YS Sunitha Sensational Comments on CM Jagan: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో (YS Viveka Murder Case) తన కుటుంబానికి సంబంధం ఉంటే ఇంత వరకూ ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన కుమార్తె వైఎస్ సునీత (YS Sunitha) నిలదీశారు. వివేకా ఐదో వర్థంతి సందర్భంగా కడపలో నిర్వహించిన స్మారక సభలో ఆమె మాట్లాడారు. నిందితులకు శిక్ష పడాలని తాము పోరాడుతుంటే.. తమపై అనవసర నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. వివేకానంద రెడ్డి తన జీవితాంతం వైఎస్ఆర్ కోసమే పని చేశారని.. ఆయన ఉమ్మడి కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారని అన్నారు. ఫ్యాక్షన్, హింసను తగ్గించాలని నిత్యం పరితపించే వారని చెప్పారు. అలాంటి వ్యక్తి చనిపోయి ఐదేళ్లైనా ఇప్పటివరకూ నిందితులకు శిక్ష పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 


'ఆ పదానికి అర్థం తెలుసా.?'


'సీఎం జగన్ కు అంతఃకరణ శుద్ధి అంటే అర్థం తెలుసా.?' అంటూ వైఎస్ సునీత ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన ప్రమాణస్వీకారం చేసిన తీరును ఆమె చదివి వినిపించారు. 'వివేకానందరెడ్డి మనకు దూరమై ఐదేళ్లైంది. ఆయనకు అంత కీడు ఎలా తలపెట్టారని ఆలోచిస్తున్నప్పుడే జగన్ సీఎం అయ్యారు. ప్రజలందరికీ న్యాయం చేస్తానని ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. జగనన్నను ఒక ప్రశ్న అడుగుతున్నా.?. అంతఃకరణ శుద్ధి అంటే ఏంటో ఆయనకు అర్థం తెలుసా.?. వివేకాను చంపిన వారికి, చంపించిన వారిని కఠినంగా శిక్షించాలి. వారికి శిక్ష పడేలా చేయాల్సిన బాధ్యత మీకు ఉంది. ఇప్పటివరకూ హంతకులను ఎందుకు శిక్షించలేదు. మీ ప్రమాణాన్ని ఎందుకు నిలబెట్టుకోలేదు..?. ప్రభుత్వంలో ఉండి మాపై ఆరోపణలు ఏంటి.?. హంతకులను పట్టిస్తే రూ.5 లక్షలు ఇస్తామని సీబీఐ ప్రకటించింది. మమ్మల్ని పట్టించి ఆ బహుమతి తీసుకోండి. పదే పదే మాపై ఆరోపణలు చేయడానికి మీకు సిగ్గుగా లేదా.?. మీ వద్ద ఆధారాలుంటే సీబీఐకి ఇవ్వండి. ఆధారాలు ఉండీ పోలీసులకు ఇవ్వకపోవడం నేరం. వ్యక్తిత్వంపై బురద జల్లడం దారుణం. మాపై నిందలు వేసినా.. మా నిర్దోషిత్వం నిరూపించుకుంటాం. మీకోసం చివరి వరకూ పని చేసిన వివేకానే మర్చిపోయారా.?. హత్య చేసిన వాళ్లు.. చేయించిన వారు ఓ వైపు, వారిని కాపాడుతున్న వారు మరోవైపు ఉన్నారు. ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలి.' అంటూ సునీత వ్యాఖ్యలు చేశారు.


అటు, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సైతం సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. 'అన్నా అని పిలిపించుకున్న వారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారు. చిన్నాన్న వైఎస్ వివేకా మరణంతో ఎక్కువగా నష్టపోయింది చిన్నమ్మ సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె సునీత. బాధితులకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన లేకపోగా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటివరకూ హత్య చేసిన, చేయించిన వారికి శిక్ష పడలేదు. చిన్నాన్న చివరి క్షణం వరకూ వైసీపీ కోసమే పని చేశారు. అలాంటి వ్యక్తిపై నిందలు వేస్తారా.?. సాక్షిలో పైన వైఎస్ ఫోటో.. కింద ఆయన తమ్ముడి వ్యక్తిత్వంపై నిందలు వేశారు. జగనన్నా.. అద్దం ముందు నిల్చొని ప్రశ్నించుకోండి. మీ మనస్సాక్షి ఏం చెబుతుందో వినండి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన తోబుట్టువుల కోసం ఏం చేశారో మీకు తెలియదా.? ఆయన వారసుడిగా మీరేం చేశారు. ఇది ఆస్తి, అంతస్తు కోసం జరుగుతున్న పోరాటం కాదు. న్యాయం కోసం పోరాటం. ప్రజలంతా ఓ నిర్ణయం తీసుకోవాలి.' అంటూ షర్మిల వ్యాఖ్యానించారు.


Also Read: Chandrababu: 'రాష్ట్ర యువత ఆశలు చంపేశారు' - ఏపీపీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం