YSRCP On Rajini : సూపర్ స్టార్ రజనీకాంత్‌పై వైఎస్ఆర్‌సీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆ పార్టీ సమర్థించుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ అంశంపై స్పందించింది. 5 కోట్ల మంది ప్రజలు తీర్పునిస్తే 23 సీట్లకు పరిమితమైన పార్టీ  టీడీపీ అని.. మూడు సార్లు దారుణంగా ఓడిపోయారని వైసీపీ విమర్శించారు.  సొంత ఊరిలో ఓడిపోయి కుప్పానికి పరిగెత్తిన ఫెయిల్యూర్ పాలిటీషియన్.. ఏపీని నాశనం చేసిన ఓ దుర్మార్గుడిని పొగిడితే ప్రశ్నించడం ఏ మాత్రం తప్పు కాదని స్పష్టం చేసింది.  


 





 


అంతకు ముందు రజనీకాంత్ పై వైఎస్ఆర్‌సీపీ నేతలు దుర్భాషలను చంద్రబాబు ప్రశ్నించారు.  వైఎస్ఆర్‌సీపీ గురించి ఒక్క మాట మాట్లాడకపోయినా.. విమర్శించకపోయినా సూపర్ స్టార్‌ను అసభ్యంగా తిట్టడంపై క్షమాపణలు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 


 





 


ఎన్టీఆర్ శత  జయంతి వేడుకల్లో రజనీకాంత్ చంద్రబాబును పొగిడిన అంశంపై వైఎస్ఆర్‌సీపీ నేతలు చేస్తున్న విమర్శలు వివాదాస్పదం అవుతున్నాయి.   వైసీపీ నేతలు గత రెండు రోజులుగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ రజనీకాంత్ తో పాటు ఆయన కుటుంబంపైనా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.   ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్‌, చంద్రబాబుతో తనకున్న అనుబంధాన్ని రజనీ గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో వారిని పొగిడారు. దీంతో రజనీ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు.                      


మంత్రి రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు తదితరులు కోలీవుడ్ సూపర్‌ స్టార్‌పై తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయాల గురించి మాట్లాడే అర్హత రజనీకి లేదని, ఆయన తమిళనాడులో హీరో కావొచ్చు గానీ ఇక్కడ కాదని, పక్క రాష్ట్రం నుంచి వచ్చి నీతులు చెబితే వినే స్థితిలో తాము లేమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాయలేని విధంగా కొడాలి నాని సహా పలువురు నేతలు దూషించడంతో రజనీకాంత్‌ అభిమానులు మండి పడుతున్నారు.   వైసీపీ నేతలు తమ అభిమాన హీరోకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.