2026 Maruti Brezza Safety Rating: దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కొత్త 2026 బ్రెజ్జా, లాంచ్ సందర్భంగా ఒక భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. కాంపాక్ట్ SUV విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ మోడల్, భారత్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో పెద్దలు & చిన్నారుల భద్రత విభాగాల్లో అత్యున్నతమైన 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. లాంచ్‌కు ఒక రోజు ముందే ఈ ఫలితాలు వెలువడటంతో కొత్త బ్రెజ్జాపై వినియోగదారుల్లో ఆసక్తి మరింత పెరిగింది. కొత్త బ్రెజ్జా 24 జులై 2026న లాంచ్ అయింది.
భారత్ NCAP విడుదల చేసిన వివరాల ప్రకారం, 2026 మారుతి బ్రెజ్జా అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP) విభాగంలో 32 మార్కులకు గాను 30.41 మార్కులు సాధించింది. అలాగే చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP) విభాగంలో 49 మార్కులకు గాను 43 మార్కులు సాధించి రెండు విభాగాల్లోనూ 5 స్టార్ రేటింగ్ అందుకుంది.
ఈ క్రాష్ టెస్ట్‌లో 2026 మారుతి బ్రెజ్జా ZXI+ 1.5L 6AT వేరియంట్‌ను పరీక్షించారు. అయితే ఈ ఫలితాలు బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లోని అన్ని వేరియంట్‌లకు వర్తిస్తాయని భారత్ NCAP స్పష్టం చేసింది. అంటే బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు భద్రతా ప్రమాణాల్లో ఇదే రేటింగ్ వర్తిస్తుంది.
ఇది కూడా చదవండి: హైరైడర్ హైబ్రిడ్ & డస్టర్ టర్బో DCT కంపారిజన్ - లాంగ్‌టర్మ్‌లో ఎక్కువ లాభం ఇచ్చేది ఏ కారు?
పెద్దల భద్రత
అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ పరీక్షల్లో భాగంగా ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బ్యారియర్ టెస్ట్‌లో బ్రెజ్జా 16 మార్కులకు గాను 14.41 మార్కులు సాధించింది. సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బ్యారియర్ టెస్ట్‌లో మాత్రం పూర్తి 16కు 16 మార్కులు సాధించింది. మొత్తం కలిపి 30.41/32 స్కోర్ నమోదు చేసింది.
ఫ్రంటల్ ఆఫ్‌సెట్ టెస్ట్‌లో డ్రైవర్ తల, మెడ, పెల్విస్, తొడలు & పాదాలకు 'గుడ్' రక్షణ లభించినట్లు నివేదిక వెల్లడించింది. ఛాతీ & కాళ్ల దిగువ భాగాలకు 'అడిక్వేట్' స్థాయి రక్షణ లభించింది. సహ ప్రయాణికుడి విషయంలో కూడా తల, మెడ, ఛాతీ, పెల్విస్ వంటి కీలక భాగాలకు 'గుడ్' రక్షణ లభించగా, కాళ్ల దిగువ భాగాలకు 'అడిక్వేట్' రక్షణ లభించింది.
సైడ్ మూవబుల్ బ్యారియర్ & సైడ్ పోల్ ఇంపాక్ట్ పరీక్షల్లో ప్రయాణికుడి తల, ఛాతీ, పొత్తికడుపు & పెల్విస్ వంటి అన్ని కీలక భాగాలకు 'గుడ్' రక్షణ లభించింది. సైడ్ పోల్ ఇంపాక్ట్ పరీక్షలో కూడా వాహనం పనితీరు 'OK'గా నమోదైంది.
ఇది కూడా చదవండి: eయాంపియర్ మాగ్నస్ గ్రాండ్ vs హోండా యాక్టివా ఇ! ఏది కొంటే మీకు లాభం?
పిల్లల భద్రత
చిన్నారుల భద్రత విభాగంలో 2026 బ్రెజ్జా అద్భుతమైన ఫలితాలు నమోదు చేసింది. డైనమిక్ స్కోర్‌లో పూర్తి 24కు 24 మార్కులు సాధించింది. అలాగే CRS ఇన్‌స్టాలేషన్ స్కోర్‌లో కూడా పూర్తి 12కు 12 మార్కులు దక్కాయి. అయితే వెహికల్ అసెస్‌మెంట్ విభాగంలో 13 మార్కులకు గాను 7 మార్కులు మాత్రమే రావడంతో మొత్తం స్కోర్ 49లో 43 మార్కులకు పరిమితమైంది.
చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ పరీక్షల్లో 18 నెలల & 3 ఏళ్ల చిన్నారుల డమ్మీలను వెనుక వైపు చూసే విధంగా అమర్చిన చైల్డ్ సీట్లలో ఉంచి పరీక్షించారు. ఫ్రంటల్ క్రాష్‌లో రెండు డమ్మీలు కూడా పూర్తి 8కి 8 మార్కులు సాధించగా, సైడ్ క్రాష్‌లో 4కు 4 మార్కులు సాధించాయి. ఇది చిన్నారుల భద్రత పరంగా బ్రెజ్జా సామర్థ్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
పరీక్షించిన ZXI+ 1.5L 6AT వేరియంట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), అన్ని సీట్లకు సీట్‌బెల్ట్ రిమైండర్లు, ముందు సీట్లకు సీట్‌బెల్ట్ ప్రీటెన్షనర్లు & వెనుక అవుట్‌బోర్డ్ సీట్లలో ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజీలు వంటి కీలక భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
గమనించాల్సిన విషయం ఏమిటంటే, 2018లో గ్లోబల్ NCAP పరీక్షించిన అప్పటి విటారా బ్రెజ్జా అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 4 స్టార్ & చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో కేవలం 2 స్టార్ రేటింగ్ మాత్రమే సాధించింది. ఇప్పుడు 2026 బ్రెజ్జా రెండు విభాగాల్లోనూ 5 స్టార్ రేటింగ్ సాధించింది. తద్వారా, మారుతి సుజుకి తన కార్లలో భద్రత ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరిచిందని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
