Ather scooters news: ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కంపెనీ ఏథర్ ఎనర్జీ... తన రిజ్టా (Ather Rizta) & 450 (Ather 450) సిరీస్ స్కూటర్లలో కీలక మార్పులు చేసింది. కొత్త బ్యాటరీ ప్యాక్‌లను పరిచయం చేయడంతో పాటు రిజ్టా మోడల్‌లో తొలిసారిగా LFP బ్యాటరీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా, బ్యాటరీ సామర్థ్యం తగ్గించినప్పటికీ రేంజ్‌లో ఎలాంటి తగ్గుదల లేకపోవడం శుభవార్తగా మారింది.

Continues below advertisement

ఇప్పటివరకు, ఏథర్ రిజ్టాను 2.9kWh & 3.7kWh సామర్థ్యం కలిగిన NMC బ్యాటరీ ప్యాక్‌లతో విక్రయించేది. ఇప్పుడు కంపెనీ వాటి స్థానంలో 2.7kWh & 3.5kWh బ్యాటరీ ప్యాక్‌లను తీసుకొచ్చింది. అయితే చిన్న బ్యాటరీతో అందే IDC రేంజ్ 123 కి.మీ.గా యథాతథంగా కొనసాగుతుండగా, పెద్ద బ్యాటరీ వెర్షన్ రేంజ్ 159 కి.మీ. నుంచి 161 కి.మీ.కు పెరిగింది. అంటే బ్యాటరీ సామర్థ్యం తగ్గినా మరింత సమర్థవంతమైన టెక్నాలజీతో అదనపు రేంజ్‌ను అందిస్తోంది.

ఈ అప్‌డేట్‌లో అత్యంత కీలకమైన మార్పు LFP బ్యాటరీ టెక్నాలజీ ప్రవేశపెట్టడమే. రిజ్టా చిన్న బ్యాటరీ వేరియంట్లలో ఇప్పుడు Lithium Ferrous Phosphate అంటే LFP బ్యాటరీలను కూడా ఉపయోగిస్తోంది. సాధారణంగా LFP బ్యాటరీల ఎనర్జీ డెన్సిటీ NMC బ్యాటరీలతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, బ్యాటరీ ఇంజినీరింగ్‌లో ఏథర్ చేసిన మెరుగుదలలతో చిన్న బ్యాటరీ నుంచే మెరుగైన పనితీరు & అదే స్థాయి రేంజ్‌ను అందించగలుగుతోంది.

Continues below advertisement

ఇది కూడా చదవండి: రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 లిమిటెడ్ ఎడిషన్ - ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 యూనిట్లే, ధర రూ.5.75 లక్షలే!

అయితే వినియోగదారులు NMC లేదా LFP బ్యాటరీని ఎంపిక చేసుకునే అవకాశం ఉండదు. కంపెనీ సరఫరా పరిస్థితులను బట్టి ఏ స్కూటర్‌లో ఏ బ్యాటరీ వస్తుందో నిర్ణయిస్తుంది. అందువల్ల ఒకే వేరియంట్‌లో కొన్నింటికి NMC బ్యాటరీ, మరికొన్నింటికి LFP బ్యాటరీ ఉండే అవకాశం ఉంది.

స్పోర్టీ 450 సిరీస్ విషయానికి వస్తే ఇందులో మాత్రం ఎలాంటి బ్యాటరీ కెమిస్ట్రీ మార్పు లేదు. 450S & 450X మోడళ్లలో NMC బ్యాటరీలనే కొనసాగిస్తోంది. అయితే పెద్ద బ్యాటరీ సామర్థ్యాన్ని 3.7kWh నుంచి 3.5kWhకు తగ్గించింది. అయినప్పటికీ IDC రేంజ్ 161 కి.మీ.గా అలాగే కొనసాగుతోంది. చిన్న 2.9kWh బ్యాటరీ ప్యాక్ కూడా యథాతథంగా కొనసాగుతోంది. ఇందులో 450Xకు 126 కి.మీ. & 450Sకు 122 కి.మీ. IDC రేంజ్‌లో ఎలాంటి మార్పు లేదు.

ఛార్జింగ్ విషయంలో కూడా ఏథర్ కీలక అప్‌డేట్ తీసుకొచ్చింది. పెద్ద బ్యాటరీ వేరియంట్లతో ఇప్పుడు కొత్త 900W పోర్టబుల్ ఛార్జర్‌ను అందిస్తోంది. ఇది గతంలో ఉన్న 700W ఛార్జర్‌కు ప్రత్యామ్నాయం. కొత్త ఛార్జర్‌తో బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి కేవలం 3 గంటల 12 నిమిషాలు మాత్రమే పడుతుందని కంపెనీ తెలిపింది. గత ఛార్జర్‌తో ఇదే ప్రక్రియకు 4 గంటల 30 నిమిషాలు పట్టేది. అంటే ఛార్జింగ్ సమయం గణనీయంగా తగ్గింది.

ఇది కూడా చదవండి: హీరో ఎక్స్‌ట్రీమ్ 250R లేదా KTM 250 డ్యూక్? ధర, పనితీరు, ఫీచర్లలో ఏ బండి బెస్ట్‌?

వారంటీ, పనితీరు, ఛార్జింగ్ సపోర్ట్ వంటి అంశాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. బ్యాటరీ పరిమాణం లేదా కెమిస్ట్రీ ఏదైనా అయినా అన్ని ఏథర్ స్కూటర్లకు ఒకే విధమైన బ్యాటరీ వారంటీ & పనితీరు లభిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.

ఈ అప్‌డేట్ తర్వాత ధరల్లో కూడా ఎలాంటి పెంపు లేదు. ఏథర్ రిజ్టా ఎక్స్‌షోరూమ్ ధర ప్రస్తుతం రూ.1.21 లక్షల నుంచి రూ.1.57 లక్షల మధ్య ఉంది. బీమా, వేరియంట్ & ఇతర ఛార్జీలను బట్టి ఆన్‌రోడ్ ధర రూ.1.31 లక్షల నుంచి రూ.1.70 లక్షల వరకు ఉంటుంది.

బ్యాటరీ టెక్నాలజీలో వస్తున్న అభివృద్ధిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ చిన్న బ్యాటరీతోనే అదే స్థాయి రేంజ్‌ను అందించడం ద్వారా ఏథర్ తయారీ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు సరఫరా సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశాన్ని పెంచుకుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.