Viral News: ప్రస్తుతం భూమి రెండు చంద్రోదయాల అనుభూతిని పొందుతోంది. ఇది 8 వారాల  ముచ్చటే అయినా ఆ ముచ్చటకు మహాభారతంలోని ఒక పేరు కూడా కారణం అవుతోంది. అదే అర్జున. గాంఢివధారి అర్జునుడి పేరుతో ఉన్న ఆస్టరాయిడ్ బెల్ట్ నుంచే ఈ గ్రహశకలం భూమికి దగ్గరగా వచ్చింది. అసలు ఆ మహాభారత యోధుడి పేరు ఈ ఆస్టరాయిడ్ బెల్ట్‌కు ఎందుకు వచ్చిందో ఈ కథనంలో తెలుసుకుందాం.


56 రోజుల పాటు భూమి చూట్టూ గ్రహశకలం చక్కర్లు:


సౌర మండలంలోని కొన్ని ఇతర గ్రహాల మాదిరే భూమికి కూడా ఒకటికి మించి చందమామలు సాకారమయ్యాయి. ఇప్పుడున్న మూన్‌తో పాటే భూమికి రెండో మూన్‌ కూడా వచ్చింది. అయితే ఇది రెండు నెలలు మాత్రమే ఉంటుంది. అర్జున ఆస్టరాయిడ్ బెల్ట్‌లో ఉన్న 2024PT5 గా పిలిచే ఒక ఆస్టరాయిడ్‌ సెప్టెంబర్‌ 29 నుంచి నవంబర్ 25 వరకు దాదాపు 8 వారాల పాటు భూకక్ష్యలో పరిభ్రమిస్తుంది. ఆ తర్వాత మళ్లీ తన దిశను మార్చుకొని తిరిగి సూర్యుడి కక్ష్యలోకి వెళ్లిపోతుంది. అయితే ఈ రెండో మూన్‌ను చూడగలమా అంటే కష్టసాధ్యమే.


అమెచ్యూర్ టెలిస్కోప్స్‌, బైనాక్లోర్స్ సాయంతో ఈ 2024PT5 ను చూడలేము. పెద్ద టెలిస్కోప్‌లు, ఇతర అధునాత ఎక్విప్‌మెంట్ సాయంతో స్పేస్ శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని చూడగలుగుతున్నారు. 30 ఇంచెస్ డయామీటర్ ఉన్న CCD లేదా CMOS డిటెక్టర్ ఉన్న టెలిస్కోప్ సాయంతో ఈ రెండో చందమామను విశ్లేషిస్తున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని 2024PT5ను ఫొటోమెట్రిక్‌, స్పెక్ట్రోమెట్రిక్ విశ్లేషణ చేస్తున్నారు. తద్వారా నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్‌ మీద పరిశోధన చేసి మన సోలార్ సిస్టమ్‌లోని ప్రత్యేకతలపై అవగాహన పెంచుకోవడానికి శాస్త్రవేత్తలకు అవకాశం దొరికింది.


అట్లాస్‌ గుర్తించిన రెండో చంద్రోదయం:


ఈ 2024PT5 గ్రహశకలాన్ని తొలిసారి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గుర్తించింది. గ్రహశకలాల కోసం అది చేపట్టిన ఆస్టరాయిడ్ టెరెన్షియల్ ఇంపాక్ట్‌ లాస్ట్ అలెర్ట్ సిస్టమ్‌ - అట్లాస్ దీనిని తొలి సారి ఆగస్టు 7న గుర్తించింది. ఇది దాదాపు 33 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఇలాంటి ఆస్టరాయిడ్స్‌ భూమికి 45 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుంటాయి. ఒక వేళ అర్జున బెల్టులోని ఈ ఆస్టరాయిడ్లు గంటకు కేవలం 3 వేల 540 కిలోమీటర్ల వేగంతోనే పరిభ్రమిస్తూ ఉంటే అవి భూ గురుత్వాకర్షణ శక్తికి గురై భూ కక్ష్యలోకి వస్తుంటాయి. ఐతే ఈ గ్రహాలు తాత్కాలికంగా కొంత కాలం భూ కక్ష్యలో ఉండి మళ్లీ సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి కారణంగా భూ కక్ష్యను వదిలి సూర్యుడి కక్ష్యలోకి వెళ్తుంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు.


ప్రస్తుతం వస్తున్న గ్రహశకలం ఈ కారణాలతోనే భూ గ్రహం చుట్టూ రెండు నెలలు పరిభ్రమిస్తుంది. ఐతే ఇలాంటి సెకండ్ మూన్ ఈవెంట్‌లు భూమికి కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటివి జరిగాయి. 2022 NX 1 గ్రహశకలం 1981లో ఒకసారి ఆ తర్వాత 2022లో ఒకసారి భూ కక్ష్యలోకి వచ్చి కొద్ది రోజుల పాటు ఉండి వెళ్లాయి. ఇవాళ్టి నుంచి కనిపించే 2024పీటీ5 గ్రహశకలం కూడా రెండు నెలల్లో భూకక్ష్య నుంచి వెనక్కి వెళ్లినా మళ్లీ తిరిగి 2055లో భూమికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.


రెండో మామయ్యకు మహాభారతంతో సంబంధం


ఈ రెండో మూన్‌ అర్జున ఆస్టరాయిడ్ బెల్ట్ నుంచి వచ్చింది. దీనికి ఆ పేరు పెట్టడం వెనుక మహాభారత స్ఫూర్తి ఉంది. మహాభారతంలో అత్యంత గొప్ప యోధుడు అర్జునుడు. సాక్ష్యాత్‌ ఆ శ్రీకృష్ణుడే అర్జునుడికి సారథిగా ఉండి నడిపించాడు. ఆ యోధుడి విల్లు నుంచి వచ్చే ప్రతి శరం అసమాన వేగంతో దూసుకెళ్లేది. కొద్ది సమయంలోనే వేల బాణాలు సంధించగల ధనుర్విద్య అర్జునుడి సొంతం. ఆయన విల్లు నుంచి వచ్చే బాణం కూడా ఆస్టరాయిడ్ బెల్టులో ఉన్న గ్రహశకలాల వేగంతో ముందుకు వెళ్లేది. అందుకే ఆ ఆస్టరాయిడ్ బెల్టుకు మహాభారత వీరుడు అర్జునుడి పేరును అంతరిక్ష శాస్త్రవేత్తలు పెట్టారు. ఈ ఆస్టరాయిడ్ బెల్టు ఆర్బిట్ కూడా భూ కక్ష్యకు దగ్గరగా ఉంటుంది. అందుకే అప్పుడప్పుడూ ఆ బెల్ట్ నుంచి గ్రహశకలాలు చుట్టపు చూపుగా భూ కక్ష్యలోకి వచ్చి వెళ్తూ మినీ మూన్ ఈవెంట్ అనుభూతిని ఇస్తుంటాయి. ఈ బెల్ట్ సూర్యుడి నుంచి 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో పరిభ్రమిస్తూ ఉంటుంది.


Also Read: “హార్న్ ఓకే ప్లీజ్” వెనుక ఇంత కథ ఉందా? మహారాష్ట్రలో ఈ పదాన్ని బ్యాన్ చేయడానికి కారణం తెలుసా?