YSRCP Assembly: ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటూ వస్తున్న వైఎస్సార్సీపీ ఇక నుంచి సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. గురువారం జరిగే వైఎస్సార్సీపీ శాససనభాపక్ష సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఇందులో ఓ కీలకాంశం ఉంది. ఎవరికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఆ పార్టీ ఎమ్మెల్యయేలు దూరంగా ఉంటున్నారో.. ఆ పార్టీ అధినేత,శాసససభాపక్ష నేత వైఎస్ జగన్ మాత్రం అసెంబ్లీకి హాజరు కాబోవడం లేదు. కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంది. 

Continues below advertisement

పెద్దిరెడ్డి నేతృత్వంలో శాసనసభకి..

అయితే శాసనససభలో YSRCP పక్షానికి సీనియర్ ఎమ్మెల్యే, మాజీమంత్రి పెద్దిరెడ్డి నేతృత్వం వహించనున్నారు. శాసనసభపక్ష ఉపనేతగా ఉన్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించనున్నారు.పార్టీలోని కొందరు ముఖ్యనేతలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని ఎప్పటి నుంచో సూచిస్తున్నారు. మొత్తానికి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే పార్టీ అధినేత జగన్ మాత్రం సమావేశాలకు హాజరు కాకూడదనే నిర్ణయించారు. 

Continues below advertisement

వైసీపీ నిర్ణయంలో మార్పు ఎందుకు?

మాజీ సీఎం జగన్ మోహనరెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదన్న కారణంతో వైకాపా శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తోంది. పాలకపక్షానికి వ్యతిరేకంగా ఉన్న తమ పార్టీకి హోదా కల్పించడం సముచితం అని.. ప్రభుత్వం కావాలనే నిరాకరిస్తుండటంతో సమావేశాలకు హాజరుకాబోమని వైఎస్ జగన్ ఏడాదిన్నర క్రితమే ప్రకటించారు. ఆ మాట మీదనే ఉన్నామని ఈ మధ్యలో కూడా ఆయన చాలా సార్లు చెప్పారు. కానీ ఉన్నట్టుండి ఈ నిర్ణయంలో మార్పునకు కారణమేంటని చూస్తే..  ఈ మధ్య కాలంలో స్పీకర్ చేసిన ప్రకటన కారణంగా కనిపిస్తోంది. అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకు అలవెన్సులు నిలిపివేయడంతో పాటు.. వారిని అనర్హులుగా ప్రకటించే అంశాన్ని పరిశీలిస్తామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కొన్ని సందర్భాల్లో చెప్పారు.పైగా ఈ సమావేశాలకు ముందు డిజిటల్ అటెండెన్స్ తీసుకొస్తామని కూడా అన్నారు.దీంతో ఎమ్మెల్యేలలో అనర్హత భయం పట్టుకుంది. 

ఉపఎన్నికలకు వెళ్లడం అవసరమా..?ప్రభుత్వ సంకేతాలు చూస్తే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కూడా వేసేలా కనిపించింది. దీంతో కొంతమంది ఎమ్మెల్యేలకు అనర్హత భయం పట్టుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉపఎన్నికలకు వెళ్లే ధైర్యం వాళ్లు చేయలేరు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం మాత్రమే కాదు..గెలిచే అవకాశాలు కూడా తక్కువ. అందుకే అంతర్గతంగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలన్న ఓ వాదన తీసుకొచ్చారు. ఈ మధ్య కాలంలో జగన్ కూడా ఎమ్మెల్యేలతో  " పెద్దిరెడ్డన్న వస్తారు.. మీతో.. ఆయనతో అసెంబ్లీకి వెళ్లండి" అని చెప్పారు. 

అధ్యక్షా.. అనలేమా..! 

అనర్హత భయం ఒక్కటే కాదు.. ఇప్పుడు గెలిచిన వాళ్లలో కొంతమంది మొదటి సారి ఎమ్మెల్యేలున్నారు.వాళ్లు కనీసం అసెంబ్లీకి వెళ్లి "అధ్యక్షా..!" అనలేదు. పార్టీ అధినేతకు గౌరవం దక్కలేదని ఎమ్మెల్యేలకు అసెంబ్లీని దూరం చేయడం ఏంటన్న వాదన వస్తోంది. పైగా శాసనసభ్యుడు అనే హోదాకు పరిపూర్ణత వాళ్లు అసెంబ్లీకి వెళితేనే వస్తుంది. శాసనసభకు వెళ్లకుండా "శాసనసభ్యుడు"  అని ఎలా చెప్పుకుంటారని టీడీపీ విమర్శిస్తోంది.  పార్టీలోని బోత్స, పెద్దిరెడ్డి వంటి సీనియర్లు కూడా అసెంబ్లీకి వెళ్లడం సరైన నిర్ణయమని.. అసెంబ్లీకి వెళ్లకుండా సమస్యలపై పోరాటం ఎలా చేస్తామని జగన్‌కు నచ్చజెప్పారు. 

కారణాలేమైనా కానీ మొత్తానికి అసెంబ్లీకి వెళ్లడానికి వైసీపీ నిర్ణయించుకుంది.