Electric Electric Airplane COMAC CE-25A: ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లు, ఇతర వాహనాల తర్వాత.. ఇప్పుడు విమానయాన రంగంలోనూ బ్యాటరీలతో నడిచే విమానాలపై ఆసక్తి పెరుగుతోంది. ఈ దిశగా చైనాకు చెందిన ప్రభుత్వ రంగ విమాన తయారీ సంస్థ COMAC కీలక ముందడుగు వేసింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన CE-25A ఎలక్ట్రిక్ ప్యాసింజర్ విమానం తొలిసారిగా సిబ్బందితో కలిసి విజయవంతంగా గాల్లోకి ఎగిరింది. 19 మంది ప్రయాణించగల ఈ విమానం భవిష్యత్తులో తక్కువ దూరపు విమాన ప్రయాణాలకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

Continues below advertisement

నవంబర్ 14, 2026న చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్‌లో బిన్‌జౌ నుంచి CE-25A విమానం తన తొలి మానవ సహిత పరీక్ష ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇందులో ఇద్దరు పైలట్లు, ఒక ఫ్లైట్ టెస్ట్ ఇంజినీర్ ఉన్నారు. విమానం మొత్తం పరీక్ష ప్రక్రియ 57 నిమిషాల 46 సెకన్ల పాటు కొనసాగింది. అందులో 16 నిమిషాల 38 సెకన్లు గాల్లో ప్రయాణించింది. ఈ సమయంలో 60.4 కిలోమీటర్ల దూరం కవర్ చేసి సురక్షితంగా తిరిగి వచ్చింది. పరీక్షలో అన్ని వ్యవస్థలు ఆశించిన విధంగా పనిచేశాయని COMAC వెల్లడించింది.

ఇదే తొలి విమాన ప్రయాణమా?

Continues below advertisement

CE-25Aకు ఇదే తొలి ప్రయాణం కాదు. ఈ విమానం ఫిబ్రవరి 2, 2026న తొలిసారిగా సిబ్బంది లేకుండా ఆటోమేటిక్‌గా గాల్లోకి ఎగిరింది. ఆ తర్వాత మొత్తం 19 అన్‌మ్యాన్డ్ ‍‌(విమానంలో మనుషులు లేకుండా) ఫ్లైట్ వెరిఫికేషన్ పరీక్షలు నిర్వహించారు. విమానంలోని వ్యవస్థలు, పనితీరు సరిగ్గా ఉన్నాయా అనే విషయాలను ఈ పరీక్షల ద్వారా పరిశీలించారు. వాటి తర్వాతే పైలట్లు, ఇంజినీర్‌తో కూడిన ప్రయాణాన్ని నిర్వహించారు.

ఈ విమానం ఎరుపు, నలుపు రంగుల కలయికతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. అక్టోబర్ చివరిలో, దీని పూర్తి స్థాయి నమూనా ఫొటోలు చైనా సోషల్ మీడియాలో కనిపించాయి. అయితే CE-25A స్కేల్ మోడల్‌ను 2023లోనే షాంఘైలో జరిగిన ప్రదర్శనలో చూపించారు.

ఇది కూడా చదవండి: కారు వైర్లను ఎలుకలు కొరికేస్తున్నాయా? రూ.వేల రిపేర్‌ ఖర్చు తప్పించుకోవాలంటే ఈ 5 చిట్కాలు పాటించండి!

విమానం ప్రత్యేకతలు ఏమిటి?

COMAC కంపెనీ CE-25A విమానాన్ని తక్కువ దూరపు నగరాల మధ్య ప్రయాణాల కోసం రూపొందించింది. ఇందులో 19 మంది ప్రయాణికులతో పాటు కొంతమంది సిబ్బంది ప్రయాణించవచ్చు. దీని గరిష్ఠ టేకాఫ్ బరువు 10 మెట్రిక్ టన్నులు. అంటే సుమారు 22,000 పౌండ్లు.

అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ విమానం గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. సుమారు 2,400 మీటర్ల ఎత్తులో ప్రయాణించేలా దీన్ని రూపొందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 400 కిలోమీటర్ల రేంజ్ అందించగలదని సంస్థ పేర్కొంది. గతంలో వచ్చిన కొన్ని నివేదికల్లో గంటకు 400 కిలోమీటర్ల వేగం, 500 కిలోమీటర్ల రేంజ్ గురించి ప్రస్తావించినప్పటికీ, ప్రస్తుతం COMAC వెల్లడిస్తున్న గణాంకాలు 300 కిలోమీటర్ల వేగం, 400 కిలోమీటర్ల రేంజ్‌కే పరిమితమయ్యాయి.

10 ఎలక్ట్రిక్ ఫ్యాన్లు.. ప్రత్యేక ప్రొపల్షన్ వ్యవస్థ

ఈ విమానంలో సంప్రదాయ జెట్ ఇంజిన్లు లేదా టర్బోప్రాప్ ఇంజిన్లకు బదులుగా డిస్ట్రిబ్యూటెడ్ ఎలక్ట్రిక్ డక్టెడ్ ఫ్యాన్ ప్రొపల్షన్ వ్యవస్థను ఉపయోగించారు. మొత్తం 10 ఎలక్ట్రిక్ ఫ్యాన్లు ఉంటాయి. ఒక్కో రెక్కపై ఐదు ఫ్యాన్లను అమర్చారు. ఇవి ఎలక్ట్రిక్ మోటార్ల సాయంతో పనిచేస్తాయి. మోటార్లకు అవసరమైన శక్తిని విమానంలోని బ్యాటరీ వ్యవస్థ అందిస్తుంది.

ఈ ఫ్యాన్లను రెక్కల నిర్మాణంలోనే అమర్చారు. సాధారణ విమానాల్లో కనిపించేలా బయటకు వేలాడే ఇంజిన్ మౌంట్లు ఇందులో ఉండవు. ఒక ఫ్యాన్ పనిచేయకపోయినా మొత్తం విమానంపై ప్రభావం తగ్గేలా ఈ డిజైన్‌ను రూపొందించినట్లు భావిస్తున్నారు. అయితే ఈ వ్యవస్థ వల్ల నిజ జీవితంలో ఎంత సామర్థ్యం, పనితీరు లభిస్తాయన్నది మరిన్ని పరీక్షల తర్వాతే స్పష్టమవుతుంది.

ఇది కూడా చదవండి: ఫ్యామిలీ కార్ కొనాలనుకుంటున్నారా? తక్కువ ధరలోనే కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్, చైల్డ్ సీట్ మౌంట్స్ ఇచ్చే కార్ల లిస్ట్‌

బ్యాటరీ వివరాలు ఇంకా రహస్యమే

CE-25Aలో ప్రస్తుతం ఏ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తున్నారో COMAC వెల్లడించలేదు. అందువల్ల దాని బ్యాటరీ సామర్థ్యం, ప్యాక్ స్థాయి ఎనర్జీ డెన్సిటీపై స్పష్టత లేదు.

వాణిజ్య ప్రయాణాలకు ఎప్పటి నుంచి?

చైనా విమానయాన నియంత్రణ సంస్థ, CE-25Aకు సంబంధించిన ఎయిర్‌వర్థినెస్ దరఖాస్తును పరిశీలనకు స్వీకరించింది. ప్రయాణికుల నుంచి డబ్బు తీసుకుని వాణిజ్య సేవలు ప్రారంభించాలంటే ఈ ప్రక్రియలో అవసరమైన అనుమతులు పొందాలి. అయితే ఎప్పుడు సర్టిఫికేషన్ పూర్తవుతుంది? ఎప్పటి నుంచి ప్రయాణికులకు సేవలు అందిస్తుంది? అనే వివరాలను COMAC ఇంకా ప్రకటించలేదు.

కొన్ని ఇతర విమాన తయారీ సంస్థలు కూడా పూర్తిగా ఎలక్ట్రిక్ విమానాలపై ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే ఎక్కువ దూరాల ప్రయాణాల విషయంలో పనితీరు, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని హైబ్రిడ్ వ్యవస్థల వైపు మళ్లిన సందర్భాలూ ఉన్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.