Assembly elections 2024: గత ఎన్నికల్లో వైసీపీ (Ysrcp) కి గ్రేటర్ రాయలసీమ (Rayalaseema) పట్టం కట్టింది. సీమలో బలమైన సామాజిక వర్గంగా పేరున్న బలిజలు ముందు వరుసలో ఉన్నారు. ఈసారి ఆ సామాజిక వర్గానికి వైసీపీ మొండిచేయి చూపించింది.  రాష్టంలో కాపులు అనే పేరుతో పిలువబడుతున్నా... గ్రేటర్ రాయలసీమలో మాత్రం బలిజలుగా పిలుస్తారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాలలో గణనీయ సంఖ్యలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు... వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.  చిత్తూరు నియోజకవర్గం నుంచి అరణి శ్రీనివాసులు, ప్రకాశం జిల్లా దర్శి నుంచి మద్ధిశెట్టి వేణుగోపాల్‌ ఉన్నారు. ఈ రెండు స్థానాల్లో బలిజలను కాదని...చిత్తూరు నుంచి విజయానందారెడ్డి, దర్శి నుంచి శివప్రసాద్ రెడ్డిలకు అవకాశం కల్పించారు. 


25 నియోజకవర్గాల్లో గెలుపోటములపై ప్రభావం
ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి... 70కిపైగా నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. వీటిలో అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్‌ స్థానాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ప్రకటించిన జాబితాల్లో బలిజలకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంపై చర్చ జరుగుతోంది. గ్రేటర్ రాయలసీమ పరిధిలో 25 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసేంత బలం ఉంది. మూడు పార్లమెంట్‌ పార్లమెంట్‌ స్థానాల పరిధిలో బలిజల జనాభా భారీగా ఉంది. రాజంపేట పార్లమెంటు పరిధిలో ఏకంగా మూడు లక్షల ఓటర్లు ఉన్నారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో అయితే తిరుపతి, గూడూరు, శ్రీకాళహస్తి, సర్వేపల్లి నియోజకవర్గాల్లోనూ భారీగా ఉన్నారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఆశించిన స్థాయిలో బలిజలు ఉన్నారు. కర్నూలు జిల్లాలో అళ్ళగడ్డ, నంద్యాల, కర్నూలు సిటి, ఎమ్మిగనూరు, అదోని నియోజకవర్గాల్లో ఎక్కువ ప్రభావం ఉంటుంది.


ఆగ్రహంతో రగలిపోతున్న బలిజలు
గత ఎన్నికల్లో వీరి ఓట్లతో అధికార పార్టీ భారీగా లబ్దిపొందింది. ఈ సారి ఆ సామాజిక వర్గ నేతలకు ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకపోవడంపై బలిజ నేతలతో ఆగ్రహంతో రగలిపోతున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులుకు రాజ్యసభ ఇస్తామని హామీ ఇచ్చి... చివరిలో హ్యాండ్ ఇవ్వడంతో రగిలిపోతున్నారు. వైసీపీలో బలిజ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సామాజిక వర్గాన్ని వాడుకొని...సొంత సామాజిక వర్గానికి పదవులు ఇచ్చారని  అంటున్నారు. గ్రేటర్ రాయలసీమ కాపు సంఘం నేతలు...వైసీపీ నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా రాజంపేట పరిధిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం...రెండు అసెంబ్లీ, రాజంపేట పార్లమెంట్‌లో పోటీ చేస్తోంది. మదనపల్లి, పుంగనూరు, పీలేరు, తంబల్లపల్లి, రాజంపేట, రైల్వేకొడూరు నియోజకవర్గాల్లో మెజారిటీ బలిజల ఓట్లు దూరమైతే...ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. 


తిరుపతి పార్లమెంట్ పరిధిలో భారీగా ఓటర్లు
తిరుపతి పార్లమెంటు పరిధిలో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, గూడూరు, సర్వేపల్లిలో... వీరి ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది. చిత్తూరు పార్లమెంటులో చిత్తూరు, పలమనేరుల్లో ఓటింగ్ ఎక్కువ. ఉన్న ఇద్దరికి అవకాశం ఇవ్వడం వల్ల వచ్చే నష్టం లేనప్పటికీ...బలిజ సామాజికవర్గ నేతలకు టికెట్లు నిరాకరించడంపై పార్టీలో సైతం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయ్. సర్వేల పేరుతో అభ్యర్థులను మార్చడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. మరోవైపు బలిజ సామాజిక వర్గం నేతలు మాత్రం తమకు జరిగిన అన్యాయంపై...క్షేత్ర స్థాయిలోకి తీసుకుపోవడానికి సిద్ధమవుతున్నారు. ఓ బలమైన సామాజిక వర్గానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నది సమాధానం లేని ప్రశ్నగా మారిందని సీనియర్లు అంటున్నారు.