Bajaj Pulsar 125 Neon Launch: బజాజ్ కంపెనీ, Pulsar 125 Neon వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. లాంచ్‌కు ముందే ఈ బైక్ కనిపించింది. బయటకు వచ్చిన ఫొటోలను బట్టి చూస్తే, పాత తరం పల్సర్ డిజైన్‌ను గుర్తు చేసేలా ఉంది. ముఖ్యంగా సింపుల్ లుక్, పాత మెకానికల్ సెటప్‌తో ఈ బైక్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. పల్సర్ 125 సిరీస్‌లో ఇది అత్యంత తక్కువ ధర వేరియంట్‌గా నిలిచే అవకాశం ఉంది.
ఈ ఏడాది ప్రారంభంలో బజాజ్ కొత్త తరం Pulsar 125ను లాంచ్ చేసింది. అందులో కొత్త ఛాసిస్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్‌తో పాటు పలు ఫీచర్లను జోడించింది. అయితే, ఆ మోడల్ ధర పాత Neon వేరియంట్‌తో పోలిస్తే ఎక్కువగా ఉండటంతో, తక్కువ బడ్జెట్లో పల్సర్ కొనాలనుకునే వారి కోసం Neonను మళ్లీ తీసుకురావాలని కంపెనీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
పాత పల్సర్ డిజైన్.. ట్విన్ షాక్ సస్పెన్షన్
తాజాగా కనిపించిన Pulsar 125 Neon డిజైన్ పాత Neon మోడల్‌ను పోలి ఉంది. కొత్త తరం Pulsar 125లో వెనుకవైపు మోనోషాక్ సస్పెన్షన్ ఉండగా, Neonలో రెండు రియర్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. అలాగే పాత తరం ఛాసిస్ సెటప్‌ను కొనసాగించినట్లు ఫొటోల్లో కనిపిస్తోంది.
ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుకవైపు డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. సింగిల్ పీస్ సీట్, సింపుల్ పిలియన్ గ్రాబ్ రైల్, పూర్తిగా కవర్ చేసిన చైన్ సెటప్ ఉన్నాయి. లైటింగ్ విషయానికి వస్తే సంప్రదాయ బల్బ్ ఇండికేటర్లు, పాత తరం Classic Pulsar మోడళ్లలో కనిపించిన LED టెయిల్ లైట్‌ను ఇందులో ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ బైక్ రెడ్ & బ్లూ అనే రెండు రంగుల్లో కనిపించింది.
ఇది కూడా చదవండి: రాయల్ ఎన్ఫీల్డ్ 500కి పోటీగా Honda CB500.. మూడు వేరియంట్లు, 501cc ఇంజిన్, 28hp పవర్
124.4cc ఇంజిన్ ఉండే అవకాశం
Pulsar 125 Neonలో పాత 124.4cc ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ 11.8hp పవర్, 10.8Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేయనున్నారు. అయితే ఈ ఇంజిన్ పవర్, టార్క్ వివరాలను బజాజ్ అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు.
పోలిక పరంగా చూస్తే.. న్యూ జనరేషన్ Classic Pulsar 125లో 124.58cc ఇంజిన్ ఉంది. ఇది 12.1hp పవర్, 11.4Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త Neon ధరను తక్కువగా ఉంచేందుకు, న్యూ జనరేషన్ మోడల్లో ఉన్న అనేక ఫీచర్లను కొత్త Neonలో ఇవ్వకపోవచ్చని అంచనా.
ఇది కూడా చదవండి: రూ.62,000 వరకు తక్కువకే Honda క్రూయిజర్ బైక్.. Rebel 500 ధర, ఇంజిన్, ఫీచర్లు, కలర్స్ వివరాలు
ధర తక్కువగా ఉండే అవకాశం
గతంలో Pulsar 125 Neon పల్సర్ 125 లైనప్‌లో ఎంట్రీ లెవల్ మోడల్‌గా ఉండేది. పాత తరం మెకానికల్ భాగాలు, సింపుల్ ఫీచర్లతో రావడం వల్ల కొత్త Classic Pulsar 125 కంటే దీని ధర తక్కువగా ఉండే అవకాశం ఉంది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న Classic Pulsar 125 వేరియంట్ల ధరలు రూ.91,716 నుంచి రూ.1.03 లక్షల వరకు ఉన్నాయి. ఇవి ఎక్స్‌షోరూమ్ ధరలు. న్యూ జెన్ మోడల్ ప్రారంభ ధర, పాత Neon కంటే ఎక్కువగా ఉండటంతో, ధరకు ప్రాధాన్యత ఇచ్చే కొనుగోలుదారులకు అది కొంత భారంగా మారి ఉండవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బజాజ్ Neon వేరియంట్‌ను తిరిగి తీసుకురావాలని భావిస్తున్నట్లు కథనం సూచిస్తోంది.
అయితే కొత్త Pulsar 125 Neon లాంచ్ తేదీ, అధికారిక ధర, పూర్తి ఫీచర్ల వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. లాంచ్ సమయంలో వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
