CM Jagan : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి  ఔదార్యం చాటుకున్నారు.  వివిధ వ్యాధులతో బాధపడుతున్న రైతు, ఇద్దరు చిన్నారుల చికిత్సకు ఆర్థిక సహాయం అందించారు.  వైఎస్ఆర్ జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ప్రమాదకర వ్యాధులతో బాధపడుతున్న  అనంతపురానికి చెందిన ఓ రైతు, పులివెందులకు చెందిన ఇద్దరు  చిన్న పిల్లలకు మెరుగైన వైద్య కోసం రెండు  కుటుంబాలకు ఆర్థికసాయం అందిస్తామని  సీఎం జగన్ హామీ ఇచ్చారు.



రైతుకు బ్రెయిన్ ట్యూమర్ 


అనంతపురం జిల్లా నార్పల మండలం గూగుడు గ్రామానికి చెందిన  జగన్మోహన్ రెడ్డి అనే రైతు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నారు.  అతని భార్య శివజ్యోతి  తమ సమస్యను సీఎం జగన్ కు చెప్పుకోడానికి ముగ్గురు పిల్లలతో కలిసి పులివెందుల హెలిప్యాడ్ వేచిచూస్తుంది. వీరిని గమనించిన సీఎం జగన్ పిలిచి సమస్యపై ఆరా తీశారు. ఆర్థికసాయం చేస్తామని హామీ ఇచ్చారు. నవంబర్ 12 నుంచి  ఆస్టర్ సి.ఎం.ఇ బెంగళూరు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తన భర్తకు  రూ. 20 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారని,  మీరే ఆదుకోవాలని ముఖ్యమంత్రికి శివజ్యోతి విన్నవించింది. వారితో మాట్లాడిన ముఖ్యమంత్రి తక్షణమే రూ.2 లక్షలు  మీ అకౌంట్ లోకి వేస్తామని, పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరించి చికిత్స అందిస్తుందని ఆమెకు భరోసా కల్పించారు. 


ఎనీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు 


పులివెందులలో ఉంటున్న శివకుమార్, వరలక్ష్మికి ఇద్దరు పిల్లలు. టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు శివకుమారు. వారి ఇద్దరు పిల్లలూ తీవ్రమైన ఎనీమియా వ్యాధితో బాధపడుతున్నట్లు వారికి రక్తం పెరుగుదలకు ఇంజక్షన్ వాడుతున్నామన్నారు. వీరు శనివారం సీఎం జగన్ ను కలిసి సాయం చేయాలని కోరారు. పిల్లల ఆరోగ్యం  కోసం చెన్నై, బెంగళూరు వంటి మహానగరాలకు తిరిగినామన్నారు. ఈ వ్యాధి ఆరోగ్య శ్రీ కిందకు రాదన్నారని ప్రస్తుతం హైదరాబాద్ లోని అమెరికన్ అంకాలజిస్ట్  దగ్గర చికిత్స చేయిస్తున్నామని ఇప్పటికి  రూ.15 లక్షలు ఖర్చు అయిందన్నారు. సర్వం అమ్ముకొని పిల్లలకు వైద్యం చేయించామని, మీరే మమ్మల్ని మా పిల్లల్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కలసి అర్జీ సమర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి పిల్లల ఆరోగ్యానికి  మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. 


శ్రీకాకుళంలో 


సీఎం జగన్ ఇటీవల ఉదారత చాటుకున్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించిన సీఎం జగన్ బహిరంగ సభకు వెళ్తూ కాన్వాయ్‌ నుంచి గమనించి బాధితులను పరామర్శించారు.  తమ కుమార్తె వైద్యానికి అవసరమైన సాయం చేయాలని విజయనగరం జిల్లా చిన్న శిర్లాం గ్రామానికి చెందిన మీసాల కృష్ణవేణి సీఎం జగన్ ను వేడుకున్నారు. కృష్ణవేణి కుమార్తె ఇంద్రజ (7 సంవత్సరాలు) అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. చిన్నారి పరిస్థితిని తల్లిదండ్రులు సీఎంకి వివరించారు. వెంటనే స్పందించిన సీఎం  వైఎస్‌ జగన్, ఇంద్రజకు అవసరమైన పూర్తి వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 


సీఎం జగన్ భరోసాతో చిన్నారికి చికిత్స 


పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం అయోధ్యలంక గ్రామానికి చెందిన రాంబాబు, నాగలక్ష్మి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే వీరి రెండో సంతానమైన చిన్నారికి అంతుచిక్కని వ్యాధి సోకి అనారోగ్యం పాలైంది. ఎన్నో ఆసుపత్రుల్లో సంప్రదించి చికిత్స అందించారు. కానీ నయం కాలేదు. కానీ ఆ వ్యాధి నయం కావాలంటే కోటి రూపాయలపైగా అవుతుందని వైద్యలు తేల్చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ చిన్నారి‌ కుటుంబం అయోమయం స్థితిలో పడింది. తమకు ఎవరు సాయం చేస్తారో తెలియని స్థితిలో తెలిసిన వారందనీ సాయం అడిగారు. కానీ అంత మొత్తంలో డబ్బును ఎవరూ సమకూర్చలేకపోయారు. జులై నెలలో సీఎం జగన్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. అదే సమయంలో సీఎంను కలిసేందుకు దంపతులిద్దరూ సీఎం వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. వారిని గమనించిన సీఎం జగన్ కాన్వాయ్ ను ఆపమని ఆదేశించారు. ఆ దంపతులను సీఎం వద్దకు తీసుకెళ్లారు. దీంతో సీఎం వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. చిన్నారి చికిత్సకు హామీ ఇచ్చిన జగన్, ఈ బాధ్యతను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు.