2026 Yezdi Scrambler Launched in India at Rs 1.99 Lakh: ఇండియ‌న్ మోటార్ సైకిల్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న యెజ్డీ (Yezdi), తాజాగా 2026 మోడల్ స్క్రాంబ్లర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. క్లాసిక్ లెజెండ్స్ యాజమాన్యంలోని ఈ బ్రాండ్, సరికొత్త ఫీచర్లు, ఆధునిక టెక్నాలజీతో ఈ బైక్‌ను రూపొందించింది. దీని ప్రారంభ ధరను రూ. 1.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్) గా నిర్ణయించారు. పాత కాలపు రెట్రో స్టైల్‌ను నేటి తరం హార్డ్‌వేర్‌తో మేళవించి తయారు చేసిన ఈ బైక్, అటు సిటీ ప్రయాణాలకు, ఇటు లైట్ ఆఫ్-రోడ్ అడ్వెంచర్లకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.

Continues below advertisement

డిజైన్ విశేషాలు..2026 యెజ్డీ స్క్రాంబ్లర్ చూడటానికి చాలా పవర్‌ఫుల్ గా, రగ్డ్ లుక్ తో కనిపిస్తుంది. దీని సిగ్నేచర్ ఫ్యూయల్ ట్యాంక్ పై బ్రాండ్ లెగసీని గుర్తు చేస్తూ '69' నంబర్ వివరాలు ఉన్నాయి. ర్యాలీ స్టైల్ లో ఉండే బీక్ (Beak), ముందు వెనుక ష్రౌడ్స్, వెనుక ఫెండర్ పై అమర్చిన టెయిల్ ల్యాంప్ ఈ బైక్ కు ఒక యూనిక్ ఐడెంటిటీని ఇస్తున్నాయి. ఇవే కాకుండా రిబ్బెడ్ సీటు, నిటారుగా కూర్చునేలా ఉండే సీటింగ్ పోశ్చర్, సెమీ-నాబీ టైర్లు దీని డ్యూయల్ పర్పస్ స్వభావాన్ని తెలియజేస్తున్నాయి. మొత్తం నాలుగు రకాల కలర్ ఆప్షన్లలో లభించే ఈ బైక్ రెట్రో-మోడర్న్ స్టైలింగ్ తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

ఇంజిన్ - పర్ఫార్మెన్స్..ఈ కొత్త స్క్రాంబ్లర్ లో సరికొత్తగా అభివృద్ధి చేసిన 334cc, లిక్విడ్-కూల్డ్, 4-వాల్వ్ DOHC 'కటార్' (KATAR) ఇంజిన్‌ను వాడారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 30 hp పవర్, 30 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల సిటీ ట్రాఫిక్ లోనే కాకుండా ఆఫ్-రోడ్ ట్రాక్ లపై కూడా బైక్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈ బైక్ లీటరుకు సుమారు 30 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. తన సెగ్మెంట్ లోనే అత్యంత తేలికైన బైక్ కావడంతో, దీన్ని హ్యాండిల్ చేయడం చాలా సులభంగా ఉంటుంది.

Continues below advertisement

హార్డ్‌వేర్ - ఫీచ‌ర్లు..టెక్నికల్ అంశాల పరంగా చూస్తే, కొత్త యెజ్డీ స్క్రాంబ్లర్ లో ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. దీని వీల్ బేస్ 1,403 మిమీ కాగా, సీటు ఎత్తు 813 మిమీగా ఉంది. 174 కిలోల బరువు ఉండటం వల్ల రైడర్లు దీన్ని కంట్రోల్ చేయడం ఈజీ అవుతుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే ముందు వైపు 320 మిమీ డిస్క్, వెనుక వైపు 240 మిమీ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. 12.5 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉండటం వల్ల సిటీ రైడ్స్ తో పాటు లాంగ్ వీకెండ్ ట్రిప్స్ కు కూడా ఇది పక్కాగా సరిపోతుంది. ముందు 19 అంగుళాల టైర్, వెనుక 17 అంగుళాల టైర్ ఉండటం వల్ల రోడ్డుపై గ్రిప్ చాలా బాగుంటుంది.

వేరియంట్లు - ధరల వివరాలు..2026 యెజ్డీ స్క్రాంబ్లర్ మొత్తం నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది. లెగసీ బ్లాక్, ఓజీ ఎల్లో, రోగ్ రెడ్, ర్యాలీ బ్లూ రంగుల్లో ఈ బైక్ ను ఎంచుకోవచ్చు. ఎంచుకున్న కలర్ వేరియంట్ ను బట్టి దీని ధర రూ. 1.99 లక్షల నుండి రూ. 2.09 లక్షల (ఎక్స్‌షోరూమ్) వరకు ఉంటుంది. ఆఫ్-రోడ్ రైడింగ్ ఇష్టపడే యువతకు తక్కువ ధరలో లభించే అత్యుత్తమ స్క్రాంబ్లర్ బైక్ గా ఇది నిలుస్తోంది. బిఎస్ఏ స్క్రాంబ్లర్ 650 వంటి పెద్ద బైక్ లతో పోటీ పడుతూ, తనదైన ముద్ర వేయడానికి యెజ్డీ సిద్ధమైంది.