Best resale value two wheelers: భారతదేశంలో టూ వీలర్‌ అనేది కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు. చాలా కుటుంబాలకు అది రోజువారీ జీవనంలో ఒక భాగం. ఆఫీస్‌కు వెళ్లడం నుంచి పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లడం వరకూ టూ వీలర్ల మీదే ఆధారపడతారు. కాబట్టి, కొనుగోలు చేసిన తర్వాత కూడా విలువను నిలబెట్టుకునే టూ వీలర్లు ఉంటే, అవి నిజంగా మంచి ఇన్వెస్ట్‌మెంట్‌గా మారతాయి.

Continues below advertisement

ప్రత్యేకంగా, లక్ష రూపాయల లోపు బడ్జెట్‌ టూ వీలర్లు విషయంలో రీసేల్‌ విలువ చాలా కీలకం. కారణం ఏంటంటే - ఈ సెగ్మెంట్‌లో కొనేవాళ్లు ఎక్కువ, అమ్మేవాళ్లు చాలా ఎక్కువ. హీరో, హోండా, బజాజ్‌ లాంటి నమ్మకమైన బ్రాండ్లు కొత్త మార్కెట్‌లోనే కాదు, యూజ్డ్‌ మార్కెట్‌లో కూడా డిమాండ్‌ కొనసాగిస్తాయి. దేశమంతా సర్వీస్‌ సెంటర్లు ఉండటం, లోకల్‌ మెకానిక్‌లకు ఈ మోడళ్లపై పూర్తి అవగాహన ఉండటం వీటి బలంగా మారింది.

హీరో స్ప్లెండర్‌

Continues below advertisement

రీసేల్‌ విలువ మాట వస్తే ముందుగా గుర్తుకు వచ్చేది హీరో స్ప్లెండర్‌. భారతదేశంలో సంవత్సరాలుగా నంబర్‌ 1 కమ్యూటర్‌ బైక్‌గా కొనసాగుతోంది. 97-100 సీసీ ఇంజిన్‌తో ఇది సాధారణంగా కనిపించినా, నమ్మకమే దీని అసలు ప్లస్‌ పాయింట్‌. కొత్త బైక్‌ ధర సుమారు ₹74,152 ఉండగా, రెండేళ్లు వాడిన తర్వాత, దాదాపు 20,000 కిలోమీటర్లు నడిపిన స్ప్లెండర్‌కు ఇంకా ₹58,000 వరకు ధర పలుకుతోంది. అంటే దాదాపు 75 శాతం రీసేల్‌ విలువ. 60 కిలోమీటర్లకు పైగా మైలేజ్‌, తక్కువ మెయింటెనెన్స్‌ ఖర్చు దీన్ని ఎప్పటికీ హాట్‌ ఫేవరెట్‌గా ఉంచుతున్నాయి.

హోండా యాక్టివా 

స్కూటర్‌ సెగ్మెంట్‌లో హోండా యాక్టివాకి ప్రత్యేక స్థానం ఉంది. పట్టణాల్లోనే కాదు, చిన్న పట్టణాలు, గ్రామాల్లో కూడా దీని డిమాండ్‌ తగ్గదు. 110 సీసీ ఇంజిన్‌, స్మూత్‌ పనితీరు, కుటుంబానికి సరిపోయే డిజైన్‌ కారణంగా యూజ్డ్‌ మార్కెట్‌లో యాక్టివా ఎప్పుడూ అమ్ముడుపోతూనే ఉంటుంది. కొత్త యూనిట్‌ ₹75,433 నుంచి ₹89,806 వరకు ధర ఉన్న యాక్టివా, 2023 మోడల్‌ అయితే ఇప్పటికీ ₹50,000 నుంచి ₹65,000 వరకు పలుకుతోంది. అంటే 65-70 శాతం రీసేల్‌ విలువ.

హోండా షైన్‌

125 సీసీ సెగ్మెంట్‌లో హోండా షైన్‌ మరో బలమైన పేరు. 2024 డ్రమ్‌ వేరియంట్లు ₹80,852 నుంచి ₹85,211 ధరలో అందుబాటులో ఉన్నాయి. దాదాపు 35,000 నుంచి 40,000 కిలోమీటర్లు వాడిన తర్వాత కూడా ఈ బైక్‌కు ₹59,000 నుంచి ₹65,000 వరకు రీసేల్‌ ధర వస్తోంది. OBD2B ప్రమాణాలు, డిజిటల్‌ ఫీచర్లు, రోజువారీ ప్రయాణానికి సరిపోయే శక్తిమంతమైన ఇంజిన్‌ దీనికి ప్లస్‌ పాయింట్లు.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350

రూ.లక్ష లోపు బడ్జెట్‌ను కొంచెం దాటినా, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350ని ఈ జాబితాలో ప్రస్తావించాల్సిందే. దీని రీసేల్‌ విలువ లెక్కలు సాధారణ కమ్యూటర్‌ బైక్స్‌లా ఉండవు. రెట్రో డిజైన్‌, 350 సీసీ ఇంజిన్‌, అభిమానుల వర్గం కారణంగా సంవత్సరాలు గడిచినా డిమాండ్‌ తగ్గదు. కొన్నిసార్లు పాత మోడళ్లకే మంచి ధర రావడం కూడా చూస్తుంటాం. ఇక్కడ లెక్కల్లోకి రాని విషయం ఒకటి ఉంది - ఎమోషనల్‌ ఫ్యాక్టర్‌. అదే దీనిని ప్రత్యేకంగా నిలబెడుతుంది.

ఎందుకు రీసేల్‌ విలువ ఎక్కువ?

ఈ బైక్స్‌, స్కూటర్లకు మంచి రీసేల్‌ రావడానికి ప్రధాన కారణాలు... నమ్మకమైన ఇంజిన్‌, తక్కువ ఖర్చుతో మెయింటెనెన్స్‌, మంచి మైలేజ్‌, పట్టణాలు & గ్రామాలు అన్న తేడా లేకుండా డిమాండ్‌ ఉండటం. మీరు మొదటిసారి టూ వీలర్‌ కొనుగోలు చేస్తున్నా, తర్వాత అప్‌గ్రేడ్‌ కావాలన్నా, ఈ జాబితాలోని మోడళ్లను ఎంచుకుంటే మీ పెట్టుబడి తిరిగి వస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.