ADAS Technology Details: భవిష్యత్తులో పూర్తిగా అటానమస్ (స్వతంత్రంగా వ్యవహరించే) కార్లు వస్తాయని ఎన్నో ఏళ్ల నుంచి చెబుతున్నారు. అయితే ఆ టెక్నాలజీ ఒక్కసారిగా కొత్తగా వచ్చేది కాదు. మనం ప్రస్తుతం చూస్తున్న ADAS (Advanced Driver Assistance Systems) నుంచే అది క్రమంగా అభివృద్ధి చెందుతుంది. నిజానికి, యూకేలో దశాబ్దం క్రితమే Euro NCAP నుంచి 5 స్టార్ రేటింగ్ పొందాలంటే ఆటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ తప్పనిసరి అయ్యింది. అప్పటి నుంచి, ప్రపంచవ్యాప్తంగా ADAS టెక్నాలజీ వేగంగా ముందుకు వెళ్లింది.
సాధారణంగా, ఇక్కడ కొన్ని పెద్ద ప్రశ్న తలెత్తుతుంటాయి. పరీక్షల కోసం వేలాది కార్లను ధ్వంసం చేయడం అవసరమా? కేవలం కంప్యూటర్ సిమ్యులేషన్లతో టెస్ట్ చేస్తే సరిపోదా?. ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా... Soft Car 360 అనే స్మార్ట్ ఐడియా రంగంలోకి వచ్చింది.
సాఫ్ట్ కార్ 360 అంటే ఏమిటి?
AB Dynamics, Dynamic Research Inc (DRI) కలిసి అభివృద్ధి చేసిన Soft Car 360 అనేది ADAS టెస్టింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్ టార్గెట్ వెహికల్. ఇది బయటకు హ్యాచ్‌బ్యాక్ కార్‌లా కనిపించినా, లోపల మాత్రం తేలికపాటి ప్యానెల్స్‌తో తయారవుతుంది. Euro NCAP కూడా దీనిని అధికారిక Global Target Vehicle గా గుర్తించింది.
ఈ Soft Car ప్రత్యేకత ఏమిటంటే, ప్రమాదం జరిగిన వెంటనే ఇది చిన్న చిన్న తేలికపాటి భాగాలుగా విడిపోయి, టెస్ట్ చేస్తున్న అసలు కారుకు నష్టం కలగకుండా చేస్తుంది. అంటే, అసలు కారుకు డామేజ్ కాకుండానే టెస్ట్ పూర్తి చేయవచ్చు. ఎనిమిది నిమిషాల్లోనే మళ్లీ అసెంబుల్ చేయగలిగేలా Soft Car ను డిజైన్ చేశారు.
కదిలే టార్గెట్ కూడా
Soft Carను కేవలం నిలబడి ఉండే టార్గెట్‌గా మాత్రమే కాదు... GST Platform అనే బ్యాటరీతో నడిచే ప్లేట్‌పై అమర్చి కదిలే టార్గెట్‌గా కూడా ఉపయోగిస్తారు. ఇదే ప్లాట్‌ఫామ్‌ను పాదచారులు, సైక్లిస్టుల డమ్మీలకు కూడా వాడుతారు.
ఈ ప్లాట్‌ఫామ్‌ను రిమోట్ కంట్రోల్‌తోనూ, ముందుగా ప్రోగ్రామ్ చేసిన ‘పాత్ ఫాలోయింగ్’ అల్గోరిథమ్‌తోనూ నడిపించవచ్చు. లేన్ మార్పు నుంచి, క్లిష్టమైన కార్నరింగ్ వరకు & సిల్వర్‌స్టోన్ సర్క్యూట్ మొత్తం ఒక ల్యాప్ తిరిగే స్థాయిలో కూడా ఇది పని చేస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంత తేలికపాటి నిర్మాణం ఉన్నప్పటికీ Soft Car గంటకు 120 కిలోమీటర్ల వేగం వరకు వెళ్లగలదు.
కొత్తగా వచ్చిన యాక్టివ్ టెయిల్ లైట్స్
ఇప్పటి ADAS సిస్టమ్‌లు కేవలం రాడార్‌పైనే ఆధారపడడం లేదు. బ్రేక్ లైట్స్, ఇండికేటర్ల వంటి విజువల్ సిగ్నల్స్ కూడా కీలకం అయ్యాయి. అందుకే Soft Carలో తాజాగా యాక్టివ్ టెయిల్ లైట్ సిస్టమ్‌ను యాడ్ చేశారు. ఈ లైట్లను ఫ్లెక్సిబుల్ LEDలతో తయారు చేశారు. వీటికి ప్రత్యేక బ్యాటరీ ఉంటుంది. రిమోట్ ద్వారా మాన్యువల్‌గా ఆపరేట్ చేయవచ్చు, లేదా టార్గెట్ కదలికలకు సింక్ అయ్యేలా ఆటోమేటిక్‌గా పని చేస్తాయి. అవసరమైతే ప్రత్యేక లైటింగ్ సీక్వెన్స్‌లను కూడా ప్రోగ్రామ్ చేయొచ్చు.
భద్రతే మొదటి ప్రాధాన్యం
Soft Carను కొత్త టెయిల్ లైట్స్‌తో కలిపి 62mph వేగంతో ఎన్నిసార్లు ఢీకొట్టినా, Soft Carకు లేదా టెస్ట్ వాహనానికి ఎలాంటి నష్టం జరగలేదని తయారీదారులు చెబుతున్నారు. ఒక రోజు మొత్తం టెస్టింగ్‌కు బ్యాటరీ సరిపోతుంది, అవసరమైతే వెంటనే మార్చుకునే అవకాశం కూడా ఉంది.
ADAS టెక్నాలజీ అభివృద్ధిలో Soft Car లాంటి స్మార్ట్ పరిష్కారాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. నిజంగా కార్లను ధ్వంసం చేయకుండా/ కల్పిత ప్రమాదాలకు గురి చేయకుండా, ఖర్చు తగ్గిస్తూ, భద్రతను పెంచే ఈ విధానం భవిష్యత్తు అటానమస్ కార్లకు బలమైన పునాదిగా మారుతుందని ఆటో ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.