Shukra Gochar : హిందూ జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని విలాసాలు, ప్రేమ, సంపద, శాంతిని ప్రభావితం చేసే కారక గ్రహంగా పరిగణిస్తారు. శుక్రుడు రాశిని మార్చినప్పుడు, అన్ని రాశిచక్ర గుర్తుల గ్రహ స్థితి ప్రభావితమవుతుంది. ఆగస్టు 20 రాత్రి శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు.. బుధుడుతో కలిసి లక్ష్మీ నారాయణ యోగాన్ని ఏర్పరుస్తాడు. శుక్రుడు ఆర్ద్ర, పునర్వసు , పుష్య నక్షత్రాలలో ఉంటాడు.
తులా , వృషభ రాశికి అధిపతి శుక్రుడు
శుక్రుడు మీన రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉంటాడు, కన్యారాశిలో నీచ స్థితిలో ఉంటాడు. ఉచ్ఛ శుక్రుడు శుభ ఫలితాలను ఇస్తాడు, నీచ శుక్రుడు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. నవగ్రహాలలో ఒకటైన ఆరవ గ్రహం శుక్రుడు వృషభం, తులా రాశికి అధిపతిగా పరిగణిస్తారు. శుక్రుడు ఒక శుభ గ్రహం, ఒకవేళ శుక్రుడు జాతకంలో బలంగా ఉంటే, ఆ వ్యక్తికి మంచి ఫలితాలు వస్తాయి, అయితే బలహీనంగా ఉంటే అది అశుభ ఫలితాలను ఇస్తుంది. 27 నక్షత్రాలలో శుక్రుడు భరణి, పూర్వ ఫాల్గుణి , పూర్వాషాఢ నక్షత్రాలకు అధిపతి. గ్రహాల్లో బుధుడు, శని గ్రహాలు శుక్రుడికి మిత్ర గ్రహాలు, అయితే సూర్యుడు , చంద్రుడు అతని శత్రు గ్రహాలుగా పరిగణిస్తారు.
శుక్రుడి అనుగ్రహం కోసం
వారంలో శుక్రవారం రోజు శుక్రుడికి అంకితం చేస్తారు..ఈ రోజు శుభఫలితాలు రావాలన్నా, శుక్రుడి అనుగ్రహం పొందాలన్నా కొన్ని అనుసరించాలి. మహిళలను గౌరవించడం, పరశురాముడిని ఆరాధించడం ద్వారా కూడా శుక్రుడి అనుగ్రహం లభిస్తుంది. శుక్రుడు శుభ స్థానంలో ఉంటే వ్యక్తి భౌతిక, శారీరక , వైవాహిక సుఖాలను పొందుతాడు. అందుకే జ్యోతిష్యంలో శుక్ర గ్రహాన్ని భౌతిక సుఖం, వైవాహిక సుఖం, భోగభాగ్యాలు, కీర్తి, కళా ప్రతిభ, సౌందర్యం, శృంగారం, కామవాంఛ , ఫ్యాషన్-డిజైనింగ్ మొదలైన వాటికి కారకంగా భావిస్తారు.
శుక్రుడి దగ్గర అమృత సంజీవని
అమృత సంజీవనికి అధిపతి అయిన శుక్రుడు భూమికి దగ్గరగా ఉన్నాడు. శుక్రుడి దగ్గర అమృత సంజీవని ఉంది. దీని కారణంగా, ప్రకృతి వైపరీత్యాలు అవాంఛిత సంఘటనలు జనశూన్య ప్రదేశాలలో జరిగే అవకాశం ఉంది. శుక్రుడు అమృత సంజీవని కారణంగా ప్రమాదానికి గురైన వారిని రక్షించగలుగుతాడు. కలియుగంలో శుక్రుడిని అత్యంత ప్రభావవంతమైన గ్రహాలలో ఒకటిగా చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. అందుకే జాతకంలో శుక్రుడి సంచారం అత్యంత ప్రభావాన్ని చూపిస్తుంది. శుభ శుక్రుడు జీవితంలో సుఖం, శ్రేయస్సు మరియు విలాసాలకు కారకంగా ఉంటాడు. అదే సమయంలో, శుక్రుడు అశుభంగా ఉన్నప్పుడు, అది వ్యక్తికి అనారోగ్యం, అపకీర్తి , సుఖాలలో లోటును కలిగిస్తుంది.
శుక్రుడి శుభ ప్రభావం
శుభ శుక్రుడు వ్యక్తిని కళా రంగంలో నైపుణ్యం కలిగిన వ్యక్తిగా చేస్తాడు. శుక్రుడు శుభస్థానంలో ఉన్న వ్యక్తి వినోద రంగంలో పేరు తెచ్చుకుంటాడు. శుక్రుడు మీడియా, సినిమా, సంగీతం, ఫ్యాషన్ మొదలైన వాటిపై ఆసక్తిని కలిగిస్తాడు.
శుక్రుడి శుభ-అశుభ ప్రభావం
శుక్రుడు రాశిని మార్చడం వల్ల ఆహార పదార్థాల ధరలు సాధారణంగా ఉంటాయి. కూరగాయలు, నూనెగింజలు, పప్పుధాన్యాల ధరలు తగ్గుతాయి. యంత్రాల ధరలు పెరగవచ్చు. వ్యాపారంలో వేగం ఉంటుంది. బంగారం, వెండి ధరలు పెరుగుతాయి. పాల ఉత్పత్తుల ఉత్పత్తి పెరగవచ్చు. సౌకర్యాల వస్తువులలో కూడా పెరుగుదల ఉండవచ్చు. ఉద్యోగ రంగాలలో పెరుగుదల ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. దీనితో పాటు, రాజకీయాలలో హెచ్చు తగ్గులు ఉంటాయి. శుక్రుడి అశుభ ప్రభావం వల్ల ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా వస్తాయి.
శుక్ర గ్రహానికి సంబంధించిన పరిహారాలు
లక్ష్మీదేవిని పూజించండి. తెల్లటి వస్త్రాలను దానం చేయండి. ఆహారంలో కొంత భాగాన్ని ఆవు, కాకి , కుక్కకు పెట్టండి. శుక్రవారం ఉపవాసం ఉండండి.. ఈ రోజు పులుపు తినవద్దు. శ్రీ సూక్తం పారాయణం చేయండి. శుక్రవారం నాడు పెరుగు, ఖీర్, జొన్నలు, అత్తరు, రంగురంగుల బట్టలు, వెండి, బియ్యం దానం చేయండి.