Mahindra Thar Facelift 2026: లైఫ్ స్టైల్ ఎస్‌యూవీ విభాగంలో రారాజుగా వెలుగుతున్న మహీంద్రా థార్ ఇప్పుడు సరికొత్త మిడ్-లైఫ్ అప్‌డేట్‌కు సిద్ధమవుతోంది. తాజాగా బయటకు వచ్చిన స్పై షాట్స్ ప్రకారం, 3-డోర్ థార్ తన ప్లాగ్ షిప్ 'థార్ రాక్స్' (Thar Roxx) స్టైలింగ్ ను అందిపుచ్చుకోబోతోంది. టెస్ట్ మ్యూల్ పైన ఉన్న కవర్లు లోపలి వివరాలను దాచే ప్రయత్నం చేసినా, భవిష్యత్తులో ఈ మోడల్ ఎలా ఉండబోతుందో స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది.
బయటి డిజైన్ లో మార్పులు
కొత్త థార్ తన క్లాసిక్ బాక్సీ రూపాన్ని అలాగే ఉంచుకున్నప్పటికీ, ఎక్స్‌టీరియర్ లో కొన్ని మేజర్ మార్పులు జరిగాయి. ముఖ్యంగా ముందు భాగంలో సర్క్యులర్ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, రాక్స్ మోడల్‌ను పోలి ఉండే సి-షేప్ (C-shaped) ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు ఉన్న ట్రెడిషనల్ ఏడు-స్లాట్ల గ్రిల్‌కు బదులుగా, ఇప్పుడు డబుల్-స్టాక్డ్ ఆరు-స్లాట్ల గ్రిల్ అమర్చారు. ఇది కారుకు మరింత మోడ్రన్ లుక్ ఇస్తుంది. రాక్స్ నుండి ఇన్స్పైర్ అయిన 19-అంగుళాల అలాయ్ వీల్స్, వెనుక వైపు రివైజ్డ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్ సిగ్నేచర్ దీని ప్రత్యేకతను చాటుతాయి.
లగ్జరీ ఇంటీరియర్, ఫీచర్లు
క్యాబిన్ లోపలి భాగం గురించి అధికారిక వివరాలు తెలియకపోయినా, రాక్స్ స్థాయి ఫినిషింగ్ ఉంటుందని ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఫ్రంట్ పవర్ విండోస్, ఆటో-డిమ్మింగ్ రియర్ వ్యూ మిర్రర్ వంటి సౌకర్యాలు ఇందులో ఉండే అవకాశం ఉంది. వీటితో పాటు పవర్-ఫోల్డింగ్ ఓఆర్‌వీఎంలు (ORVMs), పుష్-బటన్ స్టార్ట్‌తో కూడిన కీలెన్ ఎంట్రీ, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వంటి ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లో కూడా భారీ మార్పులు జరగనున్నాయి. పెద్ద టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో కూడిన అడ్వాన్స్‌డ్ లేఅవుట్ వచ్చే ఛాన్స్ ఉంది.
ఇంజిన్, పవర్ వివరాలు
మెకానికల్ పరంగా చూస్తే, ప్రస్తుత పవర్‌ట్రైన్ ఆప్షన్లనే మహీంద్రా కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఇందులో 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్, 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంటాయి. ఇవి మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి. ఆఫ్-రోడ్ ప్రియుల కోసం 4x4 పవర్‌ట్రైన్ తో పాటు రోజువారీ వాడకానికి అనువైన ఆర్‌డబ్ల్యూడీ (RWD) ఆప్షన్లను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. త్వరలోనే ఈ సరికొత్త థార్ ఇండియన్ రోడ్లపై సందడి చేయనుంది.
