EV Range: ప్రపంచ ఈవీ రంగంలో మరో చారిత్రాత్మక మలుపు తిరిగింది. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ కార్ల యజమానులను వేధిస్తున్న అతి పెద్ద సమస్య రేంజ్ ఆందోళన. అంటే బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే మధ్యలో ఆగిపోతామేమో అన్న భయానికి ఇక కాలం చెల్లనుంది. చైనాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ చెర్రీ ఆటోమొబైల్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఏకంగా 1500 కిలోమీటర్లు కంటే ఎక్కువ దూరం దూసుకెళ్లే సామర్థ్యం ఉన్న సరికొత్త బ్యాటరీ సాంకేతికతను ప్రపంచానికి పరిచయం చేసింది.
మార్చి 18న నిర్వహించిన తన ప్రతిష్టాత్మక బ్యాటరీ నైట్ ఈవెంట్‌లో చెర్రీ సంస్థ ఈ అద్భుతమైన రైనో బ్యాటరీ సిరీస్‌ను ఆవిష్కరించింది. ఇది కేవలం ప్రయోగాత్మక ప్రకటన మాత్రమే కాదని, రాబోయే ఏడాదిలోనే దీన్ని క్షేత్రస్థాయిలో పరీక్షలు ప్రారంభమవుతాయని సంస్థ స్పష్టం చేసింది.
రైనో సిరీస్; ఆల్ సాలిడ్- స్టేట్ బ్యాటరీల రాక
చెర్రీ ఆవిష్కరించిన ఈ కొత్త సాంకేతికతలో అత్యంత కీలకమైంది ఆల్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ,. ప్రస్తుతం వాడుకలో ఉన్న లిథియం అయాన్ బ్యాటరీలతో పోలిస్తే ఇవి రెట్టింపు శక్తిని స్టోర్ చేస్తాయి. రైనో సిరీస్ బ్యాటరీలు 600Wh/kg ఎనర్జీ డెన్సిటీని కలిగి ఉన్నాయి. ఇది సాధారణ బ్యాటరీల కంటే చాలా ఎక్కువ. దీని వల్ల బ్యాటరీ పరిమాణం పెరగకుండానే ఎక్కువ దూరం ప్రయాణించే శక్తి లభిస్తుంది. చైనీస్ లైట్ డ్యూటీ వెహికల్ టెస్ట్ సైకిల్ నిబంధనల ప్రకారం ఈ బ్యాటరీ ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 1500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించేలా చేస్తుంది. అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కేవలం రెండుసార్లు ఛార్జ్ చేస్తే సరిపోతుందన్నమాట.
8 నిమిషాల్లో 500 కిలోమీటర్ల ఛార్జింగ్
చెర్రీ సంస్థ కేవలం రైనో బ్యాటరీతోనే ఆగలేదు. వేగవంతమైన ఛార్జింగ్ కోసం మరికొన్ని వినూత్న మోడళ్లను కూడా తీసుకొస్తోంది. ఇ- లిక్విడ్ బ్యాటరీ సెమీ సాలిడ్ స్టేట్ బ్యాటరీ. ఇది ఏకంగా 1200 కిలో వాట్ల ఛార్జింగ్ పవర్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇది కేవలం 8 నిమిషాల్లో ఛార్జింగ్ చేస్తే కారు 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. పెట్రోల్ బంకులో పెట్రోల్ నింపుకోవడానికి పట్టే సమయంలోనే మీ కారు బ్యాటరీ సగం కంటే ఎక్కువ ఛార్జ్ అవుతుంది. 400 కిలో వాట్ల సామర్థ్యంలో వస్తున్న సాలిడ్ స్టేట్ బ్యాటరీ ఎస్ సరీస్. దీనిని ప్రత్యేకంగా ఎక్సీడ్ ఈఎస్ సెడాన్ కార్ల కోసం రూపొందించారు.
రోడ్లపైకి ఎప్పుడు తీసుకొస్తారు?
చెర్రీ ఆటోమొబైల్ తన ప్రణాళికలను స్పష్టంగా వెల్లడించింది. ఈ ఏడాది ఆఖరులో పరిమిత స్థాయిలో పరీక్షలు నిర్వహించి, వచ్చే ఏడాది నుంచి పూర్తి స్థాయిలో వాహన పరీక్షలు ప్రారంభించనుంది. ఈ రైనో బ్యాటరీ మొదటగా ఎక్సీడ్ ఈఎస్ 8 మోడల్‌లో పరీక్షించునున్నారు. 2027 నాటికి ఈ బ్యాటరీ టెక్నాలజీతో కూడిన కార్లు భారీ ఎత్తున మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.
