Alpinestars Viper Air V4 Review: భారతదేశంలో బైక్ రైడింగ్ అంటే కేవలం వేగం మాత్రమే కాదు, వాతావరణం, భద్రత, కంఫర్ట్‌ అన్నీ కీలకం. ముఖ్యంగా వేసవిలో రైడింగ్ జాకెట్ ఎంచుకోవడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో, అంతర్జాతీయంగా పేరున్న బ్రాండ్ Alpinestars నుంచి వచ్చిన Viper Air V4 జాకెట్ భారత రైడర్లకు ఎంతవరకూ సరిపోతుందో అర్ధం చేసుకుందాం.

ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న Viper Air V3కి ఇది ప్రత్యామ్నాయం. రెండు సంవత్సరాల పాటు పాత మోడల్‌ను ఉపయోగించిన అనుభవంతో చూస్తే, Viper Air V4లో స్పష్టమైన మెరుగుదలలు కనిపిస్తున్నాయి. మొదటగా, జాకెట్ తయారీలో ఉపయోగించిన మెటీరియల్‌ను Alpinestars పూర్తిగా అప్‌గ్రేడ్‌ చేసింది. కొత్త మోడల్‌లో 600D డ్యూరబుల్ ఫాబ్రిక్ వాడారు. ఇది బలంగా ఉండటమే కాకుండా, దీర్ఘకాలం మన్నికగా ఉంటుందని అనిపిస్తుంది.

వెంటిలేషన్‌ చాలా బాగుందివెంటిలేషన్ విషయంలో ఈ జాకెట్ నిజంగా మెప్పిస్తుంది. సాధారణంగా గాలి ప్రవాహం ఉండని చోట్ల కూడా లేజర్‌తో కట్ చేసిన చిన్న రంధ్రాలు ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణ. చేతులు, సైడ్స్‌, ఛాతీ భాగంలో పెద్ద మెష్ ప్యానెల్స్ ఉండటం వల్ల గాలి ప్రవాహం చాలా బాగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని వేడి వాతావరంలో ఇది పెద్ద ప్లస్ పాయింట్‌.

ఫిట్ విషయానికి వస్తే, ముందుభాగం పొడవును కొద్దిగా తగ్గించారు. నిలబడినప్పుడు కొంచెం చిన్నగా అనిపించినా, బైక్‌పై కూర్చున్నప్పుడు పొట్ట దగ్గర ఫాబ్రిక్ ముడుచుకోకుండా ఉంటుంది. దీనివల్ల స్పోర్టీగా, ఫిట్‌గా కనిపిస్తుంది. అయితే, ఈ జాకెట్ ఫిట్ కొంచెం సన్నగా ఉంటుంది. కాస్త బరువు ఎక్కువగా ఉన్న రైడర్లు ఒక సైజ్ పెద్దదాన్ని ఎంచుకుంటే బాగుంటుంది.

పాత మోడల్‌లో స్లీవ్స్ చిన్నగా ఉన్నాయనే ఫిర్యాదు ఉండేది. Viper Air V4లో ఇది కొంతవరకూ మెరుగైంది. అయినా, పొడవైన రైడర్లకు ఇంకా కొంచెం ఎక్కువ పొడవు ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. జేబుల విషయంలో, జిప్ పుల్ ట్యాబ్స్ చిన్నగానే ఉన్నా, పాకెట్లు మాత్రం పెద్దగా మారాయి, గ్లోవ్స్ వేసుకున్నా ఉపయోగపడతాయి.

భద్రత విషయంలో కూడా నమ్మకంసేఫ్టీ విషయంలో కూడా ఈ జాకెట్ నమ్మకం కలిగిస్తుంది. ఇందులో CE లెవల్‌ 1 షోల్డర్‌, ఎల్బో ఆర్మర్ స్టాండర్డ్‌గా వస్తాయి. అయితే, బ్యాక్‌, ఛెస్ట్ ఆర్మర్ వేరుగా కొనాలి. ఈ విషయంలో భారతీయ బ్రాండ్లు కొంచెం మెరుగైన వాల్యూ ఇస్తున్నాయి. అయితే, కొత్తగా ఛెస్ట్ ఆర్మర్ కోసం ప్రత్యేక పాకెట్లు ఇవ్వడం పెద్ద అప్‌గ్రేడ్‌. వాష్ చేసే సమయంలో ఆర్మర్ తీయడం ఇప్పుడు చాలా సులభం.

జాకెట్‌తో పాటు రిమూవబుల్ విండ్ లైనర్, వాటర్‌ప్రూఫ్ ఇంటర్నల్ పాకెట్ కూడా ఉన్నాయి. నాలుగు కలర్ ఆప్షన్లలో లభించే ఈ జాకెట్, గత మోడళ్లతో పోలిస్తే మరింత స్పోర్టీ పొజిషనింగ్‌లో ఉంది.

ధర విషయానికి వస్తే, Alpinestars Viper Air V4 ధర రూ.27,600. ఇది ఖచ్చితంగా ప్రీమియం సెగ్మెంట్‌. అయితే, Dainese వంటి హైఎండ్ బ్రాండ్లతో పోలిస్తే ఇదీ అదే స్థాయిలో నిలుస్తుంది. దీర్ఘకాలం ఉపయోగించే రైడర్లకు, వేడి వాతావరణంలో కూడా కంఫర్ట్ కావాలనుకునేవారికి ఇది మంచి ఎంపికగా చెప్పొచ్చు.

మొత్తం మీద, వేసవిలో ఎక్కువ రైడింగ్ చేసే, ప్రీమియం సేఫ్టీ గేర్ కోరుకునే రైడర్లకు Alpinestars Viper Air V4 ఒక బలమైన ఆప్షన్. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.