2026 Car Price Hike India: ప్రతి ఏడాది మాదిరిగానే, నూతన సంవత్సరం ప్రారంభంతో 2026లో కార్ల ధరల పెంపు మళ్లీ చర్చకు వచ్చింది. జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వచ్చేలా దేశంలోని ప్రముఖ కార్ తయారీ కంపెనీలు ధరల పెంపును అధికారికంగా ప్రకటించాయి. ఇన్‌పుట్‌ ఖర్చులు పెరగడం, తయారీ వ్యయాలు, లాజిస్టిక్స్‌, కరెన్సీ మార్పిడుల ప్రభావం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి.

Continues below advertisement

ఈ ఏడాది GST 2.0 కారణంగా కార్ల ధరలు భారీగా తగ్గాయి. ఆ ప్రభావంతో ప్రజలకు పెద్ద ఊరట లభించింది. ఇప్పుడు, కొత్తగా ధరల పెంపు ఉన్నప్పటికీ, చాలా మోడళ్ల రేట్లు ఇంకా GST తగ్గింపుకు ముందున్న స్థాయికి చేరలేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

కార్ల ధరలు పెంచిన కంపెనీలు ఇవే

Continues below advertisement

MG Motor

జనవరి 1, 2026 నుంచి తన కార్ల ధరలను గరిష్టంగా 2 శాతం వరకు పెంచనుంది. పెట్రోల్‌, డీజిల్‌, ఎలక్ట్రిక్‌ మోడళ్లన్నింటిపైనా ఈ పెంపు వర్తిస్తుంది. MG Windsor EV ధర రూ.30,000 నుంచి రూ.37,000 వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో దీని ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.14.27 లక్షల నుంచి రూ.18.76 లక్షల మధ్య ఉండొచ్చు. Comet EV ధరలు కూడా రూ.10,000 నుంచి రూ.20,000 వరకు పెరిగి రూ.7.64 లక్షల నుంచి రూ.10.19 లక్షల ఎక్స్‌-షోరూమ్‌కు చేరే సూచనలున్నాయి.

Nissan

Nissan జనవరి 2026 నుంచి గరిష్టంగా 3 శాతం వరకు ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. త్వరలోనే Gravite కాంపాక్ట్‌ MPV విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల GST తగ్గింపుతో Nissan Magnite ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం దీని ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.5.62 లక్షల నుంచి రూ.10.76 లక్షల మధ్య ఉంది. కొత్త పెంపుతో ఇది రూ.17,000 నుంచి రూ.32,000 వరకు పెరిగి రూ.5.79 లక్షల నుంచి రూ.11.08 లక్షలకు చేరే అవకాశం ఉంది.

Honda

Honda కూడా జనవరి 2026 నుంచి ధరలు పెంచుతామని తెలిపింది. అయితే ఎంత శాతం పెరుగుతాయనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. పెరుగుతున్న ఇన్‌పుట్‌ ఖర్చులే ప్రధాన కారణమని Honda స్పష్టం చేసింది.

Renault

Renault కార్ల ధరలు కూడా జనవరి 1 నుంచి గరిష్టంగా 2 శాతం పెరుగుతాయి. Kwid, Triber, Kiger మోడళ్లపై ఈ పెంపు వర్తిస్తుంది. పెంపు తర్వాత Kwid ఎక్స్‌-షోరూమ్‌ ధర సుమారు రూ.4.38 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు, Triber రూ.5.88 లక్షల నుంచి రూ.8.55 లక్షల వరకు, Kiger రూ.5.88 లక్షల నుంచి రూ.10.54 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. వచ్చే ఏడాది Dusterతో పాటు కొత్త 7-సీటర్ SUVని ఈ కంపెనీ తీసుకురానుంది.

Mercedes-Benz

Mercedes-Benz జనవరి 1 నుంచి తన లగ్జరీ కార్ల ధరలను గరిష్టంగా 2 శాతం పెంచనుంది. యూరో-రూపాయి మార్పిడి రేట్లు, లాజిస్టిక్స్‌ ఖర్చులు పెరగడమే కారణమని కంపెనీ చెబుతోంది. GLS మోడల్‌పై ఈ పెంపు వల్ల రూ.2.64 లక్షల నుంచి రూ.2.68 లక్షల వరకు అదనంగా భారం పడుతుంది. అయితే GST తగ్గింపుతో వచ్చిన భారీ తగ్గింపుతో పోలిస్తే ఇది చాలా తక్కువేనని కంపెనీ పేర్కొంటోంది.

BMW

BMW ఇప్పటికే 2025 సెప్టెంబర్‌లో ధరలు పెంచింది. ఇప్పుడు మరోసారి జనవరి 2026 నుంచి ధరలు పెంచుతోంది. CKD, CBU మోడళ్లన్నింటిపైనా ఈ పెంపు వర్తిస్తుంది. 3 Seriesపై సుమారు రూ.1.81 లక్షల నుంచి రూ.1.85 లక్షల వరకు పెరుగుతుందని అంచనా.

BYD

BYD కూడా Sealion 7 మోడల్ ధరలను జనవరి 1 నుంచి పెంచనుంది. డిసెంబర్ 31 లోపు బుకింగ్‌ చేసుకున్న వారికి ప్రస్తుతం ఉన్న ధరలే వర్తిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.

మొత్తంగా చూస్తే, 2026 ప్రారంభం నుంచి కార్ల ధరలు పెరుగుతున్నప్పటికీ, GST తగ్గింపుతో వచ్చిన ప్రయోజనం పూర్తిగా తగ్గుతున్నట్లు కనిపించడం లేదు. కొత్త ఏడాదిలో కార్ కొనుగోలు ప్లాన్‌ చేస్తున్న వారికి ఇది ముఖ్యమైన సమాచారం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.