New Renault Duster Launch: ఇండియన్ ఆటోమొబైల్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఒకప్పుడు దేశీయ రోడ్లపై సంచలనం సృష్టించిన రేనాల్ట్ డస్టర్, మంగళవారం సరికొత్త హంగులతో మళ్ళీ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. మూడవ తరం గ్లోబల్ మోడల్ ఆధారంగా రూపొందిన ఈ ఎస్‌యూవీని భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అనేక మార్పులతో తీర్చిదిద్దారు.
సూపర్బ్ లుక్..
కొత్త డస్టర్ పాత మోడల్ కంటే మరింత ధృడంగా కనిపిస్తుంది. ముందు భాగంలో ఐబ్రో-స్టైల్ ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉన్నాయి. ఇవి టర్న్ ఇండికేటర్లుగా కూడా పనిచేస్తాయి. రీడిజైన్ చేసిన గ్రిల్ పై 'డస్టర్' అక్షరాలను స్పష్టంగా ప్రింట్ చేశారు. సిల్వర్ యాక్సెంట్లతో కూడిన బంపర్, పిక్సెల్-స్టైల్ ఫాగ్ లాంప్స్ దీనికి మోడర్న్ లుక్ ఇస్తాయి. వెనుక వైపు డిజైన్ కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.
లగ్జరీ ఇంటీరియర్
కారు లోపలి భాగంలో డ్యూయల్-స్క్రీన్ డాష్‌బోర్డ్ లేఅవుట్, పియానో బ్లాక్ ఫినిషింగ్ ఉన్న త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ క్యాబిన్‌కు ప్రీమియం లుక్ ఇస్తాయి. సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్స్ వంటి ఫీచర్లు టాప్ నాచ్ గా ఉన్నాయని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి.
టెక్నాలజీ, సెక్యూరిటీ
టెక్నాలజీ పరంగా ఇందులో 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేను సపోర్ట్ చేస్తుంది. గూగుల్ ఓఎస్ ఆధారిత 7 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డ్రైవర్‌కు కావాల్సిన సమాచారాన్ని అందిస్తుంది. సెక్యూరిటీ కోసం ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, లెవల్-2 అడాస్ (ADAS) వంటి అత్యున్నత ప్రమాణాలను చేర్చారు. 6-వే పవర్డ్ వెంటిలేటెడ్ సీట్లు సౌకర్యాన్ని పెంచుతాయి. రేనాల్ట్ ఈసారి మూడు రకాల ఇంజిన్లను పరిచయం చేస్తోంది.
టాప్ వేరియంట్లలో 1.8 లీటర్ ఈ-టెక్ హైబ్రిడ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 160 బీహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 160 బీహెచ్‌పి పవర్, 280 ఎన్ఎమ్ టార్క్‌ను ఇస్తుంది. బేస్ మోడల్ కోసం 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కేటాయించారు. ఇది 100 బీహెచ్‌పి శక్తిని ఇస్తూ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పనిచేస్తుంది. కొత్త డస్టర్ కావాలనుకునే వారు రూ. 21,000 టోకెన్ అమౌంట్‌తో బుక్ చేసుకోవచ్చు. టర్బో పెట్రోల్ వేరియంట్లు ముందుగా అందుబాటులోకి రానున్నాయి. హైబ్రిడ్ వెర్షన్లు దీపావళి పండుగ నాటికి రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది.
