వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలకు ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కారు లోపల ఉష్ణోగ్రత చాలా వేగంగా పెరుగుతుంది. బయట ఉష్ణోగ్రత 35 డిగ్రీలు ఉంటే, డోర్ మూసి ఉన్న కారు లోపల ఇది కేవలం 30 నిమిషాల్లో 50 నుండి 60 డిగ్రీల వరకు చేరుకునే ఛాన్స్ ఉంది. అలాంటి పరిస్థితుల్లో కారు ఒక ఓవెన్ లాగా పనిచేస్తుంది. ఈ అధిక వేడి కారణంగా, కారులో ఉంచిన కొన్ని సాధారణ వస్తువులు కూడా చాలా ప్రమాదకరంగా మారవచ్చు. అవే మంటలకు కారణం కావచ్చు. అందుకే కొన్ని వస్తువులను ఎప్పుడూ కారులో ఉంచరాదు.
లైటర్లు, గ్యాస్ వస్తువుల ప్రమాదం
మీరు కారులో లైటర్లను అలాగే వదిలేస్తే అవి చాలా ప్రమాదకరంగా మారతాయి. లైటర్లలో గ్యాస్ ఉంటుంది. ఇది వేడి ఉన్నప్పుడు వేగంగా వ్యాపిస్తుంది. ఒత్తిడి పెరిగినప్పుడు, లైటర్ పేలిపోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితిలో చిన్న నిప్పు రవ్వ కూడా కారు లోపల మంటలకు కారణం కావచ్చు. ముఖ్యంగా సీట్లు లేదా ప్లాస్టిక్ భాగాలకు మంటలు వేగంగా వ్యాప్తి చెందుతాయి.
శానిటైజర్, పెర్ఫ్యూమ్ కూడా ప్రమాదకరమే
ప్రస్తుతం ప్రతి కారులో శానిటైజర్, పెర్ఫ్యూమ్ లాంటివి కనిపిస్తున్నాయి. కానీ వాటిలో ఆల్కహాల్ ఉంటుంది, కనుక త్వరగా మంటలు వచ్చేలా చేస్తాయి. వీటితో పాటు డియోడరెంట్, ఎయిర్ ఫ్రెషనర్ డబ్బాలలో గ్యాస్ నిల్వ ఉంటుంది. అధిక వేడిలో ఈ డబ్బాలు పేలిపోయి మంటలు వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి.
ఎలక్ట్రానిక్ పరికరాలు, పవర్ బ్యాంకులు
మొబైల్స్, పవర్ బ్యాంక్, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్‌లో లిథియం బ్యాటరీలు ఉంటాయి. ఈ బ్యాటరీలు అధిక వేడిని తట్టుకునేలా ఉండవు. ఉష్ణోగ్రత భారీగా పెరిగినప్పుడు, ఈ బ్యాటరీ ఉబ్బవచ్చు లేదా కొన్ని సందర్భాల్లో పేలిపోవచ్చు. ముఖ్యంగా మీరు వాటిని డాష్‌బోర్డ్‌పై వదిలేస్తే, ఇక్కడ నేరుగా ఎండ వాటిపై పడుతుంది. దాంతో ప్రమాదం మరింత పెరుగుతుంది.
వాటర్ బాటిల్ వల్ల ప్రమాదం
వాటర్ బాటిల్ కారులోపల ఉంటే సమ్మర్ సీజన్లో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇది వినడానికి విచిత్రంగా అనిపించవచ్చు. కానీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కూడా మంటలు రావడాణికి కారణం కావచ్చు. సూర్య కిరణాలు బాటిల్ నుంచి ప్రసరించినప్పుడు, ఇది లెన్స్ లాగా పనిచేస్తుంది. ఇది ఒక ప్రదేశంలో ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది.న దీనివల్ల సీటు లేదా కారు లోపల ఉన్న ఏవైనా బట్టలు మండిపోయే అవకాశం ఉంది.
కళ్లద్దాలు, లెన్స్‌ల ప్రభావం
కారులో ఉంచిన కళ్లద్దాలు కూడా అదే విధంగా నష్టాన్ని కలిగిస్తాయి. దాని లెన్సులు సూర్యరశ్మిని ఒక ప్రదేశంలో కేంద్రీకరించడంతో డాష్‌బోర్డ్ లేదా సీటు వేడెక్కి కరిగిపోవచ్చు. లేకపోతే లెన్స్ హీటెక్కడంతో మంటలు చెలరేగే ప్రమాదం పెరుగుతుంది.
