలా కాలంగా ఈ పరీక్ష చేయించకపోతే, ప్రమాదాలను నివారించడానికి వీలైనంత త్వరగా చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సమ్మర్ సీజన్ కనుక ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. అందుకే ఏ రకం వాహనం అయినా, ఈ సీజన్లో వాటిని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయకపోతే ఇబ్బందులు తప్పవు.
ఇంజిన్ గురించి జాగ్రత్తలు తీసుకోవాలిఇంజిన్ పనితీరును మెరుగుపరచడానికి ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్‌లను శుభ్రం చేయడం, సమయానికి మార్చడం చాలా అవసరం. మురికిగా ఉన్న ఫిల్టర్లు లేదా పాడైపోయిన స్పార్క్ ప్లగ్‌ల వల్ల మైలేజీ తగ్గడమే కాకుండా, ఇంజిన్‌పై ఎక్కువ ప్రెషర్ పడుతుంది. దీంతో పాటు కారు సురక్షితంగా, సాఫీగా నడవడానికి టైర్లలో సరైన గాలి ఒత్తిడిని మెయింటైన్ చేయాలి. అలాగే, కారును ఎల్లప్పుడూ కేవలం సీఎన్‌జి మోడ్‌లోనే నడపకుండా, అప్పుడప్పుడు పెట్రోల్ మోడ్‌ను కూడా ఉపయోగించాలి. దీనివల్ల ఇంజిన్ లైఫ్ టైం మెరుగుపడుతుంది.
