Useful Car Accessories Warranty: కారును మరింత స్టైలిష్‌గా, సౌకర్యవంతంగా మార్చుకోవడానికి చాలా మంది అదనపు హంగులు (యాక్సెసరీస్) ‍అమర్చుకుంటుంటారు. డోర్ వైజర్లు, సీట్ కవర్లు, అల్లాయ్ వీల్స్, డ్యాష్‌క్యామ్‌లు, అంబియంట్ లైటింగ్ వంటి అనేక యాక్సెసరీస్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని అమర్చుకుంటే కారు వారంటీ రద్దవుతుందా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.

Continues below advertisement

ఇటీవల, కేరళ ప్రభుత్వం, కొన్ని ఆఫ్టర్‌మార్కెట్ మోడిఫికేషన్‌లకు అనుమతి ఇవ్వడంతో ఈ అంశం మళ్లీ చర్చల్లోకి వచ్చింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అన్ని యాక్సెసరీస్ వల్ల కారు వారంటీ రద్దు కాదు. కొన్ని నియమాలు పాటిస్తే వారంటీపై ఎలాంటి ప్రభావం ఉండదు.

డెకరేటివ్ యాక్సెసరీస్‌తో సాధారణంగా సమస్య రాదు

Continues below advertisement

కారు బాడీకి డ్రిల్లింగ్, వెల్డింగ్ చేయకుండా అమర్చే యాక్సెసరీస్ సాధారణంగా వారంటీని ప్రభావితం చేయవు. డోర్ వైజర్లు, బంపర్ ప్రొటెక్టర్లు, డోర్ ప్రొటెక్టర్లు, మడ్ ఫ్లాప్స్ వంటి వాటిని సురక్షితంగా ఉపయోగించవచ్చు.

అలాగే 3m టేప్ వంటి ఆటోమోటివ్ గ్రేడ్ అంటుకునే పదార్థాలతో అమర్చే యాక్సెసరీస్ కూడా సాధారణంగా వారంటీకి సమస్య కలిగించవు. స్పాయిలర్లు, రూఫ్ రైల్స్ వంటి వాటిని కూడా బాడీపై డ్రిల్లింగ్ లేదా వెల్డింగ్ చేయకుండా అమర్చితే ఎలాంటి ఇబ్బంది ఉండదు.

అల్లాయ్ వీల్స్ విషయంలో జాగ్రత్త

చాలా మంది కార్లలో స్టాక్ వీల్స్‌ను మార్చి అల్లాయ్ వీల్స్ అమర్చుకుంటారు. కంపెనీ ఇచ్చిన ఒరిజినల్ వీల్ సైజ్‌కు అనుగుణంగా అల్లాయ్ వీల్స్ అమరిస్తే సాధారణంగా వారంటీపై ప్రభావం ఉండదు.

అయితే పెద్ద సైజు వీల్స్, వెడల్పాటి టైర్లు లేదా వీల్ స్పేసర్లు ఉపయోగిస్తే సస్పెన్షన్, స్టీరింగ్, డ్రైవ్‌ట్రైన్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో సంబంధిత భాగాల వారంటీని తిరస్కరించే అవకాశం ఉంటుంది.

ఇంటీరియర్ యాక్సెసరీస్ ఎక్కువగా సేఫ్

సీట్ కవర్లు, స్టీరింగ్ వీల్ కవర్లు, ఫ్లోర్ మ్యాట్స్, డోర్ స్కఫ్ ప్లేట్లు, డ్యాష్‌బోర్డ్ అలంకరణ వస్తువులు, విండో సన్‌షేడ్స్ వంటి ఇంటీరియర్ యాక్సెసరీస్ సాధారణంగా వారంటీకి ఎలాంటి ముప్పు కలిగించవు.

అయితే సీట్లలో వెంటిలేషన్, హీటింగ్, మసాజ్ ఫంక్షన్లు లేదా కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్ ఉంటే జాగ్రత్త అవసరం. సీట్ కవర్ల కారణంగా అవి సరిగా పనిచేయకపోతే సంబంధిత భాగాల వారంటీపై ప్రభావం పడవచ్చు.

ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్‌తో ఎక్కువ రిస్క్

డ్యాష్‌క్యామ్‌లు, పార్కింగ్ కెమెరాలు, అంబియంట్ లైటింగ్ వంటి ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్ అమర్చేటప్పుడు ప్రత్యేక జాగ్రత్త అవసరం. వైరింగ్‌ను కట్ చేయడం, స్ప్లైసింగ్ చేయడం లేదా నేరుగా ఎలక్ట్రికల్ సిస్టమ్‌లో మార్పులు చేయడం వల్ల సంబంధిత వారంటీ రద్దయ్యే అవకాశం ఉంటుంది.

అయితే USB పోర్ట్ లేదా 12 వోల్ట్ (12V) సాకెట్ ద్వారా పనిచేసే ప్లగ్ అండ్ ప్లే పరికరాలు సాధారణంగా సురక్షితం. కానీ అధిక విద్యుత్ వినియోగించే ఆఫ్టర్‌మార్కెట్ హెడ్‌లైట్లు, భారీ ఆడియో సిస్టమ్‌లు, పవర్ యాంప్లిఫైయర్లు వంటి పరికరాలు వాహన ఎలక్ట్రికల్ వ్యవస్థపై ఒత్తిడి పెంచి సమస్యలకు దారితీయవచ్చు.

వారంటీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే?

ఏ యాక్సెసరీ అయినా అమర్చే ముందు, కారు యజమానులు 'ఓనర్స్ మాన్యువల్‌'ను పూర్తిగా చదవాలి. అలాగే డీలర్‌షిప్‌ను సంప్రదించి అనుమతి లేదా గైడెన్స్‌ తీసుకోవడం మంచిది.

వాట్సాప్ లేదా ఇమెయిల్ ద్వారా జరిగిన సంభాషణలను భద్రపరచుకోవడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. యాక్సెసరీస్‌కు సంబంధించిన బిల్లులు, రసీదులు తప్పకుండా ఉంచుకోవాలి. కంపెనీ అందించే ఒరిజినల్ యాక్సెసరీస్‌ను డీలర్‌షిప్‌లోనే అమర్చుకుంటే వారంటీ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ.

ఒక విషయం గుర్తుంచుకోండి

ఆఫ్టర్‌మార్కెట్ యాక్సెసరీ అమర్చారని మొత్తం కారు వారంటీ రద్దు కాదు. ఆ మార్పు వల్ల ప్రభావితమైన భాగానికి మాత్రమే వారంటీ వర్తించకపోవచ్చు. మిగతా భాగాలకు వారంటీ కొనసాగుతుంది. అందుకే, కారు మోడిఫికేషన్ లేదా యాక్సెసరీస్ అమర్చేటప్పుడు సరైన సమాచారం తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.