Summer Car Parking | వేసవికాలంలో ఎండలు, వాతావరణం మనుషులకు మాత్రమే కాదు, వాహనాలకు కూడా నష్టం చేస్తుంది. ఎండ, వేడి గాలి, పెరుగుతున్న ఉష్ణోగ్రత కారు ఇంజిన్, బ్యాటరీ, పెయింట్‌తో పాటు ఇంటీరియర్లపై సైతం ప్రభావం చూపుతాయి. చాలాసార్లు వాహనదారులు, డ్రైవర్లు ప్లేస్ దొరకదని తొందరపాటులో తమ కార్లను పార్క్ చేస్తారు. కానీ తరువాత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. అందుకే సమ్మర్ సీజన్లో మండుటెండల్లో కారును పార్క్ చేసేటప్పుడు స్థలాన్ని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. చిన్న నిర్లక్ష్యం మీ కారు కండీషన్‌ను దెబ్బతీస్తుంది. అందుకు మీరు భారీగా ఖర్చు చేయాల్సి రావొచ్చు. అందుకే పార్కింగ్ సమయంలో ఈ విషయాలు గుర్తుంచుకోండి.

Continues below advertisement

నీడలో కారు పార్క్ చేయండి

కారును బహిరంగ ప్రదేశంలో నేరుగా ఎండలో పార్క్ చేయడం అతి పెద్ద తప్పు. కారు చాలా గంటలు ఎండలో ఉంటే దానిలో  ఉష్ణోగ్రత చాలా వేగంగా పెరుగుతుంది. మీరు తిరిగొచ్చాక డాష్‌బోర్డ్, సీట్లు, స్టీరింగ్ తాకడానికి కష్టంగా ఉంటుంది. నిరంతరం ఎండ తగలడం వల్ల కారు పెయింట్ త్వరగా షైనింగ్ కోల్పోతుంది. కారు ప్లాస్టిక్ భాగాలు త్వరగా దెబ్బతింటాయి. ఎక్కువ కాలం పాటు ఇలాగే జరిగితే, కారు ఇంటీరియర్ కూడా త్వరగా పాడవుతుంది. కనుక వేసవిలో ఎల్లప్పుడూ కారును నీడలో లేదా కవర్ పార్కింగ్‌లో పార్కింగ్ చేయడానికి ప్రయత్నించాలి.

వేసవిలో ఇది హానికరం కావచ్చు

నీడ ఉండే సెల్లార్ లేకపోవడంతో చెట్టు కింద కారును పార్క్ చేయడం బెస్ట్ ఛాయిస్ అని చాలా మంది భావిస్తారు. కాని వేసవిలో ఇది సరికాదు. చెట్ల నుండి పడే జిగట రెసిన్, ఎండిపోయిన ఆకులు, పక్షుల రెట్టలు కారు బాడీ, పెయింట్‌ను పాడు చేస్తాయి. వేడి కారణంగా ఈ మురికి కారుపై పేరుకుపోతుంది. తరువాత శుభ్రపరచడం కష్టం అవుతుంది. కొన్ని సార్లు కలర్ షేడ్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో చెట్ల కొమ్మలు విరిగి కారుపై పడవచ్చు, దానివల్ల కారు అద్దాలు ధ్వసం కావడం, లేక బాడీ దెబ్బతినే ప్రమాదం ఉంది.

Continues below advertisement

 క్లోజ్ ప్రదేశాలలో పార్క్ చేయవద్దు

వేడి గోడల దగ్గర లేదా పూర్తిగా మూసిఉన్న చోట కారును పార్క్ చేయడం అంత మంచిది కాదు. అలాంటి ప్రదేశాలలో గాలి ఆడదు. వేడి వేగంగా పెరుగుతుంది. ఇది కారు ఇంజిన్, బ్యాటరీని వేడెక్కడానికి కారణం కావచ్చు. అధిక ఉష్ణోగ్రతలో ఉండటం వల్ల కారు బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది. ఇంజిన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. వేసవిలో బ్యాటరీ, కూలింగ్ సిస్టమ్ ఇప్పటికే ఎక్కువ పని చేస్తాయి. కారును బాగా వెంటిలేషన్ ఉన్న చోట పార్క్ చేసుకోవాలి. 

చెత్త దగ్గర పార్క్ చేయవద్దు

రోడ్డు పక్కన పడేసిన చెత్త కుప్పల దగ్గర కారు పార్కింగ్ చేయడం ప్రమాదకరం. వేసవిలో అధిక ఉష్ణోగ్రత కారణంగా, కొన్నిసార్లు చెత్తకు మంటలు వస్తే.. కారుకు మంటలు వ్యాపించే అవకాశం ఉంది. కొన్నిసార్లు కారు కాలిపోవచ్చు. కనుక  ఎల్లప్పుడూ సురక్షితమైన ప్రదేశంలో పార్కింగ్ చేయాలి.

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర వద్దు

వాహనాలను విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లు లేదా విద్యుత్ తీగల కింద పార్క్ చేయడం ప్రమాదకరం. వేసవిలో విద్యుత్ పరికరాలపై ఎక్కువ లోడ్ పడి.. స్పార్కింగ్ లేదా సాంకేతిక లోపం తలెత్తవచ్చు. ట్రాన్స్‌ఫార్మర్‌లో ఏదైనా సమస్య వస్తే లేదా తీగలు తెగిపడితే, కారు డ్యామేజ్ అవుతుంది. కొన్నిసార్లు కారు కాలిపోయి మీరు పూర్తిగా నష్టపోతారు.