PUCC validity for BS6 cars: దేశంలోని లక్షలాది కార్ల యజమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. BS6 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ప్రైవేట్ కార్లకు తప్పనిసరిగా తీసుకోవాల్సిన PUCC (Pollution Under Control Certificate) గడువును పెంచాలని కేంద్ర రోడ్డు రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఏడాది పాటు మాత్రమే చెల్లుబాటు అయ్యే ఈ ధ్రువీకరణను ఇకపై మూడేళ్ల వరకు చెల్లుబాటు అయ్యేలా మార్చాలని ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది.
సమయం & ఖర్చు రెండూ ఆదాఈ ప్రతిపాదన ప్రకారం, ఆరు సంవత్సరాల లోపు వయస్సు ఉన్న BS6 ప్రైవేట్ కార్లకు PUCC ఒకసారి తీసుకుంటే మూడేళ్ల పాటు చెల్లుబాటులో ఉంటుంది. దీంతో, ప్రతి ఏడాది కాలుష్య పరీక్ష చేయించుకునే అవసరం ఉండదు. ఇది కార్ల యజమానులకు సమయం & ఖర్చు రెండింటినీ ఆదా చేసే నిర్ణయంగా భావిస్తున్నారు.
ఆరు సంవత్సరాలు దాటితే...అయితే, ఈ సడలింపు అన్ని వాహనాలకు వర్తించదు. ఆరు సంవత్సరాలు దాటిన - 10 సంవత్సరాల లోపు ఉన్న BS6 కార్లకు ప్రస్తుతం ఉన్నట్లుగానే ప్రతి ఏడాది PUCCను పునరుద్ధరించాల్సి ఉంటుంది. అలాగే, 10 సంవత్సరాలకు పైబడిన BS6 కార్లకు ప్రతి ఆరు నెలలకోసారి కాలుష్య ధ్రువీకరణ తప్పనిసరి. అంటే వాహనం వయస్సును బట్టి నిబంధనలు అమల్లో ఉంటాయి.
ఇది కూడా చదవండి: EVలకు తగ్గని డిమాండ్ - జులైలో 32 వేలకుపైగా అమ్మకాలు, ఏ కంపెనీ ఎన్ని కార్లను విక్రయించిందంటే..?
BS4 & అంతకంటే పాత మోడల్ కార్ల యజమానులకు మాత్రం ఎలాంటి ఊరట లేదు. ముసాయిదా ప్రకారం BS4 కార్లకు ఇప్పటిలాగే ప్రతి ఆరు నెలలకు ఒకసారి PUCCను పునరుద్ధరించాలి. BS1, BS2 & BS3 ప్రమాణాలకు చెందిన అన్ని వాహనాలు మాత్రం ప్రతి మూడు నెలలకు ఒకసారి కొత్త ధ్రువీకరణ తీసుకోవాల్సిందే.
PUCC అంటే...PUCC అంటే "పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్". జనం వాడుక భాషలో చెప్పాలంటే.. "పొల్యూషన్ సర్టిఫికెట్". వాహనం నుంచి వెలువడే కాలుష్య ఉద్గారాలు ప్రభుత్వం నిర్దేశించిన పరిమితుల్లోనే ఉన్నాయా లేదా అనే విషయాన్ని నిర్ధారించే అధికారిక ధ్రువీకరణ ఇది. ఈ ధ్రువీకరణ లేకుండా వాహనం నడిపితే జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి వాహన యజమాని గడువు ముగిసేలోపు కొత్త ధ్రువీకరణ పొందడం తప్పనిసరి.
భారత్ స్టేజ్ (BS) ఉద్గార ప్రమాణాలు అంటే, వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలు. దేశంలో 2020 ఏప్రిల్ నుంచి BS6 తొలి దశ అమల్లోకి వచ్చింది. అనంతరం 2023 ఏప్రిల్ నుంచి రెండో దశ అమలవుతోంది. ఈ ప్రమాణాల వల్ల వాహనాల నుంచి వెలువడే హానికర ఉద్గారాలు గణనీయంగా తగ్గాయని ప్రభుత్వం చెబుతోంది.
ఇది కూడా చదవండి: వర్షంలోనే టూవీలర్ నడుపుతున్నారా..? ఈ తప్పులు చేస్తే మీ బండి మధ్య రోడ్డులోనే ఆగిపోవచ్చు!
భారత్ స్టేజ్ ప్రమాణాల చరిత్రను పరిశీలిస్తే, 2000 సంవత్సరంలో దేశవ్యాప్తంగా BS1 అమల్లోకి వచ్చింది. అదే సమయంలో ప్రధాన నగరాల్లో దశలవారీగా BS2ను ప్రవేశపెట్టారు. అనంతరం BS3 & BS4 ప్రమాణాలు అమల్లోకి వచ్చాయి. వాస్తవానికి BS5కు వెళ్లాల్సి ఉన్నప్పటికీ తక్కువ సల్ఫర్ ఇంధనం సరఫరాలో ఉన్న సవాళ్ల కారణంగా భారత్ నేరుగా BS4 నుంచి BS6కు మారింది. దీంతో కాలుష్య నియంత్రణలో దేశం ఒకేసారి పెద్ద ముందడుగు వేసింది.
కేంద్రం తాజాగా ప్రతిపాదించిన ఈ మార్పులు అమల్లోకి వస్తే కొత్త BS6 కార్ల యజమానులకు గణనీయమైన ఊరట లభించనుంది. తరచూ కాలుష్య పరీక్షల కోసం వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయి. అయితే ఇది ప్రస్తుతం ముసాయిదా ప్రతిపాదన మాత్రమే. ప్రజల అభిప్రాయాలు పరిశీలించిన తర్వాత తుది నోటిఫికేషన్ జారీ అయినప్పుడే కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
