ఎలక్ట్రిక్ వాహనాల (EV) అమ్మకాలను పెంచడానికి, వాటి భారీ ప్రారంభ ధరలను తగ్గించడానికి ప్రవేశపెట్టిన సరికొత్త ఫైనాన్సింగ్ విధానం 'బ్యాటరీ-యాస్-ఏ-సర్వీస్' (BaaS). ఇది అందుబాటులోకి వచ్చి దాదాపు 18 నెలలు కావస్తున్నా, కేవలం 2 నుండి 3 శాతం మంది కొనుగోలుదారులు మాత్రమే దీనిపై ఆసక్తి చూపుతున్నారు. ధరల విషయంలో చాలా సున్నితంగా ఉండే భారతీయ మార్కెట్లో ఈ మోడల్ ఒక గేమ్-ఛేంజర్ అవుతుందని భావించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇది ఒక చిన్న స్థాయికే పరిమితమైందని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు.
ధర తగ్గినా ఎందుకు కొనడం లేదు?సాధారణంగా ఒక ఎలక్ట్రిక్ కారు ధరలో బ్యాటరీ వాటా సుమారు 35 నుండి 40 శాతం వరకు ఉంటుంది. ఈ బాస్ (BaaS) విధానంలో కారు కొనేటప్పుడు బ్యాటరీని కొనాల్సిన అవసరం లేదు. కేవలం కారు బాడీని కొని, బ్యాటరీని అద్దెకు వాడుకోవచ్చు. కిలోమీటరు వాడకం ఆధారంగా నెలవారీ అద్దె చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల ఈవీ కార్ల ధరలు నేరుగా పెట్రోల్ కార్ల ధరలతో సమానంగా తగ్గుతాయి. అయినప్పటికీ ప్రజలు దీనిని పెద్దగా ఇష్టపడటం లేదు. భారతదేశంలో బాస్ మార్కెట్ వాటా 5 శాతం కంటే తక్కువగా ఉందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. ఇదొక విజువలైజేషన్ టూల్ మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
మార్కెట్లో పోటీ, కంపెనీల స్పందన రియాక్షన్భారత్‌లో ఈ బాస్ కాన్సెప్ట్‌ను జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా మొదటగా 'విండ్సర్ ఈవీ' (Windsor EV) ద్వారా పరిచయం చేసింది. బ్యాటరీ లేకుండా దీని ధర రూ. 9.99 లక్షలు కాగా, బ్యాటరీతో కలిపి రూ. 13.5 లక్షలుగా ఉంది. ఈ వ్యూహం వల్ల 2025 నాటి ఈవీ సేల్స్‌లో విండ్సర్ 25 శాతం వాటాను సొంతం చేసుకుంది. దీనిని చూసి ఇతర కంపెనీలు కూడా ఈ ప్లాన్‌ను అమలు చేశాయి. మారుతి సుజుకి ఫిబ్రవరి 2026లో లాంచ్ చేసిన 'ఈ విటారా' (eVitara) ను బ్యాటరీ లేకుండా రూ. 10.99 లక్షలకు, బ్యాటరీతో కలిపి రూ. 15.99 లక్షలకు ఆఫర్ చేస్తోంది. టాటా మోటార్స్ కూడా తమ పాపులర్ 'పంచ్ ఈవీ' (Punch EV) బేస్ వేరియంట్‌ను బాస్ స్కీమ్ కింద రూ. 6.49 లక్షలకే అందుబాటులో ఉంచింది. సాధారణంగా దీని ధర రూ. 9.69 లక్షలుగా ఉంది.
ఫైనాన్స్ సాధనంగానే గుర్తింపుఆటోమొబైల్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు బాస్ విధానాన్ని ఒక సేవల కంటే కేవలం ఫైనాన్స్ సాధనంగానే చూస్తున్నారు. వినియోగదారులు ఇతర పెట్రోల్ కార్లతో పోల్చి చూసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని శైలేష్ చంద్ర పేర్కొన్నారు. ఎంజీ మోటార్స్ విషయానికి వస్తే, వారి మొత్తం ఈవీ అమ్మకాలలో 12 నుండి 15 శాతం వరకు ఈ బాస్ విధానం ద్వారానే జరుగుతున్నాయి. ఎంజీ కామెట్, విండ్సర్, జెడ్ఎస్ ఈవీ వంటి మోడళ్లలో దీనికి మంచి ఆదరణ లభిస్తోందని ఎంజీ ప్రతినిధి వినయ్ రైనా తెలిపారు. తక్కువ బడ్జెట్ ఉన్న వారికి ఇది మేలు చేస్తుంది.
భారత వినియోగదారులు నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఫీజుల కంటే పూర్తి ఓనర్ షిన్ ను (Full Ownership) కోరుకుంటున్నారు. ప్రారంభంలో ఎక్కువ డబ్బు చెల్లించడానికైనా సిద్ధపడుతున్నారు తప్ప, ప్రతి నెలా అద్దె కట్టేందుకు ఇష్టపడటం లేదు. రాబోయే రోజుల్లో కస్టమర్ల ఆలోచనా విధానంలో మార్పు వస్తే తప్ప బాస్ తన పట్టును నిరూపించుకోలేదు.
