Car Price Hike In India: కొత్త ఏడాదిలో (2023లో) కొత్త కారు కొని, జాలీగా ఓ లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లాలని ప్లాన్‌ చేస్తున్నారా? సంతోషం. అయితే, ఇప్పుడు మీరు అనుకున్న మొత్తం కంటే కాస్త ఎక్కువ డబ్బును పోగు చేయండి. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రొడక్ట్స్ ధరలు పెంచుతామని Mercedes-Benz, Audi, Renault, Kia India, MG Motor కంపెనీలు ఇప్పటికే అనౌన్స్‌ చేశాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి అన్ని రేంజ్‌ల్లో వాహనాల ధరలను పెంచే ప్రణాళికలను ప్రకటించాయి. పెరిగిన వ్యయాల్ని భర్తీ చేసుకోవడానికి ఈ కంపెనీలన్నీ ప్రైస్‌ హైక్‌ ప్లాన్‌ చేశాయి.


కార్ల ధర ఎంత మేర పెరగవచ్చు?
ఆడి ఇండియా, అన్ని రేంజ్‌ల్లో 1.7 శాతం ప్రైస్‌ హైక్‌ ప్రకటించింది. మెర్సిడెస్-బెంజ్ ఇండియా జనవరి నుంచి 5 శాతం ధరల పెరుగుదలను ప్లాన్ చేసింది. మోడల్ అండ్‌ ట్రిమ్ ఆధారంగా ప్రైస్‌ హైక్‌ సైజ్‌ రూ. 50,000 వరకు ఉంటుందని కియా ఇండియా తెలిపింది. రెనాల్ట్ కూడా వచ్చే నెల నుంచి రేట్ల పెంపు ఆలోచనలో ఉంది. కానీ, రేటు ఎంత పెంచాలని భావిస్తోందో వెల్లడించలేదు. మోడల్స్, వేరియంట్ల బట్టి త్వరలో 2 నుంచి 3 శాతం మధ్య ధరలను పెంచాలని MG మోటార్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది.


లాభదాయకత, స్థిరత్వాన్ని అందించే వ్యాపార మార్గం మీద ఫోకస్‌ పెంచడం తమ బిజినెస్‌ స్ట్రాటెజీగా ఆడి తెలిపింది. పెరుగుతున్న సప్లై చైన్‌ సంబంధిత ఇన్‌పుట్ వ్యయాలు, నిర్వహణ ఖర్చుల ఫలితంగా ధరల సవరణ తప్పడం లేదన్నది ఈ కంపెనీ వాదన. ఆడి ఇండియా ప్రస్తుత లైనప్‌లో... పెట్రోల్‌ బండ్లు A4, A6, A8 L, Q3, Q5, Q7, Q8, S5 స్పోర్ట్‌బ్యాక్, RS 5 స్పోర్ట్‌బ్యాక్, RSQ8 ఉన్నాయి. e-Tron బ్రాండ్ క్రింద ఎలక్ట్రిక్ వెహికల్‌ (EV) పోర్ట్‌ఫోలియోలో e-Tron 50, e-Tron 55, e-Tron Sportback 55, e-Tron GT, RS e-Tron GT ఉన్నాయి.


ధరల పెరుగుదలకు కారణం ఏంటి?
ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కారణంగా వాహన పరిశ్రమను చాలా సమస్యలు చుట్టుముట్టాయి. కార్ల ఉత్పత్తిలో ఉపయోగించే మెటల్‌, వైర్ల రేట్లు విపరీతంగా పెరిగాయి. రవాణా వ్యయాలు కూడా పెరిగాయి. ఇన్‌పుట్ వ్యయాలు స్థిరంగా పెరగడం,  పెరిగిన లాజిస్టిక్స్ ఖర్చులతో కార్ల కంపెనీల ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఖర్చులు భారీగా పెరిగడంతో, ఆదాయంలో లాభాల వాటా తగ్గింది. వచ్చే నెల నుంచి కార్ల రేట్లు పెంచడం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని సంపాదించి, పెరిగిన ఖర్చులను భర్తీ చేసుకోవడానికి అన్ని ఆటో మేకర్లు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. కస్టమర్ల జేబు నుంచి తమ వాటా తాము లాక్కుని, గత లాభాల్లోకి తిరిగి చేరడమే కార్‌ మేకర్ల ప్రస్తుత లక్ష్యం. 


దీంతో, వచ్చే నెల నుంచి అన్ని ప్రముఖ కార్ల కంపెనీల అన్ని మోడల్‌ రేంజ్‌ల్లో ఎక్స్- షో రూమ్ ధర పెరగబోతోంది.


ధరల పెంపు మీద హ్యుందాయ్ మోటార్ ఇండియా, హోండా కార్స్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.