Bajaj Chetak C25 Review: బజాజ్‌ చేతక్‌ కుటుంబంలో తాజాగా చేరిన చేతక్‌ C25 కేవలం ఎంట్రీ లెవల్‌ మోడల్‌ మాత్రమే కాదు. పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ చిన్న సైజ్‌, తక్కువ బరువు, ఈజీ రైడింగ్‌ ఫీల్‌ ఇచ్చేలా డిజైన్‌ చేశారు. ముఖ్యంగా, సిటీల్లో డైరీ ప్రయాణాలు చేసే వారికి ఇది ఒక ప్రాక్టికల్‌ ఆప్షన్‌గా కనిపిస్తోంది.

Continues below advertisement

డిజైన్‌ & క్వాలిటీ

చేతక్‌ C25 కొత్త చాసిస్‌ మీద వచ్చినా, డిజైన్‌ చూస్తే వెంటనే ఇది చేతక్‌ అనే గుర్తింపును చూపిస్తుంది. ప్రతి ప్యానెల్‌ కొత్తగా డిజైన్‌ చేశారు. సైడ్‌, రియర్‌ భాగాల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ముందూ వెనకా LED లైటింగ్‌ ఇచ్చారు.రైడర్‌ ముందుగా కనిపించే రివర్స్‌ LCD డిస్‌ప్లే చాలా సింపుల్‌గా ఉంటుంది. బ్యాటరీ ఛార్జ్‌, రేంజ్‌, స్పీడ్‌, రైడింగ్‌ మోడ్‌ వంటి అవసరమైన సమాచారం స్పష్టంగా చూపిస్తుంది. ఎండలో కూడా డిస్‌ప్లే చదవడానికి ఇబ్బంది ఉండదు.

Continues below advertisement

ఈ స్కూటర్‌ ముందు భాగంలో రెండు ఓపెన్‌ స్టోరేజ్‌ క్యూబీలు, బ్యాగ్‌ హుక్‌ ఉన్నాయి. వీల్‌బేస్‌ తగ్గించడంతో అండర్‌సీట్‌ స్టోరేజ్‌ 25 లీటర్లకు పరిమితమైంది. అయినా కూడా ఒక పెద్ద ఫుల్‌ ఫేస్‌ హెల్మెట్‌ సులభంగా సరిపోతుంది. మొత్తం బిల్డ్‌ క్వాలిటీ బాగుంది, ధర తగ్గించారనే భావన రాదు.

పనితీరు & రిఫైన్‌మెంట్‌

చేతక్‌ C25లో కొత్త హబ్‌ మోటార్‌ ఉంది. ఇది 2.2kW పీక్‌ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. గరిష్ట వేగం 55 కిలోమీటర్లు. కాగితాల మీద చూసుకుంటే ఇది పెద్ద సంఖ్య కాదు. కానీ నగర ట్రాఫిక్‌లో మాత్రం స్కూటర్‌ చురుకుగా స్పందిస్తుంది.యాక్సిలరేటర్‌ ట్యూనింగ్‌ స్మూత్‌గా ఉంటుంది. తక్కువ శబ్దంతో నడుస్తుంది. ఫ్లైఓవర్లు ఎక్కేటప్పుడు కూడా ఇబ్బంది అనిపించదు.

బ్యాటరీ & రేంజ్‌

ఈ స్కూటర్‌లో 2.5kWh బ్యాటరీ ఇచ్చారు. కంపెనీ తెలిపిన IDC రేంజ్‌ 113 కిలోమీటర్లు. వాస్తవ వినియోగంలో దాదాపు 90 కిలోమీటర్ల వరకు రేంజ్‌ వచ్చే అవకాశం ఉంది. బ్యాటరీ 15 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు స్కూటర్‌ ఆటోమేటిక్‌గా ఎకో సెట్టింగ్‌కు మారుతుంది. 750 వాట్‌ పోర్టబుల్‌ ఛార్జర్‌తో 3 గంటల 45 నిమిషాల్లో పూర్తి ఛార్జ్‌ అవుతుంది. సీట్‌ కింద ఛార్జింగ్‌ పోర్ట్‌ ఉండటం సౌకర్యంగా ఉంటుంది.

కంఫర్ట్‌ & హ్యాండ్లింగ్‌

చేతక్‌ C25 బరువు కేవలం 108 కిలోలు మాత్రమే. ఇది మిగతా చేతక్‌ మోడళ్లతో పోలిస్తే 20 కిలోలకుపైగా తక్కువ. సీట్‌ ఎత్తు 763 మిల్లీమీటర్లు కావడంతో చిన్న ఎత్తు ఉన్న రైడర్లకు కూడా నమ్మకంగా అనిపిస్తుంది. రియర్‌ సస్పెన్షన్‌ బంప్స్‌ను బాగా గ్రహిస్తుంది. ముందు భాగం కొంచెం సాఫ్ట్‌గా అనిపించినా, నగర రోడ్లకు సరిపోతుంది. ముందు డిస్క్‌ బ్రేక్‌ ఇవ్వడం మంచి విషయం.

ధర & ఫీచర్లు

చేతక్‌ C25లో LED లైట్స్‌, రివర్స్‌ మోడ్‌, బూట్‌ ఓపెనింగ్‌, పార్కింగ్‌ లాక్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్లూటూత్‌, కాల్‌ కంట్రోల్‌, హిల్‌ హోల్డ్‌ వంటి ఫీచర్ల కోసం రూ.3,000 విలువైన టెక్‌ప్యాక్‌ ఆప్షన్‌ ఉంది. టెక్‌ప్యాక్‌తో కలిపి ఈ స్కూటర్‌ ధర రూ.94,399 (ఎక్స్‌-షోరూమ్‌ ధర). నడపడానికి సింపుల్‌గా ఉండి, నమ్మకమైన, తక్కువ ఖర్చుతో నగర ప్రయాణాలకు ఒక ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కావాలనుకునే వారికి చేతక్‌ C25 మంచి ఎంపికగా నిలుస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.