CAFE 3 Norms India: భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో వచ్చే పెద్ద మార్పుల్లో ముఖ్యమైనది CAFE 3 నిబంధనలు. 2027 ఏప్రిల్ 1 నుంచి 2032 మార్చి 31 వరకు అమల్లో ఉండే ఈ నిబంధనలు కార్ల ఎమిషన్ స్టాండర్డ్స్, ఫ్యూయల్ ఎఫిషియెన్సీ, ముఖ్యంగా చిన్న కార్ల భవిష్యత్తు మీద గణనీయమైన ప్రభావం చూపనున్నాయి. కాబట్టి, భవిష్యత్‌లో కార్ కొనే ప్లాన్ చేసేవాళ్లు ముందుగానే ఈ విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం.
CAFE 3 అంటే ఏమిటి?CAFE (Corporate Average Fuel Efficiency) అంటే, ప్రతి కార్ కంపెనీలోని అన్ని మోడళ్ల సగటు ఫ్యూయల్ ఎఫిషియెన్సీ, CO₂ ఎమిషన్ నిర్దిష్ట స్థాయికి దిగువన ఉండాలి అన్న నిబంధన. తాజా CAFE 3 డ్రాఫ్ట్ ప్రకారం, కంపెనీలు 2027లో విక్రయించే కార్ల సగటు ఫ్యూయల్ వినియోగం ప్రతి 100 km కు 3.73 లీటర్లు, 2032 నాటికి 3.01 లీటర్లకు తగ్గాలి. అంటే ఇంజిన్ మరింత సమర్థవంతంగా ఉండాలి, కార్లు తక్కువ CO₂ విడుదల చేయాలి.
వివాదం ఎందుకు?CAFE 3 లో అత్యంత హాట్ టాపిక్ - చిన్న పెట్రోల్ కార్లకు ఇచ్చిన ప్రత్యేక రాయితీ.
రిలీఫ్ ఏమిటి?909 kg లోపు, 1,200cc వరకు ఇంజిన్, 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉన్న పెట్రోల్ కార్లు అదనంగా 3g CO₂/km రిలీఫ్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో చిన్న కార్లు తయారు చేసే కంపెనీలకు పరిస్థితి కాస్త సులభంగా మారుతుంది.
ఎవరికి ఉపయోగం, ఎవరికి కాదు?మారుతి, హ్యుందాయ్ - ఈ బ్రాండ్ల చిన్న కార్లు మన దేశంలోని మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండాలి. కఠిన నిబంధనలు పెట్టితే చిన్న కార్ల ధరలు పెరుగుతాయి, ప్రజలు కొనలేరు.
టాటా, టయోటా, మహీంద్రా - రూల్స్‌లో రిలీఫ్ ఇస్తే మొత్తం మార్కెట్ గందరగోళంగా మారుతుంది. పైగా సేఫ్టీపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
ఇప్పుడు సేఫ్టీనే పెద్ద డిబేట్‌కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం... కార్ల బరువు ఆధారంగా రాయితీ ఇస్తే, కొన్ని కంపెనీలు కార్ల బాడీలో క్వాలిటీ తగ్గించి ఖర్చు తగ్గించుకోవచ్చు. లైట్ వెయిట్ అంటే సేఫ్టీ కాంప్రమైజ్ అయ్యే ప్రమాదం ఉంది. ప్రత్యేకంగా, Bharat NCAP వచ్చాక సేఫ్టీ స్టాండర్డ్స్ పెరిగాయి. ఈ సమయంలో చిన్న కార్లకు అదనపు రిలీఫ్ ఇవ్వడం వల్ల సేఫ్టీ విషయంలో ఆందోళన కూడా ఉంది.
CAFE 3 ప్రజలపై ఎలా ప్రభావం చూపుతుంది?
1. కార్ల ధరలు పెరిగే అవకాశం
రూల్స్ అన్ని కంపెనీలకు ఒకేలా అమల్లోకి వస్తే: కంపెనీలు కొత్త టెక్నాలజీ, హైబ్రిడేషన్, లైట్‌వైట్ మెటీరియల్స్ వాడాల్సి ఉంటుంది. దీంతో చిన్న కార్ల ధరలు కూడా పెరగవచ్చు.రిలీఫ్ కొనసాగితే: చిన్న కార్ల ధరలు ఎక్కువగా పెరగకుండా ఉండే అవకాశం ఉంది.
2. EVలు, హైబ్రిడ్స్ మరింత వేగంగా వస్తాయి
EVలు, స్ట్రాంగ్ హైబ్రిడ్స్ కంపెనీలకు “సూపర్ క్రెడిట్స్” ఇస్తారు. అందుకే 2027 తర్వాత చాలా బ్రాండ్లు EV-హైబ్రిడ్ మోడళ్లను మరింత ఎక్కువగా తీసుకురావడం ఖాయం. AP, TG లాంటి మార్కెట్లలో కూడా మధ్య స్థాయి సెగ్మెంట్ల్లో కొత్త హైబ్రిడ్ ఆప్షన్లు వచ్చే అవకాశం ఉంది.
3. రన్నింగ్ ఖర్చులు తగ్గే అవకాశం
కంపెనీలు మరింత ఫ్యూయల్ ఎఫిషియెంట్ ఇంజన్లను తీసుకురావాల్సి ఉంటుంది. దీంతో లాంగ్ టర్మ్‌లో పెట్రోల్ ఖర్చులు తగ్గవచ్చు.
4. రీసేల్ విలువలు మారతాయి
తక్కువ CO₂ వాహనాలు (EVలు, హైబ్రిడ్ కార్లు) భవిష్యత్తులో ఎక్కువ డిమాండ్ పొందే అవకాశం ఉంది. దీంతో వాటి రీసేల్ విల్యూలు కూడా మెరుగై ఉండొచ్చు.
CAFE 3 నిబంధనలు చిన్న కార్లకు రిలీఫ్ ఇవ్వాలా, లేకపోతే యూనిఫార్మ్ రూల్స్ (అన్ని కంపెనీలకు ఒకేలా) పాటించాలా అన్న విషయంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ రెండు వర్గాలైంది. కానీ, మొత్తం మీద ఇవి వాహనాలను మరింత శుభ్రంగా, సమర్థవంతంగా మార్చే దిశగా ఇది ఒక పెద్ద అడుగే.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.