Car Interior Design Trends: ఇప్పటి కార్లలో అడుగు పెట్టగానే ఒక సందేహం వస్తోంది - మనం నిజంగా కారు లోపలా ఉన్నామా? లేక ఇంట్లో లివింగ్‌ రూమ్‌లో కూర్చున్నామా? అని. 2025 & 2026లో లాంచ్‌ అయిన చాలా కొత్త కార్లను చూస్తే ఈ సందేహం తప్పక వస్తుంది. ఆ కార్లన్నింటిలో గమనించిన విషయం ఏంటంటే - స్క్రీన్లు రాన్రానూ పెద్దవైపోతున్నాయి, సీట్లు మరింత తెల్లగా మారుతున్నాయి. కొన్నిసార్లు, ఇంటీరియర్‌ ట్రిమ్స్‌ కూడా పూర్తిగా లైట్‌ షేడ్స్‌లో ఉంటున్నాయి. భవిష్యత్తులో అవి ఇంకెలా మారిపోతాయోనని ఆశ్చర్యం వేస్తోంది.

Continues below advertisement

వైట్‌లో వాస్తవాన్ని చూద్దాం

నిజంగా జరిగిన ఒక సంఘటనను ఇక్కడ ఉదాహరణ చూద్దాం. ఒక కొత్త కారును పరీక్ష కోసం సిద్ధం చేశారు. రెండు గంటల్లోనే ఆ వైట్‌ ట్రిమ్‌ మురికిగా కనిపించింది. మన దేశంలో దుమ్ము, వేడి, తేమల మధ్య వైట్‌ లెదర్‌ సీట్లు ఎంతకాలం శుభ్రంగా ఉంటాయి?. “వైట్‌ అంటే లగ్జరీ” అని కొందరు అనవచ్చు. కానీ వాస్తవంగా చూస్తే ఇవి చాలా త్వరగా మాసిపోతాయి.

Continues below advertisement

ఇంకా పెర్ఫొరేటెడ్‌ వైట్‌ సీట్లు ఉంటే సంగతి చెప్పనక్కర్లేదు. వెంటిలేషన్‌ కోసం రంధ్రాలు పెడతారు. కానీ వారానికి ఒకసారి కారు శుభ్రం చేసేవారికి ఇది పెద్ద తలనొప్పి. ఆ రంధ్రాల్లోకి చేరిన ధూళిని శుభ్రం చేయడం అంత ఈజీ కాదు. “లైట్‌ కలర్స్‌ ఉంటే కారు లోపల స్పేస్‌ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది” అనే వాదన కూడా ఉంది. కానీ స్పేస్‌ కనిపించడం కన్నా మనకు ఉపయోగపడేలా ఉండడం ముఖ్యం కదా!.

మాస్‌ మార్కెట్‌ కార్లు అన్ని అవసరాలకు వాడతారు. కుటుంబంతో ప్రయాణాలు, పిల్లలు, గ్రామీణ రోడ్లు, నగర ట్రాఫిక్‌ - ఇవన్నీ ఉన్నప్పుడు లైట్‌ ఇంటీరియర్స్‌ ప్రాక్టికల్‌గా అనిపించవు. కార్‌ వాష్‌ బిజినెస్‌ చేసేవాళ్లను బతికించడానికి తప్ప, ఇలాంటి ఇంటీరియర్స్‌ తెలివైన నిర్ణయంగా కనిపించవు.

పెద్ద స్క్రీన్ల ట్రెండ్‌

సీట్ల సంగతి పక్కనబెడితే, ఇప్పుడు స్క్రీన్ల ట్రెండ్‌ మరింత ఆసక్తికరంగా మారింది. భారీ ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్లు, ప్యానోరమిక్‌ డిస్‌ప్లేలు - ఇవన్నీ టీవీ సెటప్‌లా కనిపిస్తున్నాయి. “ప్రైవసీ స్క్రీన్‌” అని చెప్పినా నిజానికి అవి అంత ప్రైవేట్‌గా ఉండవు. డ్రైవింగ్‌లో దృష్టి మళ్లించే ప్రమాదం కూడా ఉంది. కొన్ని కార్‌ కంపెనీలు ఇప్పుడు మితంగా స్క్రీన్లు వాడడం మొదలుపెట్టాయి. డ్రైవింగ్‌ సమయంలో కీలక ఫంక్షన్ల కోసం స్క్రీన్ల కంటే బటన్లు, స్విచ్‌లు ఉండడమే మంచిది.

మన మార్కెట్‌లో మాత్రం ఇంకా ఈ ట్రెండ్‌ కొనసాగుతోంది. లగ్జరీ బ్రాండ్లు ఏం చేస్తాయో, వాటిని అనుసరిస్తూ మిగతా బ్రాండ్లు కూడా వెళ్తున్నాయి. ADAS వంటి టెక్నాలజీ ఉపయోగకరమే. కానీ మన రోడ్ల పరిస్థితుల్లో, L షేపులో, S షేపులో విచిత్రంగా కట్టిన ఫ్లైఓవర్లు ఉన్న చోట, ఆ టెక్నాలజీ ఎంత వరకు సమర్థంగా పని చేస్తుందో ఆలోచించాలి.

కారు అనేది డ్రైవింగ్‌ కోసం. మన ప్రయాణాన్ని సులభం చేయడానికి. ఇది కాకుండా.. కారు కాస్తా లివింగ్‌ రూమ్‌లోని సోఫా లాగా, టెలివిజన్‌ సెటప్‌ లాగా ఉండాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ, డిజైన్‌ అన్నీ మంచివే. కానీ అవి వాస్తవ పరిస్థితులకు సరిపడేలా ఉండాలి. అవి మన రోడ్లను & వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యం ఇచ్చే డిజైన్‌లు వస్తేనే యూజర్లకు నిజమైన లాభం ఉంటుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.