Summer Car Care | వేసవి కాలంలో కారులో కూర్చోగానే ఏసీ ఆన్ చేయడం ఒక సాధారణ అలవాటుగా మారిపోయింది. కానీ చాలా మంది సరైన పద్ధతిలో AC ఉపయోగించరు. దీనివల్ల కారుకు పెట్రోల్ ఎక్కువగా ఖర్చవుతుంది. కారు పనితీరుపై కూడా ఇది ప్రభావం పడుతుంది. మీరు కొన్ని సాధారణ విషయాలను గుర్తుంచుకుంటే, మీ కారు త్వరగా చల్లగా అవడంతో పాటు మీ పెట్రోల్ ఖర్చు కూడా తగ్గుతుంది.
కారును ముందుగా చల్లబరచాలి ?
ఒకవేళ మీ కారు ఎండలో పార్క్ చేసి ఉంటే, లోపల విపరీతమైన వేడి ఉంటుంది. అలాంటప్పుడు కారు స్టార్ట్ చేయగానే ఏసీని వేగంగా (high speed ) పెట్టి నడపడం సరైన పద్ధతి కాదు. ముందుగా మీరు కారు కిటికీలను తెరిచి, బ్లోవర్‌ను కొంత సమయం పాటు వేగంగా నడపాలి. దీనివల్ల లోపల ఉన్న వేడి గాలి త్వరగా బయటకు వెళ్లిపోతుంది. ఆ తర్వాత మీరు ఏసీ ఆన్ చేస్తే కూలింగ్ త్వరగా అవుతుంది. ఈ పద్ధతి ద్వారా ఏసీపై ఎక్కువ ప్రెజర్ పడదు. దాంతో మీ ఇంధనం పెట్రోల్ కూడా ఆదా అవుతుంది.
సరైన ఏసీ సెట్టింగ్ ద్వారా పెట్రోల్ ఆదా
ఏసీ ఉష్ణోగ్రతను (AC Temperature) ఎంత తక్కువగా ఉంచితే, అంత త్వరగా కారులో కూల్ అవుతుంది. మీ ఖర్చు తగ్గుతుందని చాలా మంది అనుకుంటారు.. అయితే అందులో నిజం లేదు. మీరు చాలా తక్కువ ఉష్ణోగ్రతను సెట్ చేస్తే, ఏసీ కంప్రెసర్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. దీనివల్ల పెట్రోల్ సాధారణం కంటే ఎక్కువగా ఖర్చవుతుంది. సరైన పద్ధతి ఏంటంటే, ఉష్ణోగ్రతను 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉంచితే కారు త్వరగా కూల్ అవుతుంది. దాంతో కార్ ఇంజన్‌పై ఎక్కువ ఒత్తిడి కూడా పడదు.
రీ-సర్క్యులేషన్ మోడ్ ఎలా వాడాలి..
రీ-సర్క్యులేషన్ మోడ్ కారులో వచ్చే వాటిలో చాలా ఉపయోగకరమైన ఫీచర్. కానీ డ్రైవర్లు, వాహనదారులు దీనిని నిర్లక్ష్యం చేస్తారు. మీరు ఈ మోడ్‌ను ఆన్ చేసినప్పుడు, కారు లోపల ఉన్న చల్లటి గాలి మళ్లీ మళ్లీ తిరుగుతూ ఉంటుంది. బయట ఉన్న వేడి గాలి కారు లోపలికి రాదు. దీనివల్ల ఏసీ తక్కువ ప్రెజర్, శ్రమతో పనిచేస్తుంది. కారు త్వరగా కూల్ అవుతుంది. ఈ పద్ధతి కారు మైలేజీని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
మీ ఖర్చును పెంచే చిన్న చిన్న తప్పులు
చాలా సార్లు ప్రజలు ఏసీ ఆన్ చేసిన తరువాత కిటికీలను కొద్దిగా తెరిచి ఉంచడం లేదా డోర్స్ సరిగ్గా వేయకపోవడం చేస్తుంటారు. దీనివల్ల చల్లటి గాలి వెంటనే బయటకు వెళ్లిపోతూ ఉంటుంది. ఏసీ ఎక్కువసేపు పనిచేయాల్సి వస్తుంది. ఎయిర్ ఫిల్టర్ మురికిగా ఉంటే కూడా కూలింగ్ తగ్గిపోతుంది. మీరు ఏసీని ఎక్కువసేపు రన్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల మీ పెట్రోల్ ఖర్చు పెరుగుతుంది. అందువల్ల ఎప్పటికప్పుడూ మీరు ఎయిర్ ఫిల్టర్‌ను చెక్ చేసి శుభ్రం చేయడం చాలా అవసరం. లేకపోతే కూలింగ్ కావడం ఏసీ టెంపరేచర్ తగ్గించడంతో పాటు ఎక్కువ సేపు రన్ చేస్తారు. ఇది ఎక్కువ పెట్రోల్ వినియోగానికి కారణం అవుతుంది.
