Sunroof Using Tips: భారత్ మార్కెట్‌లో లోబడ్జెట్‌లోనే సన్‌రూఫ్ కార్లు వస్తున్నాయి. ఇలా సన్‌రూఫ్ ఉన్న వారంతా స్టైల్ ప్రదర్శిస్తుంటారు. వేగంగా వెళ్తున్న కారులో సన్‌రూఫ్ ఓపెన్ చేసి బయటకు వస్తూ ఫొటోలకు, వీడియోలకు ఫోజులు ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి వీడియోలు చాలానే వైరల్ అవుతున్నాయి. ఇదీ చూడటానికి సరదాగానే ఉన్నా దీని వెనుక చాలా ప్రమాదం దాగి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది ట్రాఫిక్ ఉల్లంఘనకు కూడా దారి తీసే ఛాన్స్ ఉందని అంటున్నారు.
మొదటగా భద్రతాపరమైన ఆందోళనలను పక్కన పెడితే, కదులుతున్న కారు నుంచి సన్‌రూఫ్ ద్వారా బయటకు రావడం అత్యంత ప్రమాదకరం. ఒక వేళ కారు అకస్మాత్తుగా బ్రేకులు వేసినా, కుదుపులు గురైనా, లేదా రోడ్డుపై ఏదైనా సమస్య ఎదురైనా ఆ వ్యక్తి తన బ్యాలెన్స్ కోల్పోతాడు. దీని కారణంగా గాయాలపాలయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా, రోడ్డు పక్కన ఉన్న చెట్లు, స్తంభాలు, లేదా విద్యుత్ తీగలు కూడా ప్రమాదాన్ని కలిగించవచ్చు. అందుకే రహదారి భద్రత దృష్ట్యా ఇది సురక్షితం కాదని అంటున్నారు.
జరిమానాతో చర్య తీసుకోవచ్చు
చట్టపరంగా, మోటారు వాహనాల చట్టం సన్‌రూఫ్ ద్వారా బయటకు వెళ్లడానికి స్పష్టంగా ప్రస్తావించనప్పటికీ అది ప్రమాదకరమైన చర్యగా లేదా నిర్లక్ష్యపు డ్రైవింగ్‌గా పరిగణిస్తారు. అటువంటి సందర్భాల్లో పోలీసులు మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 177 లేదా సెక్షన్ 184 కింద చర్య తీసుకోవచ్చు.
పరిస్థితిపై జరిమానా ఆధారపడి ఉంటుంది. సాధారణ ఉల్లంఘనకు చిన్న జరిమానా విధించవచ్చు. కానీ ప్రమాదకరమైన డ్రైవింగ్‌కు పాల్పడితే, జరిమానా వెయ్యి నుంచి పదివేల వరకు ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో, డ్రైవర్ లైసెన్స్‌ను రద్దు చేయవచ్చు. లేదా మరింత కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.
అటువంటి చర్యల వల్ల ప్రమాదం జరిగినా లేదా ఎవరి ప్రాణానికైనా ప్రమాదం వాటిల్లినా, ఆ విషయం మరింత తీవ్రమవుతుంది. అలాంటి పరిస్థితిలో పోలీసులు కేసు నమోదు చేసి శిక్ష విధించవచ్చు.
ఎల్లప్పుడూ ట్రాఫిక్ నియమాలను పాటించాలి
సన్‌రూఫ్ ముఖ్య ఉద్దేశం కారులోకి వెలుతురు, స్వచ్ఛమైన గాలిని తీసుకురావడం మాత్రమే, అంతేకానీ దానిలో నిలబడి బయటకు రావడం కాదు. కారు తయారీదారులు దీనిని ఈ ఉద్దేశంతో రూపొందిస్తారు. అందువల్ల సన్‌రూఫ్‌నుు సరిగా ఉపయోగించకపోవడం అనేది నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, మీ భద్రతకు, ఇతరుల భద్రతకు కూడా తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. కేవలం సరదా కోసం లేదా సోషల్ మీడియా కోసం చేసే ఈ చర్య, మీకు తీవ్ర నష్టాన్ని కలిగించవచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా వాహనం నడపడం మంచిది.
