2026 Renault Duster Price And Features: భారత మార్కెట్‌లో రెనాల్ట్‌ మళ్లీ బలమైన పునాది వేసేందుకు సిద్ధమైంది, తన మూడో తరం అవతార్‌లో ఇండియాలోకి తిరిగి వచ్చింది. మొదట, 2012లో వచ్చిన డస్టర్, మన దేశంలోని మిడ్‌ సైజ్‌ SUV విభాగానికి ఒక బెంచ్‌మార్క్‌లా నిలిచింది.  ఇప్పుడు ఈ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా & మారుతి సుజుకి గ్రాండ్ విటారా వంటి మోడళ్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. 2026 డస్టర్‌ వెర్షన్‌తో, కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందాలని రెనాల్ట్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఆధునిక డిజైన్, ఫీచర్-రిచ్ క్యాబిన్, రెండు టర్బో-పెట్రోల్స్ & బలమైన-హైబ్రిడ్ ఇంజిన్‌తో పవర్‌ట్రెయిన్ లైనప్‌ను అందిస్తోంది.

Continues below advertisement

2026 రెనాల్ట్‌ డస్టర్‌ ప్రి-బుకింగ్‌ ప్రారంభమైంది, ఇందుకోసం రూ. 21,000 చెల్లించాలి. ఈ కారు ధరలు మార్చిలో వెల్లడవుతాయి.

టర్బో-పెట్రోల్ డెలివరీలు ఏప్రిల్‌లో ప్రారంభమవుతాయి

Continues below advertisement

దీపావళి నాటికి స్ట్రాంగ్‌-హైబ్రిడ్ వెర్షన్‌ అందుబాటులోకి వస్తుంది

రెనాల్ట్‌ అధికారికంగా నిర్ధారించిన ప్రకారం, 2026 డస్టర్‌ స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ వేరియంట్‌ డెలివరీలు దీపావళికి ముందే ప్రారంభమవుతాయి. ఈ హైబ్రిడ్‌ టెక్నాలజీకి ‘E Tech’ అనే పేరు పెట్టింది రెనాల్ట్‌. ఫార్ములా 1 అనుభవాన్ని ఆధారంగా తీసుకుని ఈ సిస్టమ్‌ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ చెబుతోంది. స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ టెక్నాలజీతో మారుతి గ్రాండ్‌ విటారా, టయోటా హైరైడర్‌, మారుతి విక్టోరిస్‌ వంటి మోడళ్లకు కొత్త రెనాల్ట్‌ పోటీ ఇవ్వనుంది.

స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ ఇంజిన్‌ వివరాలు

డస్టర్‌లో ఉపయోగిస్తున్న స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ సిస్టమ్‌.... 1,789cc 4 సిలిండర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్‌ మోటార్లను కలిపి పని చేస్తుంది. ఇందులో ఒక 20hp మోటార్‌ జనరేటర్‌గా పని చేస్తే, మరో 49hp మోటార్‌ నేరుగా చక్రాలకు శక్తిని అందిస్తుంది. ఈ మొత్తం సిస్టమ్‌ మొత్తం కలిపి 160hp శక్తి, 172Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 1.4kWh బ్యాటరీ ప్యాక్‌ సపోర్ట్‌గా ఉంటుంది.

ఈ ఇంజిన్‌కు HR18 అనే కోడ్‌ నేమ్‌ ఉంది. ఇది రెనాల్ట్‌ & గీలీ కలిసి నడిపే Horse Powertrain సంస్థ అభివృద్ధి చేసిన యూనిట్‌. ఈ సంస్థకు ఇంజిన్‌లు, హైబ్రిడ్‌ సిస్టమ్‌లు, ట్రాన్స్‌మిషన్‌ల రూపకల్పనలో నైపుణ్యం ఉంది.

టయోటా హైబ్రిడ్‌తో పోలిక

టయోటా హైరైడర్‌, గ్రాండ్‌ విటారా, విక్టోరిస్‌లో ఉన్న హైబ్రిడ్‌ సిస్టమ్‌తో పోలిస్తే, రెనాల్ట్‌ E Tech విధానం పూర్తిగా భిన్నంగా పనిచేస్తుంది. టయోటా e-CVT ట్రాన్స్‌మిషన్‌ను ఉపయోగిస్తే, రెనాల్ట్‌ మాత్రం మల్టీ మోడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను అందిస్తుంది. ఇందులో ఫిక్స్‌డ్‌ గేర్‌ రేషియోలు ఉంటాయి. దాంతో డ్రైవింగ్‌ సమయంలో ఇంజిన్‌ rpm పెరగడం, తగ్గడం సాధారణ ఆటోమేటిక్‌ కార్‌లా అనిపిస్తుంది. ఎలక్ట్రిక్‌ డ్రైవ్‌, ఇంజిన్‌ డ్రైవ్‌ లేదా రెండూ కలిసి పనిచేసే సందర్భాల్లో గేర్‌ మార్పులు డ్రైవర్‌కు స్పష్టంగా అనిపించే అవకాశం ఉంటుంది.

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, డస్టర్‌ హైబ్రిడ్‌లో ఉన్న 1.4kWh బ్యాటరీ టయోటా హైబ్రిడ్‌లోని 0.76kWh బ్యాటరీతో పోలిస్తే పెద్దది. దీనివల్ల, సిటీ డ్రైవ్‌లో ఎక్కువసేపు ఎలక్ట్రిక్‌ మోడ్‌లో నడిపే అవకాశం ఉంటుంది. రెనాల్ట్‌ చెప్పిన ప్రకారం, నగర ప్రయాణాల్లో దాదాపు 80 శాతం వరకు EV మోడ్‌లో డ్రైవ్‌ చేయొచ్చు.

ఇతర ఇంజిన్‌ ఆప్షన్లు

డీజిల్‌ ఇంజిన్‌ లేకపోవడం వల్ల వచ్చే లోటును స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ చాలా వరకు భర్తీ చేస్తుంది. అయితే హైబ్రిడ్‌ ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో, రెనాల్ట్‌ సాధారణ టర్బో పెట్రోల్‌ ఆప్షన్లను కూడా అందిస్తుంది.

మొదటి ఆప్షన్‌ నిస్సాన్‌ మ్యాగ్నైట్‌లో ఇప్పటికే ఉన్న 1.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌. ఇది 100PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ ఇస్తారు. రెండోది 1.3 లీటర్‌ నాలుగు సిలిండర్ల టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌. ఇది 163PS శక్తి, 280Nm టార్క్‌ను ఇస్తుంది. టార్క్‌ పరంగా ఇది హైబ్రిడ్‌ కంటే మరింత శక్తిమంతమైనది. ఈ ఇంజిన్‌కు 6 స్పీడ్‌ DCT గేర్‌బాక్స్‌ జత చేస్తారు.

మొత్తంగా చూస్తే, 2026 Renault Duster స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌, టర్బో పెట్రోల్‌ ఆప్షన్లతో భారత మార్కెట్‌లో రెనాల్ట్‌కు నిజమైన కమ్‌బ్యాక్‌ కారుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మైలేజ్‌, డ్రైవింగ్‌ అనుభవం, ధరలపై అధికారిక వివరాలు బయటకు వస్తే, మిడ్‌ సైజ్‌ SUV సెగ్మెంట్‌లో పోటీ మరింత ఆసక్తికరంగా మారడం ఖాయం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.