YS Viveka Case :  వైఎస్ వివేకానందరెడ్డి రెండో భార్య షమీమ్ సీబీఐకి ఇచ్చిన రిపోర్టు వెలుగు చూసింది. సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కీలక విషయాలను వెల్లడించారు. వైఎస్ వివేకానంద రెడ్డితో  2010 లో తనకు వివాహం అయ్యిందని షేక్ షమీమ్ తెలిపారు. అయితే   2011లో మరోసారి వివాహం చేసుకున్నామన్నారు. రెండు సార్లు వివాహం జరిగినట్లుగా షమీమ్ తెలిపారు.  2015లో తమకు షహన్ షా పుట్టారని సీబీఐకి తెలిపింది. వివేక హత్యకు కొన్ని గంటల ముందు కూడా తనతో  ఫోన్‌లో మాట్లాడినట్లు షమీమ్ తెలిపారు. తమ వివాహం వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని ఆమె తెలిపారు.  వివేకా బామ్మర్ది, అల్లుడి అన్న నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి తనను, తన కుటుంబ సభ్యుల్ని ఎన్నోసార్లు బెదిరించారని ఆమె సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో తెలిపారు.


వివేకాకు దూరంగా ఉండమని సునీతా రెడ్డి సైతం హెచ్చరించేదని షమీమ్ వెల్లడించారు. వివేకా ఆస్తిపై సునీత భర్త రాజశేఖర్‌కు, వివేకా పదవిపై శివప్రకాశ్ రెడ్డి కన్నేశారని షమీర్ ఆరోపించారు.  తమ కొడుకు షహన్ షా  పేరు మీద 4 ఏకరాలు కొందామని వివేకా అనుకున్నా.. శివ ప్రకాష్ రెడ్డి ఆపేశాడని ఆమె వివరించారు. వివేకాను సొంత కుటుంబ సభ్యులే దూరం పెట్టారని.. అన్యాయంగా వివేకా చెక్ పవర్ తొలగించారని ఆమె ఆరోపించారు. చెక్ పవర్ తొలగించడంతో వివేకా ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడని షమీమ్ తెలిపారు. బెంగుళూరు ల్యాండ్ సెటిల్మెంట్ ద్వారా 8 కోట్లు వస్తాయని వివేకా తనతో చెప్పాడని..  హత్యకు కొన్ని గంటల ముందు కూడా 8 కోట్లు గురించి ఆయన తనతో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. చనిపోయిన తరువాత వివేకా ఇంటికి వెళ్దామనుకున్న.. శివ ప్రకాష్ రెడ్డి మీద భయంతో అటు వైపు వెళ్లలేకపోయానని షమీమ్ వెల్లడించారు.


సీబీఐకి షేక్ షమీమ్ మూడు పేజీల స్టేట్‌మెంట్‌ను ఇచ్చారు. తనకు వివేకా గారికి పుట్టిన సంతానమే షేక్  షహన్ షా అని..  తాను డీఎన్‌ఏ టెస్ట్  కు సిద్ధమేనని షమీమ్ తెలిపారు.  మాకు సంతానం కలగలేదని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న దస్తగిరి  ..  నిరూపిస్తే నేను మీరు చెప్పినట్లు చేస్తానని పేర్కొన్నారు.   ఒకవేళ నిరూపించలేకపోతే వెంటనే ఈ హత్య చేసిన నీవు ఉరిశిక్షకు సిద్దమా అని దస్తగిరికి సవాల్ చేశారు.  తన లాయర్ ద్వారా మీడియాకు ఈ స్టేట్‌మెంట్‌ను  చేరేలా చేశారు.  దీంతో ఈ స్టేట్ మెంట్ అంశం సంచలనంగా మారింది.  


వైఎస్ అవినాష్ రెడ్డి వైెఎస్ వివేకా కుటుంబ వివాదాల గురించి  తాను కోర్టుల్లో వేసిన పిటిషన్లలో తరచూ  పేర్కొనేవారు.  వైఎస్ వివేకాకు అనేక వివాహేతర సంబంధాలు ఉన్నాయని చెప్పేవారు. వాటి కారణంగానే హత్య జరిగిందని తనకేం సంబంధం లేదని చెబుతూ వస్తున్నారు.  అయితే హత్య చేసినందున రూ. 40 కోట్ల డీల్ జరిగిందని సీబీఐ గుర్తించడంతో పాటు రూ. నాలుగు కోట్ల మొత్తం నిందితులకు ముందుగానే ఇచ్చారని చెబుతున్నారు. దీంతో కేసు కీలక మలుపులు తిరుగుతోంది.