Citroen Aircross vs Honda Elevate Comparison: సిటీ రోడ్లపై రోజువారీ ప్రయాణాలు చేసుకుంటూ, అవసరమైతే అప్పుడుప్పుడు దూర ప్రయాణాలకు వెళ్లేందుకు సరిపోయే SUV కోసం చూస్తున్న రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్‌లు ఎక్కువగా Citroen Aircross & Honda Elevate మోడళ్లను ఎంచుకుంటున్నారు. అయితే, ఈ రెండింటి మధ్య ఏది కొనాలన్న విషయంలో కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఈ రెండు కార్లు తమవైన ప్రత్యేకతలతో మార్కెట్లో జెండా ఎగరేశాయి. అయితే... వాడకంలో సౌలభ్యం, ఇంజిన్ పనితీరు, ప్రయాణ సౌకర్యం, నిర్వహణ, భవిష్యత్ విలువ వంటి విషయాలలో ఏ SUV మరింత సమర్థవంతంగా ఉంటుందో, ఆ కారును ఎంచుకోవడం తెలివైన పని.
ఇంజిన్ పనితీరు - సిటీకి ఏది సూట్?సిటీ ట్రాఫిక్‌లో ఆగుతూ, పోతూ నడిపే సందర్భాల్లో వాహనం సాఫ్ట్‌గా కదలాలి, శబ్దం లేకుండా నడవాలి. Honda Elevateలో ఉన్న 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ ఈ విషయంలో చాలా మెరుగ్గా పనిచేస్తుంది. యాక్సిలేటర్‌ను సున్నతంగా నొక్కగానే అందించే స్పందన మృదువుగా ఉంటుంది. రద్దీ రోడ్లలో వినియోగించే ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ మరింత సౌకర్యంగా ఉంటుంది. వాహనం వేగంలోని చిన్నపాటి మార్పులకు సైతం సాఫ్ట్‌గా స్పందించడం వల్ల, రిటైర్డ్ ఉద్యోగులు/ పెద్దవారికి ఈ కారు మరింత అనుకూలంగా ఉంటుంది.
Honda Elevate తో పోలిస్తే Citroen Aircross ఇంజిన్ కూడా నాణ్యమే అయినా, వేగం పెంచే సమయంలో ఇవ్వాల్సిన బలం కొద్దిగా తక్కువగా అనిపిస్తుంది. దాంతో సిటీ వాడకం ఉన్నవారికి Elevate ఇచ్చే తేలికపాటి, ఇబ్బంది లేని ప్రయాణం స్పష్టంగా బెటర్‌గా ఉంటుంది.
ప్రయాణ సౌకర్యం & రైడ్ క్వాలిటీCitroen Aircrossలో మృదువైన సస్పెన్షన్ ఉండడం వలన రోడ్డు గుంతలు, చిన్న చిన్న బంప్స్ ఉన్నా కూడా చాలా సాఫ్ట్‌గా ప్రయాణం సాగుతుంది. ఇదే ఈ వాహనానికి ఉన్న ప్రధాన మెరుగైన లక్షణం. కానీ Honda Elevateలో సస్పెన్షన్ కొంచెం కట్టుదిట్టంగా ఉండడం వలన అన్ని రోడ్లపై స్థిరత్వాన్ని ఇస్తుంది. సిటీ రోడ్లు, వంతెనలు, సర్వీస్ రోడ్లు - ఎక్కడ నడిపినా ఒక సురక్షిత అనుభూతి వస్తుంది. అప్పుడప్పుడు దూర ప్రయాణాలకు వెళ్లే వారికి ఈ స్థిరత్వం మరింత నమ్మకాన్ని అందిస్తుంది.
దూర ప్రయాణాలు - ఏ కారు మేలు?సెలవుల్లో లేదా అప్పుడప్పుడు కుటుంబంతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్లాలనుకుంటే Honda Elevate మరింత విశ్వసనీయంగా ఉంటుంది. ఎక్కువ వేగంతో నడిపినా వాహనం చాలా స్థిరంగా ఉంటుంది. స్టీరింగ్ వ్యవస్థ చేతికి బలం ఇచ్చినట్లు కచ్చితత్వంతో పని చేస్తుంది, వాహనం ఒణుకుతున్న భావన రాదు. Aircross కూడా మంచి ప్రయాణ సౌకర్యం ఇస్తుంది కానీ హైవే స్థిరత్వంలో Elevate మించినది కాదు.
ఫీచర్లు & ప్రాక్టికల్‌గా ఉపయోగకరమైన అంశాలుHonda Elevateలో వినియోగదారులకు పనికొచ్చే అనేక ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి. పార్కింగ్ సౌలభ్యం కోసం కెమెరా, పెద్ద తెరతో ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సేఫ్టీ ఫీచర్లు.. అన్నీ ప్రాక్టికల్‌గా పనికొస్తాయి. Citroen Aircrossలో కూడా ప్రయోజనకరమైన ఫీచర్లు ఉన్నప్పటికీ, కొన్ని వేరియంట్లలో కొన్ని ముఖ్యమైన అంశాలు మిస్సవుతాయి. పెద్ద వయస్సు డ్రైవర్లకు వేగంగా గమనించగలిగే, సులభంగా అందుకునే సెట్టింగులు ముఖ్యమైనవి, ఈ విషయంలో Honda స్పష్టంగా మెరుగ్గా ఉంటుంది.
సర్వీస్ సౌకర్యం & నిర్వహణHonda అనేది భారతదేశంలో ఎన్నో ఏళ్లుగా విశ్వసనీయత సంపాదించిన బ్రాండ్. దాని సర్వీస్ సెంటర్లు విస్తృతంగా ఉన్నాయి, నిర్వహణ ఖర్చులు కూడా అంచనా వేసుకోగలిగే విధంగా ఉంటాయి. Citroen కొత్త బ్రాండ్ కావడంతో దాని సర్వీస్ సెంటర్ల సంఖ్య తక్కువగా ఉంది. అందువల్ల, గ్రామీణ ప్రాంతాల్లో లేదా చిన్న పట్టణాల్లో ఇది సమస్యగా మారే అవకాశం ఉంటుంది. తక్కువ ఇబ్బందులతో ఉపయోగించాలనుకునే వారికి Honda Elevate ఈ విషయంలో కూడా మెరుగైన ఎంపిక.
భవిష్యత్ విలువHonda వాహనాలు సెకండ్ హ్యాండ్ అమ్మకాల మార్కెట్లో మంచి విలువను నిలబెట్టుకుంటాయి. Citroen వాహనాలకు రీసేల్ విలువ అంత బలంగా ఉండదు. రిటైర్డ్ యూజర్లకు భవిష్యత్ విలువ కూడా చాలా ముఖ్యం.
ఫైనల్ నిర్ణయం₹14 లక్షల బడ్జెట్‌లో, సిటీ డ్రైవింగ్‌తో పాటు అకేషనల్‌గా దూర ప్రయాణాలు చేసే రిటైర్డ్ ఉద్యోగులు/ సీనియర్ సిటిజన్లకు Honda Elevate అత్యుత్తమ ఎంపిక. సాఫ్ట్ ఇంజిన్, సిటీకి చక్కగా సరిపడే ఆటోమేటిక్ గేర్ సిస్టమ్, స్థిరమైన ప్రయాణ సౌకర్యం, విస్తృతంగా ఉన్న సర్వీస్ సెంటర్లు, మంచి రీసేల్ వాల్యూ - ఈ వాహనాన్ని మరింత నమ్మదగిన కారుగా నిలబెడతాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.