YS Jagan Sensational Demand: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో (Vinukonda) హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని ఆయన శుక్రవారం పరామర్శించారు. రాష్ట్రంలో పరిస్థితులపై ఈ నెల 24న పార్టీ ప్రతినిధులతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తామని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాడులు పెరిగాయని మండిపడ్డారు. 'రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నా వారు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. దాడులపై ప్రధాని మోదీని కలుస్తాం. ప్రస్తుతం ఆటవిక పాలన నడుస్తోంది. 46 రోజుల పాలనలో 36 హత్యా రాజకీయాలు, 560 ప్రాంతాల్లో ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం, 300కు పైగా హత్యాయత్నాలు, 490 ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. వైసీపీ సానుభూతిపరుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వెయ్యికి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయి. బాధితులపైనే తిరిగి కేసులు నమోదు చేస్తున్నారు.' అంటూ జగన్ ధ్వజమెత్తారు.
'కిరాతకంగా చంపేశారు'
'వినుకొండలో రషీద్‌ను నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే నిందితుడు నరికాడు. కేవలం వైసీపీ కోసం పని చేశాడనే ఈ హత్య చేశారు. హత్య చేసిన జిలానీ వైసీపీ వ్యక్తి అని ప్రచారం చేస్తున్నారు. ఇది కక్షపూరితంగా జరిగిన హత్య అని చెబుతున్నారు. రాష్ట్రంలో అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. పుంగనూరులో మిథున్ రెడ్డి, రెడ్డప్పలపై పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగాయి. వినుకొండ ఎస్పీని ఎన్నికల వేళ పలుకుబడితో మార్చేశారు. రాష్ట్రంలో అరాచక పాలనపై ఢిల్లీలో ధర్నా చేపడతాం. రాష్ట్రపతి, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కోరతాం. రాష్ట్రంలో పరిస్థితి వివరిస్తాం.' అని జగన్ పేర్కొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
అంతకు ముందు వినుకొండలో బాధిత కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. రషీద్ తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రషీద్ హత్యపై అతని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. వ్యక్తిగత కారణాలతోనే హత్య చేశారని చెబుతున్నారని.. కానీ రాజకీయ కక్షలతోనే హత్య చేశారని జగన్ దృష్టికి తెచ్చారు. రషీద్ హత్య వెనుక కుట్ర ఉందని.. ప్రధాన నిందితుల పేర్లు ఎఫ్ఐఆర్‌లో లేవన్నారు.
జగన్ భద్రతపై..
మరోవైపు, వినుకొండ పర్యటన సందర్భంగా జగన్‌కు కేటాయించిన భద్రత వాహనాలపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఆయన భద్రతపై నిర్లక్ష్యం చేస్తోందని పాత వాహనాలు ఇచ్చారని ఆరోపించారు. కండిషన్‌లో లేని వాహనాలు ఇచ్చారని భద్రత తగ్గించారని అన్నారు. అయితే, దీనిపై పోలీస్ శాఖ స్పష్టత ఇచ్చింది. జగన్‌కు ప్రస్తుతం జెడ్ ప్లస్ సెక్యూరిటీకి ఇచ్చే భద్రత ఉందని చెప్పారు. ఆయనకు కేటాయించిన వాహనం పూర్తి ఫిట్‌నెస్‌తోనే ఉందని అన్నారు. కండిషన్ చూసిన తర్వాతే వీఐపీకి కేటాయించామని అధికారులు చెప్పారు.
Also Read: YS Jagan : వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు ఆగిపోయిందా ? - ఇదిగో పోలీసులు ఇచ్చిన క్లారిటీ