Upcoming Honda Cars India 2026: భారీ పోటీతో కుదుపులకు గురవుతున్న గ్లోబల్‌ ఆటో మార్కెట్‌లో కొత్త ఊపిరి పోసుకునేందుకు, Honda, ఇప్పుడు ఇండియాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ దశాబ్దంలో మొత్తం 10 కొత్త మోడళ్లను విడుదల చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఈ ఏడాదిలోనే నాలుగు కొత్త కార్లను మన మార్కెట్‌లోకి తీసుకురావడానికి రెడీ అవుతోంది.

ఈ నాలుగు మోడళ్ల ధరలు సుమారు ₹12 లక్షల నుంచి (ఎక్స్‌-షోరూమ్‌ ధర) మొదలై, టాప్‌ ఎండ్‌లో ₹75 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌ ధర) వరకు ఉండే అవకాశం ఉంది. అంటే, బడ్జెట్‌ కార్‌ నుంచి ప్రీమియం కార్‌ వరకు ప్లాన్‌ చేస్తోంది. స్పోర్ట్స్‌ కూపే నుంచి ప్రీమియం హైబ్రిడ్‌ SUV వరకు విభిన్న సెగ్మెంట్లను Honda టార్గెట్‌ చేస్తోంది.

ఈ ఏడాది హోండా నుంచి రానున్న 4 కొత్త కార్లు

1. Honda Prelude - స్టైల్‌కి ప్రాధాన్యం

Honda Prelude ఒక కాంపాక్ట్‌ స్పోర్ట్స్‌ కూపే. ఇండియాలో ఇది BMW 2 Series Coupeకు ప్రత్యక్ష పోటీగా నిలుస్తుంది. అయితే, BMWలాగా అగ్రెసివ్‌ పెర్ఫార్మెన్స్‌ కంటే, Prelude ఎక్కువగా స్టైల్‌, కంఫర్ట్‌పై ఫోకస్‌ పెట్టింది.

ఈ కారులో 2.0 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 104 kW (139 hp) పవర్‌, 182 Nm టార్క్‌ ఇస్తుంది. దీనికి తోడుగా ఎలక్ట్రిక్‌ మోటార్‌ కూడా ఉంటుంది. అది 135 kW (181 hp) శక్తి, 315 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ హైబ్రిడ్‌ సెటప్‌తో WLTC ప్రమాణాల ప్రకారం 23.6 కి.మీ./లీటర్‌ మైలేజ్‌ సాధ్యం అవుతుంది.

Preludeను Honda జపాన్‌ నుంచి 'పూర్తిగా నిర్మించిన యూనిట్‌' (CBU)గా దిగుమతి చేస్తుంది. అందువల్ల దీని ధర సుమారు ₹75 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర) ఉండే అవకాశం ఉంది.

2. కొత్త Honda Elevate - ఫేస్‌లిఫ్ట్‌తో రీఎంట్రీ

2023లో వచ్చిన Honda Elevate, అప్పట్లోనే, ప్రత్యర్థులతో పోలిస్తే కొంత వెనుకబడింది. ఇప్పుడు టాటా సియెర్రా, కొత్త కియా సెల్టోస్‌, కొత్త రెనాల్ట్‌ డస్టర్‌, నిస్సాన్‌ టెక్‌టాన్‌, స్కోడా కుషాక్‌, VW టైగన్‌ వంటి మోడళ్లతో పోటీ మరింత తీవ్రమవుతోంది.

దీన్ని ఎదుర్కొనేందుకు Honda ఈ ఏడాది రెండో అర్ధభాగంలో Elevate ఫేస్‌లిఫ్ట్‌ను తీసుకురానుంది. ఇందులో కొత్త బంపర్లు, కొత్త గ్రిల్‌, హెడ్‌ల్యాంప్స్‌, టెయిల్‌ల్యాంప్స్‌ గ్రాఫిక్స్‌, కొత్త 17 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ వచ్చే అవకాశం ఉంది.అంతేకాదు, పానోరమిక్‌ సన్‌రూఫ్‌, 360 డిగ్రీ కెమెరా, డ్రైవర్‌ సీటుకు ఎలక్ట్రిక్‌ అడ్జస్ట్‌మెంట్‌తో వెంటిలేటెడ్‌ సీట్లు వంటి ఫీచర్లు కూడా జోడించే అవకాశం కనిపిస్తోంది. ఇంజిన్‌, గేర్‌బాక్స్‌లో మాత్రం మార్పులు ఉండవు.

3. కొత్త Honda City - రెండో ఫేస్‌లిఫ్ట్‌

నెక్ట్స్‌ జనరేషన్‌ Honda Cityని ఇండియాలోకి తీసుకురావడానికి ఇంకా సమయం ఉంది. అది 2028 మధ్య నాటికి మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతవరకు ప్రస్తుత మోడల్‌ను పోటీలో నిలబెట్టేందుకు Honda రెండో ఫేస్‌లిఫ్ట్‌ను ఈ ఏడాది లాంచ్‌ చేయనుంది.

బయట కొత్త గ్రిల్‌, కొత్త 16 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌, కొత్త కలర్‌ ఆప్షన్లు వచ్చే అవకాశం ఉంది. లోపల కొత్త అప్హోల్స్టరీ, ట్రిమ్‌ మార్పులతో సరిపెడతారు. ఇంజిన్‌, ట్రాన్స్‌మిషన్‌ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు.

4. Honda ZR-V - ప్రీమియం హైబ్రిడ్‌ SUV

Honda ZR-V ఒక గ్లోబల్‌ C-సెగ్మెంట్‌ SUV. ఇది Honda CR-V కంటే కింద స్థానంలో ఉంటుంది. దీని పొడవు 4,570 మి.మీ., వెడల్పు 1,840 మి.మీ., ఎత్తు 1,620 మి.మీ. కాగా, వీల్‌బేస్‌ 2,655 మి.మీ. ఉంటుంది.

ఇండియాలో ఈ SUVను హైబ్రిడ్‌ వేరియంట్‌లో మాత్రమే Honda తీసుకురానుంది. Preludeలో ఉన్న అదే హైబ్రిడ్‌ పవర్‌ట్రైన్‌ ఇందులో కూడా ఉపయోగిస్తారు. SUV కావడంతో మైలేజ్‌ కొద్దిగా తక్కువగా, WLTC ప్రకారం 22.1 కి.మీ./లీటర్‌ వరకు ఉంటుంది.

ZR-Vను కూడా జపాన్‌ నుంచి CBUగా దిగుమతి చేస్తారు. అందువల్ల దీని ధర సుమారు ₹50 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర) ఉండే అవకాశం ఉంది.

మొత్తం మీద, ఈ నాలుగు కార్లతో Honda ఇండియన్‌ మార్కెట్‌లో తన ఉనికిని మరింత బలపరుచుకోవాలని చూస్తోంది. ఫేస్‌లిఫ్ట్‌ మోడళ్లతో వాల్యూమ్‌ పెంచడం, Prelude, ZR-V లాంటి ప్రీమియం మోడళ్లతో బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచడం కంపెనీ వ్యూహంగా కనిపిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.